సంసారం.. ఆర్ధిక చదరంగం! | Newlyweds Financial Planning | Sakshi
Sakshi News home page

సంసారం.. ఆర్ధిక చదరంగం!

Published Mon, Oct 14 2024 5:20 AM | Last Updated on Mon, Oct 14 2024 8:03 AM

Newlyweds Financial Planning

వైవాహిక బంధం.. ఆర్థికంగా పటిష్టం

కాబోయే భాగస్వాములకు ‘మనీ’పై అవగాహన ఉండాలి

పొదుపు, మదుపు, వ్యయాలపై చర్చించుకోవాలి

భవిష్యత్‌ లక్ష్యాలపై ఉమ్మడి నిర్ణయాలు

ఆధిపత్య ధోరణితో కలతలు, సమస్యలు

సమష్టి తత్వంతోనే విజయం 

హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం.   

వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్‌  ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్‌ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... 

మారుతున్న పరిస్థితులు.. 
ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్‌ లా ఫర్మ్‌’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే.  

చర్చించుకోవడమే మెరుగైన మార్గం 
వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్‌ ఎండీ మృణ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. 

తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్‌ రాఠి వెల్త్‌ డిప్యూటీ సీఈవో ఫెరోజ్‌ అజీజ్‌ సూచించారు.

ప్రణాళిక ప్రకారం 
దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్‌ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. 

దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ సీఈవో రోహిత్‌ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్‌ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్‌ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. 

ఆధిపత్యం పనికిరాదు.. 
మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్‌ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. 

భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది.  

పెట్టుబడుల ఎంపికలు 
పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్‌ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్‌ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్‌ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.

గోప్యత ప్రమాదకరం 
రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.

ధన సాయం 
తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ సీఈవో రోహిత్‌ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది.  

రుణ భారం 
తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి.  

   – సాక్షి, బిజినెస్‌డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement