సాక్షి, సిటీబ్యూరో: మంత్రి శంకర్... ఈ పేరు చెబితే పోలీసులకే కాదు, నగరవాసులకూ హడలే. ఒంటరిగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పంజా విసురుతాడు. 39 ఏళ్ల క్రితం తన 20వ ఏట తొలి నేరం చేసిన ఇతడిపై ఇప్పటి వరకు 255 కేసులు ఉన్నాయి. 32 సార్లు జైలుకు వెళ్లిన శంకర్‌పై ఇప్పటికి మూడుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇంతటి ఘరానా చరిత్ర ఉన్న మంత్రి శంకర్‌కు పమేరియన్ డాగ్స్ అంటే హడల్. అందుకే అవి ఉన్న ఇళ్లల్లో చోరీకి వెనుకడుగు వేస్తానంటూ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఘరానా దొంగతో పాటు అతడి సహాయకుడు దినకర్‌ను గత వారం కార్ఖానా పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.
ముషీరాబాద్ జైలులోనే నేర పాఠాలు...
చిలకలగూడ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్ (59) అలియాస్ శివన్న అలియాస్ శివప్రసాద్ తన 19వ ఏట 1979లో తొలిసారిగా నేరం చేశాడు. తన తల్లితో ఘర్షణ పడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేసి జైలుకు వెళ్ళాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో తన పంథా మార్చుకున్నాడు. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన అతను చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరంపై పోలీసులకు చిక్కడంతో అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. అక్కడే అతడికి ఘరానా దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేనా, నాగులుతో పరిచయం ఏర్పడింది. తాళం ఎలా పగులకొట్టాలో శంకర్‌కు నేర్పిన వీరు తొలిసారిగా జైలులోని వంటగది తాళాన్ని పగులగొట్టించారు. అక్కడే పదేపదే చోరీ చేయిస్తూ వంట సామగ్రి బయటికి తెప్పించి వండుకుని తినేవారు. దీంతో అతను జైలు నుంచి బయటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టడంలో ఆరితేరాడు. చిలకలగూడ, రామాంతపూర్, నేతాజీనగర్ ప్రాంతాల్లో మకాం ఏర్పాటు చేసుకున్న ఇతను ఒంటరిగా కేవలం తాళం వేసు ఉన్న ఇళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయేవాడు.
సూటు, బూటుతో..
ఓ చిన్న రాడ్డు, నాలుగు స్క్రూడ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్ ఎలాంటి తాళాన్నైనా కేవలం మూడు సెకన్లలో పగులకొడతాడు. ఖరీదైన వస్త్రాలు, బూట్లు, టై ధరించి కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే దర్జాగా వెళ్లి చోరీ చేసుకుని వెళ్తాడు. లేని పక్షంలో తాళం వేసున్న ఇల్లు దొరికే వరకు పిట్ట గోడలు దూకుతూ పక్కనున్న ఇళ్లల్లోకి వెళ్తూనే ఉంటాడు. ఇలా ఓ లైన్ పూర్తయిన తర్వాత మరో లైన్‌లోకి వెళ్లి తన టార్గెట్ పూర్తి చేసేవాడు. సాధారణంగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్యే దొంగతనం పూర్తి చేసేస్తాడు. చోరీ చేసిన అనంతరం ఆ ఇంటి మిద్దెపైనే తెల్లవారే వరకు కూర్చుంటాడు. మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలిసిపోయి తప్పించుకుంటాడు.
తరచూ మకాం మారుస్తూ...
మంత్రి శంకర్ ప్రధానంగా బోయిన్‌పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిలోనే పంజా విసిరేవాడు. ఆయా ప్రాంతాల్లో ప్రతి అంగుళం ఇతడికి తెలిసి ఉండటంతో వీటినే టార్గెట్‌గా చేసుకుంటాడు. 38 ఏళ్లుగా చోరీలు చేస్తున్న ఇతడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. 32 సార్లు అరెస్టైన ఇతను పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాడు. వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతడికి వ్యభిచారం ప్రధాన బలహీనత. దుస్తులు, బూట్లతో సహా ప్రతీది బ్రాండెడ్‌వి కొనుగోలు చేస్తాడు. జైల్లో లేని సమయంలో ప్రతి నెలా కనీసం 3–4 చోరీలు చేస్తుంటాడు. దాదాపు 255 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిపై 2015, 2017, 2018ల్లో మూడుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత నెల 19న జైలు నుంచి బయటకు వచ్చాడు.
కొన్నాళ్లుగా ముఠా..
శంకర్ దాదాపు 37 ఏళ్ల పాటు ఒంటరిగానే పంజా విసిరాడు. అయితే వయస్సు మీరడంతో రెండేళ్లుగా ముఠా కడుతున్నాడు. పాతబస్తీకి చెందిన ఒబేద్, జాఫర్‌ఖాన్‌లతో పాటు బన్సీలాల్‌పేటకు చెందిన దినకర్ ఇతడి అనుచరులు. వీరే ఇతడికి ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. సాధారణంగా చోరీ చేసిన సొత్తును కొన్ని ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటాడు. 1998 నుంచి 2009 వరకు రామాంతపూర్‌లోని నేతాజీనగర్‌లో నివసించాడు. 2009 నుంచి తన మకాంను మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ఔసా పట్టణానికీ మార్చి కొన్నాళ్లు అక్కడ ఉన్నాడు. మంత్రి శంకర్ తండ్రి మాజీ రైల్వే ఉద్యోగి.శంకర్ తల్లి గృహిణి కాగా ఇతను ఏకైన సంతానం. భారీ శునకాలకూ భయపడని శంకర్ పమేరియన్ డాగ్స్ ఉంటే మాత్రం ఆ ఇంట్లో చోరీకి వెనుకడుగు వేస్తుంటాడు. అవి అరిచి గోల చేస్తాయని, సముదాయించడం కష్టమనే అలా చేస్తుంటానని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment