ఉస్మానియా యూనివర్సిటీ: ఘరాన దొంగ మంత్రి శంకర్‌పై ఓయూ పోలీసులు రెండోసారి పీడీయాక్టు నమోదు చేశారు. ఆదివారం సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... 1979 నుంచి చోరీలు చేస్తున్న మంత్రి శంకర్ 155 కేసుల్లో నిందితుడు. ఓయూ పోలీసులు 2015లో శంకర్ పై పీడీయాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. ఏడాది పాటు జైలు జీవితాన్ని గడిపి మే నెలలో విడుదలైన శంకర్ మళ్లీ చోరీలు చేస్తున్నాడు.
ఇటీవల హబ్సిగూడ స్ట్రీట్ నంబర్.8లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శంకర్‌పై రెండవసారి పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన మంత్రి శంకర్ మూడు పెళ్లిళ్లు చేసుకొని నగరంలో స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు.
11 కేజీల గంజాయి పట్టివేత
సీతాఫల్‌మండి డివిజన్ రవీంద్రనగర్ (పిట్టల బస్తీ)లోని ఓ ఇంటిపై ఓయూ పోలీసులు దాడి చేశారు. 11 కేజీల గంజాయిని పట్టుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి కథనం ప్రకారం...రవీంద్రనగర్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు కామిని సాయి ఇంటిపై దాడి చేసి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.