Margin money
-
పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
ఐటీ మార్జిన్లు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఖరు వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. భారత ఐటీ సంస్థలను కలవరపరుస్తోంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇది దేశీ కంపెనీలకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చని కొందరు .. హెచ్1బీ వీసాలపై ఆధారపడటం తగ్గుతున్నందున పెద్దగా ప్రభావం ఉండదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. వీసాల రద్దుతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. ‘ఈ ఆదేశాలతో భారతీయ ఐటీ రంగంపైన .. ముఖ్యంగా సంస్థల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలో స్థానిక ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్న కంపెనీలపై ఇది మరింత ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొంది. హెచ్–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకున్నందున వాటిపై తాత్కాలిక సస్పెన్షన్ భారతీయ ఐటీ కంపెనీలపై ఒక మోస్తరు స్థాయిలోనే ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్నవారిపై ప్రభావం ఉండదని వివరించింది. ‘ప్రస్తుతం హెచ్–1బీ వీసాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది భారతీయ ఐటీ సంస్థలే. 2018 అక్టోబర్–2019 సెప్టెంబర్ మధ్యకాలంలో అమెరికా 3.88 లక్షల హెచ్–1బీ వీసాలు జారీ చేయగా (కొత్తవి, రెన్యువల్స్ కలపి) ఇందులో భారత్ వాటా 71.7 శాతంగా ఉంది’ అని పేర్కొంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలకు ఊతమిచ్చే దిశగా హెచ్–1బీ సహా విదేశీ వర్క్ వీసాలను ఈ సంవత్సరం ఆఖరు దాకా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది జూన్ 24 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్.. అమెరికాలో పనిచేసేందుకు ఎక్కువగా హెచ్–1బీ వీసాలపైనే ఆధారపడుతుంటారు. తాజా నిర్ణయం ఇప్పటికే ఈ వీసాలపై పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్‌తో పాటు అక్టోబర్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా వీసాలు పొందినవారిపైనా ప్రభావం చూపవచ్చని అంచనాలు ఉన్నాయి. ఆర్థిక పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదు.. భారతీయ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరుపై తాజా పరిణామాల ప్రభావాలు పెద్దగా ఉండకపోవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ ఐటీ అనలిస్టు మధు బాబు అభిప్రాయపడ్డారు. ‘వర్క్ వీసాలపై భారతీయ ఐటీ కంపెనీలు ఆధారపడటం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక అమెరికాలో ఇప్పటికే హెచ్–1బీ వీసాలపై ఉన్నవారు గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రకంగా చూస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు’ అని మధు బాబు తెలిపారు. దేశీ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలు 2017 నుంచి హెచ్–1బీ/ఎల్1 వీసాలపై ఆధారపడటాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నాయని, స్థానికంగా ఉద్యోగులను తీసుకోవడానికి, అమెరికాలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. టాప్ 5 భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం 45–70 శాతం దాకా స్థానికులే ఉన్నారని, తద్వారా హెచ్–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గిందని పేర్కొంది. ఉదాహరణకు 2016 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ అమెరికా కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య 35 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 63 శాతానికి పెరిగిందని వివరించింది. కరోనా వైరస్ పరిణామాలు భారత ఐటీ కంపెనీల డెలివరీ విధానాల్లో గణనీయంగా మార్పులు తెచ్చాయని, కార్యాలయాలపైనే ఆధారపడకుండా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కూడా సర్వీసులు అందించడం పెరిగిందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా ఆఫ్‌షోరింగ్‌ను మరింతగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఎకానమీకి చేటు: నాస్కామ్ హెచ్–1బీ వీసాల రద్దు ఆదేశాలు అపోహలతో తీసుకున్నవని, ఇవి అమెరికా ఎకానమీకి కూడా చేటు తెచ్చిపెడతాయని భారతీయ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. స్థానికంగా తగినంత స్థాయిలో నిపుణులు లేకపోవడంతో ఆఫ్‌షోరింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ‘అత్యంత నిపుణులైన వలసదారులు అమెరికాలోని ఆస్పత్రులు మొదలుకొని ఫార్మా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తయారీ తదితర రంగాల సంస్థల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి తోడ్పాటు లేకుం డా అమెరికా ఎకానమీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పరిశ్రమ మందగిస్తుంది. కరోనాకు ఔషధాలను అందుబాటులోకి తేవడంలో మరింత జాప్యం జరుగుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంక్షల వ్యవధిని 90 రోజులకు కుదించాలని, లేకపోతే కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ కంపెనీలకు ఇవి గుదిబండగా మారతాయని పేర్కొంది. అమెరికన్ టెక్ కంపెనీల అసంతృప్తి.. దేశీ ఐటీ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలైన గూగుల్ మొదలైనవి కూడా అత్యుత్తమ నైపుణ్యాలున్న భారతీయులను నియమించుకుంటూ ఉంటాయి. హెచ్–1బీ వీసాల రద్దు, భారతీయ ఐటీ రంగ అంశాలు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్స్‌లో నిల్చాయి. అమెరికా ప్రభుత్వ ఆదేశాలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షాన తాను నిలుస్తానని, అందరికీ అవకాశాలు లభించాలన్న లక్ష్య సాధన కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక వలసదారుల పక్షాన పోరాడే మానవ హక్కుల సంస్థలతో పాటు పలువురు అమెరికన్ నేతలు కూడా సస్పెన్షన్ ఆదేశాలను ఉపసంహరించాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి. -
అభ్యున్నతి ఓ నాటకం!
ఒంగోలు టూటౌన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. పరిశ్రమ ఏర్పాటుకు సొంత స్థలం ఉన్నప్పటికీ పెట్టుబడి (మార్జీన్మనీ)లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా అటు ఉద్యోగం రాక ఇటు ఎలాంటి వ్యాపారం చేయలేక జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 డిసెంబర్లో మార్జిన్ మనీ స్కీంకు సంబంధించిన 108 జీఓ విడుదల చేసింది. అయితే వయస్సు మెలిక పెట్టి (50 సంవత్సరాల వరకు ఈ మార్జీన్ మనీ స్కీమ్ అమలు చేయడాన్ని తేల్చకుండా) ఆ జీఓని ఇప్పటి వరకు కాగితాలకే పరిమితం చేశారు. ఒక వేళ అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు, సొంత పెట్టుబడి లేని నిరుద్యోగులు ఎంతోమందికి వెసులుబాటు కలిగేది. పరిశ్రమలు పెట్టుకొని తమకాళ్లపై నిలబడగలిగే అవకాశం కలిగేది. అలాగే గ్రామాల్లో మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. అయితే కేవలం లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్ (సొంత పెట్టుబడి) లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోలేపోతున్నారు. ఒక్క శాతం కూడా ఖర్చు కాక.. ఏటా బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కేటాయిస్తున్న నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాతం కూడా ఖర్చు కాని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులను ప్రోత్సహించేందకే 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఒక శాతం కూడా ఉపయోగించుకోలేకపోవడంతో మరుసటి ఏడాది రూ.270 కోట్లకు కుదించింది. అప్పటికీ మార్జిన్ మనీ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో రూ.270 కోట్ల నిధులు దాదాపు 90 శాతం నిధులు మిగిలిపోయినట్లు చైతన్య ఆక్వా ఇండస్ట్రీస్ అధినేత ఎం. చైతన్య ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది ఆ నిధులను రూ.170 కోట్లకు కుదించారు. ఇప్పటికీ మార్జిన్మనీకి సంబంధించిన జీఓని ఇచ్చి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన రాయితీలను సద్వినియోగం చేసుకునే అవకాశం కనిపించడంలేదు. వాస్తవంగా 2015–20 పారిశ్రామిక విధానం మంచిదైనప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రాయితీలను అందిపుచ్చులేకపోతున్నారు. బ్యాంకుల సహకారం లేకపోవడం, సొంతపెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడం వంటి కారణాలతో ఎన్ని రాయితీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో కొద్దోగొప్పో ఆర్థిక స్థోమత, పలుకుబడి ఉన్న ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు కేవలం రూ.6.29 కోట్ల రాయితీలను మాత్రమే ఉపయోగించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే 108 జీఓకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి ఉంటే కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే ఔత్సాహికులు మరో రూ.50 కోట్ల వరకు రాయితీలను జిల్లాలో పొంది ఉండేవారు. ప్రస్తుతం 108 జీఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ వద్ద ఉందని డిక్కీ జిల్లా కో–ఆర్డినేటర్ వి. భక్తవత్సలం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా మార్గదర్శకాలు విడుదల చేసి, ఈఏడాది కేటాయించిన రాయితీలైనా సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
మార్జిన్ ఎంతుంది గురు?
ఫైనాన్షియల్ బేసిక్స్.. స్టాక్స్ గురించి మనకు బాగా తెలుసు. ఒక మంచి కంపెనీ స్టాక్ కొంటే... ఆ షేర్ ధర ఎక్కడెక్కడికో భారీగా పడిపోయినా.. ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్లీ పెరిగినప్పుడు మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. అయితే మార్కెట్లలో కొన్ని క్లిష్టమైన డెరివేటివ్ ప్రొడక్టులు ఉంటాయి. అందులో ‘ఫ్యూచర్స్’ ఒకటి. మీరు ఒక ఫ్యూచర్ కొన్నారంటే... మీరు అకౌంటులో కొనసాగించే మార్జిన్ మనీ ఇక్కడ చాలా ముఖ్యం. దీని గురించి తెలుసుకుందాం... ♦ ప్రస్తుతం క్రూడ్ బేరల్ ధర 55 డాలర్లు ఉంది. ఈ ధర 56 డాలర్లకు పెరుగుతుందని భావించారు. ఇది మీ బెట్. మీ బెట్‌కు కమోడిటీ మార్కెట్లో ఒక ఆప్షన్ ఉంది. దీని పేరే ఫ్యూచర్. ♦ ఈ బెట్లో పాల్గొనాలంటే... మీరు దాదాపు రూ.3 వేలు మార్జిన్‌గా చెల్లించి ఒక లాట్‌గా (ఈ ధరకు 10 బేరళ్లు ఒక లాట్) కొనాల్సి ఉంటుంది. సరే మీరు రూ.3 వేలు పెట్టి లాట్ కొన్నారు. ♦ మీరు ఊహించినట్లే లాట్ ధర 56 డాలర్లకు పెరిగింది. మీకు అప్పటి డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం... 10 బేరళ్లకు లాభం వచ్చేస్తుంది. అంటే ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం దాదాపు రూ.660 లాభం వచ్చేస్తుందన్నమాట. ♦ ఒకవేళ మీరు ఊహించినట్లు కాకుండా డాలర్ ధర 54 డాలర్లకు పడిపోయిందనుకుందాం. ఇక్కడ మీకు రూ.660 నష్టం వస్తుంది. అప్పుడు మీ మార్జిన్ మనీలో రూ.660 తగ్గుతుంది. అందువల్ల ఇక్కడ మీరు ఈ కాంట్రాక్ట్ కొనసాగించేందుకు అదనంగా రూ.660 అకౌంటులో రెడీ చేయాలన్న మాట. అప్పుడు మీ కాంట్రాక్ట్ స్క్వేర్‌ఆఫ్ కాకుండా ఉంటుంది. అకౌంటులో మార్జిన్‌మనీ ఎక్కువ ఉంటే, ఒకవేళ ధర 54 స్థాయికి పడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తిరిగి ధర 56 డాలర్లకి పెరిగినపుడు ... మీ లాభం మీకు వచ్చేస్తుంది. ♦ ఇక మీ మార్జిన్ తక్కువ ఉంటే కేవలం కాంట్రాక్టు ధర 54 డాలర్లకన్నా తక్కువకు పడిపోతే, మీ కాంట్రాక్ట్ ఆటోమేటిక్‌గా స్క్వేర్‌ఆఫ్ అయిపోతుంది. అంటే మీ కాంట్రాక్ట్ నష్టంతో ముగుస్తుందన్నమాట. ♦ అందుకే ఫ్యూచర్స్‌లో మార్జిన్ అనేది చాలా కీలకం. పై సందర్భంలో క్రూడ్ ధర ఎంతవరకూ పడిపోతుందన్న గట్టి అంచనాలతో తగిన మార్జిన్ ఉంచుకుంటే... మంచిది. దీనినే హోల్డింగ్ సామర్థ్యం అంటారు. ఈ సామర్థ్యం మీకు ఎంత ఉంటే అంత మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే... తగిన హోల్డింగ్ ఉంటే ఫ్యూచర్స్‌లో ‘అసాధారణ పరిస్థితులు’ తప్పించిన నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.