ఇనుప చువ్వ గుండెను చీల్చినా..
టోరిటామా, ఈశాన్య బ్రెజిల్ : బార్బెక్యూ కడ్డీ గుండెలో దిగినా ప్రాణాలతో బయటపడిన బాలుడు డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని టోరిటామా నగరంలో చోటు చేసుకుంది. మారివాల్డో జోస్ డి సిల్వా(11) అనే బాలుడు ఇంటి వద్ద నిచ్చెన ఆడుతుండగా ప్రమాదవ శాత్తు జారి కిందపడ్డాడు.
మారివాల్డో పడిన స్థలంలో బార్బెక్యూకు వినియోగించే ఇనుప కడ్డీలు పేర్చి ఉన్నాయి. దీంతో ఓ ఇనుప చువ్వ అతని ఎడమ భుజం కిందుగా గుండెకు రంధ్రం చేసుకుంటూ ఛాతిలో నుంచి దూసుకెళ్లింది.
బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
బాలుడిని జాగ్రత్తగా పరిశీలించిన వైద్యులకు ఇనుప చువ్వ గుండెతో పాటు కొట్టుకుంటుండటం గమనించారు. దీంతో చువ్వ గుండెను చీల్చుకుని వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు శ్రమించిన వైద్యులు బాలుడి శరీరం నుంచి ఇనుమ చువ్వను వేరు చేశారు. గుండెలోకి దూసుకెళ్లిన కడ్డీని తీయకుండా ఆసుపత్రికి తీసుకురావడమే బాలుడిని బ్రతికించిందని వైద్యులు స్పష్టం చేశారు.
ఆపరేషన్‌లో తొలుత బాలుడి ఛాతిని ఓపెన్ చేసి ఏ భాగం దెబ్బతిందో గుర్తించినట్లు వెల్లడించారు. గుండెలోకి దూసుకెళ్లిన చువ్వను అతి జాగ్రత్తగా బయటకు తీసినట్లు చెప్పారు. గాయం అయిన భాగం నుంచి రక్తం పోకుండా ఆ ప్రదేశాన్ని వేడి వస్తువుతో కాల్చినట్లు తెలిపారు. అనంతరం ఛాతి భాగంలో చర్మానికి కుట్లు వేసినట్లు వివరించారు. ప్రస్తుతం బాలుడు మెషీన్ల సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు.