ఐటీ మార్జిన్లు తగ్గుతాయ్‌ | US H1B visa suspension adversely impact margins of IT companies | Sakshi
Sakshi News home page

ఐటీ మార్జిన్లు తగ్గుతాయ్‌

Published Wed, Jun 24 2020 4:40 AM | Last Updated on Wed, Jun 24 2020 5:05 AM

US H1B visa suspension adversely impact margins of IT companies - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఖరు వరకు హెచ్‌–1బీ వీసాలను రద్దు చేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. భారత ఐటీ సంస్థలను కలవరపరుస్తోంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇది దేశీ కంపెనీలకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చని కొందరు .. హెచ్‌1బీ వీసాలపై ఆధారపడటం తగ్గుతున్నందున పెద్దగా ప్రభావం ఉండదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. వీసాల రద్దుతో దేశీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ ఒక నివేదికలో వెల్లడించింది. ‘ఈ ఆదేశాలతో భారతీయ ఐటీ రంగంపైన .. ముఖ్యంగా సంస్థల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలో స్థానిక ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్న కంపెనీలపై ఇది మరింత ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొంది. హెచ్‌–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకున్నందున వాటిపై తాత్కాలిక సస్పెన్షన్‌ భారతీయ ఐటీ కంపెనీలపై ఒక మోస్తరు స్థాయిలోనే ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.

ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్నవారిపై ప్రభావం ఉండదని వివరించింది. ‘ప్రస్తుతం హెచ్‌–1బీ వీసాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది భారతీయ ఐటీ సంస్థలే. 2018 అక్టోబర్‌–2019 సెప్టెంబర్‌ మధ్యకాలంలో అమెరికా 3.88 లక్షల హెచ్‌–1బీ వీసాలు జారీ చేయగా (కొత్తవి, రెన్యువల్స్‌ కలపి) ఇందులో భారత్‌ వాటా 71.7 శాతంగా ఉంది’ అని పేర్కొంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలకు ఊతమిచ్చే దిశగా హెచ్‌–1బీ సహా విదేశీ వర్క్‌ వీసాలను ఈ సంవత్సరం ఆఖరు దాకా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది జూన్‌ 24 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌.. అమెరికాలో పనిచేసేందుకు ఎక్కువగా హెచ్‌–1బీ వీసాలపైనే ఆధారపడుతుంటారు. తాజా నిర్ణయం ఇప్పటికే ఈ వీసాలపై పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్‌తో పాటు అక్టోబర్‌ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా వీసాలు పొందినవారిపైనా ప్రభావం చూపవచ్చని అంచనాలు ఉన్నాయి. 

ఆర్థిక పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదు.. 
భారతీయ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరుపై తాజా పరిణామాల ప్రభావాలు పెద్దగా ఉండకపోవచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఐటీ అనలిస్టు మధు బాబు అభిప్రాయపడ్డారు. ‘వర్క్‌ వీసాలపై భారతీయ ఐటీ కంపెనీలు ఆధారపడటం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక అమెరికాలో ఇప్పటికే హెచ్‌–1బీ వీసాలపై ఉన్నవారు గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రకంగా చూస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు’ అని మధు బాబు తెలిపారు. దేశీ ఐటీ అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలు 2017 నుంచి హెచ్‌–1బీ/ఎల్‌1 వీసాలపై ఆధారపడటాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నాయని, స్థానికంగా ఉద్యోగులను తీసుకోవడానికి, అమెరికాలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక వెల్లడించింది.

టాప్‌ 5 భారతీయ ఐటీ సర్వీస్‌ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం 45–70 శాతం దాకా స్థానికులే ఉన్నారని, తద్వారా హెచ్‌–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గిందని పేర్కొంది. ఉదాహరణకు 2016 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ అమెరికా కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య 35 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 63 శాతానికి పెరిగిందని వివరించింది. కరోనా వైరస్‌ పరిణామాలు భారత ఐటీ కంపెనీల డెలివరీ విధానాల్లో గణనీయంగా మార్పులు తెచ్చాయని, కార్యాలయాలపైనే ఆధారపడకుండా వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంలో కూడా సర్వీసులు అందించడం పెరిగిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా ఆఫ్‌షోరింగ్‌ను మరింతగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

అమెరికా ఎకానమీకి చేటు: నాస్కామ్‌ 
హెచ్‌–1బీ వీసాల రద్దు ఆదేశాలు అపోహలతో తీసుకున్నవని, ఇవి అమెరికా ఎకానమీకి కూడా చేటు తెచ్చిపెడతాయని భారతీయ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వ్యాఖ్యానించింది. స్థానికంగా తగినంత స్థాయిలో నిపుణులు లేకపోవడంతో ఆఫ్‌షోరింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ‘అత్యంత నిపుణులైన వలసదారులు అమెరికాలోని ఆస్పత్రులు మొదలుకొని ఫార్మా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తయారీ తదితర రంగాల సంస్థల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి తోడ్పాటు లేకుం డా అమెరికా ఎకానమీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పరిశ్రమ మందగిస్తుంది. కరోనాకు ఔషధాలను అందుబాటులోకి తేవడంలో మరింత జాప్యం జరుగుతుంది’ అని నాస్కామ్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంక్షల వ్యవధిని 90 రోజులకు కుదించాలని, లేకపోతే కరోనా   నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్‌ కంపెనీలకు ఇవి గుదిబండగా మారతాయని పేర్కొంది.

అమెరికన్‌ టెక్‌ కంపెనీల అసంతృప్తి.. 
దేశీ ఐటీ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌ మొదలైనవి కూడా అత్యుత్తమ నైపుణ్యాలున్న భారతీయులను నియమించుకుంటూ ఉంటాయి. హెచ్‌–1బీ వీసాల రద్దు, భారతీయ ఐటీ రంగ అంశాలు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండ్స్‌లో నిల్చాయి. అమెరికా ప్రభుత్వ ఆదేశాలపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షాన తాను నిలుస్తానని, అందరికీ అవకాశాలు లభించాలన్న లక్ష్య సాధన కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక వలసదారుల పక్షాన పోరాడే మానవ హక్కుల సంస్థలతో పాటు పలువురు అమెరికన్‌ నేతలు కూడా సస్పెన్షన్‌ ఆదేశాలను ఉపసంహరించాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement