మార్జిన్ ఎంతుంది గురు?
ఫైనాన్షియల్ బేసిక్స్..
స్టాక్స్ గురించి మనకు బాగా తెలుసు. ఒక మంచి కంపెనీ స్టాక్ కొంటే... ఆ షేర్ ధర ఎక్కడెక్కడికో భారీగా పడిపోయినా.. ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్లీ పెరిగినప్పుడు మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. అయితే మార్కెట్లలో కొన్ని క్లిష్టమైన డెరివేటివ్ ప్రొడక్టులు ఉంటాయి. అందులో ‘ఫ్యూచర్స్’ ఒకటి. మీరు ఒక ఫ్యూచర్ కొన్నారంటే... మీరు అకౌంటులో కొనసాగించే మార్జిన్ మనీ ఇక్కడ చాలా ముఖ్యం. దీని గురించి తెలుసుకుందాం...
♦ ప్రస్తుతం క్రూడ్ బేరల్ ధర 55 డాలర్లు ఉంది. ఈ ధర 56 డాలర్లకు పెరుగుతుందని భావించారు. ఇది మీ బెట్. మీ బెట్‌కు కమోడిటీ మార్కెట్‌లో ఒక ఆప్షన్ ఉంది. దీని పేరే ఫ్యూచర్.
♦ ఈ బెట్‌లో పాల్గొనాలంటే... మీరు దాదాపు రూ.3 వేలు మార్జిన్‌గా చెల్లించి ఒక లాట్‌గా (ఈ ధరకు 10 బేరళ్లు ఒక లాట్) కొనాల్సి ఉంటుంది. సరే మీరు రూ.3 వేలు పెట్టి లాట్ కొన్నారు.
♦ మీరు ఊహించినట్లే లాట్ ధర 56 డాలర్లకు పెరిగింది. మీకు అప్పటి డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం... 10 బేరళ్లకు లాభం వచ్చేస్తుంది. అంటే ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం దాదాపు రూ.660 లాభం వచ్చేస్తుందన్నమాట.
♦ ఒకవేళ మీరు ఊహించినట్లు కాకుండా డాలర్ ధర 54 డాలర్లకు పడిపోయిందనుకుందాం. ఇక్కడ మీకు రూ.660 నష్టం వస్తుంది. అప్పుడు మీ మార్జిన్ మనీలో రూ.660 తగ్గుతుంది. అందువల్ల ఇక్కడ మీరు ఈ కాంట్రాక్ట్ కొనసాగించేందుకు అదనంగా రూ.660 అకౌంటులో రెడీ చేయాలన్న మాట. అప్పుడు మీ కాంట్రాక్ట్ స్క్వేర్‌ఆఫ్ కాకుండా ఉంటుంది. అకౌంటులో మార్జిన్‌మనీ ఎక్కువ ఉంటే, ఒకవేళ ధర 54 స్థాయికి పడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తిరిగి ధర 56 డాలర్లకి పెరిగినపుడు ... మీ లాభం మీకు వచ్చేస్తుంది.
♦ ఇక మీ మార్జిన్ తక్కువ ఉంటే కేవలం కాంట్రాక్టు ధర 54 డాలర్లకన్నా తక్కువకు పడిపోతే, మీ కాంట్రాక్ట్ ఆటోమేటిక్‌గా స్క్వేర్‌ఆఫ్ అయిపోతుంది. అంటే మీ కాంట్రాక్ట్ నష్టంతో ముగుస్తుందన్నమాట.
♦ అందుకే ఫ్యూచర్స్‌లో మార్జిన్ అనేది చాలా కీలకం. పై సందర్భంలో క్రూడ్ ధర ఎంతవరకూ పడిపోతుందన్న గట్టి అంచనాలతో తగిన మార్జిన్ ఉంచుకుంటే... మంచిది. దీనినే హోల్డింగ్ సామర్థ్యం అంటారు. ఈ సామర్థ్యం మీకు ఎంత ఉంటే అంత మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే... తగిన హోల్డింగ్ ఉంటే ఫ్యూచర్స్‌లో ‘అసాధారణ పరిస్థితులు’ తప్పించిన నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.