స్పందించని ప్రభుత్వం వస్త్రపరిశ్రమ సమ్మె విరమణ
భివండీ, న్యూస్‌లైన్: ప్రభుత్వం నుంచి ఎంతకూ స్పందన రాకపోవడంతో నిరాశకు గురైన భివండీ మరమగ్గాలు, వస్త్రపరిశ్రమల యజమానులు (మాస్టర్ వీవర్లు) ఆదివారం బంద్‌ను విరమించుకున్నా రు. యజమానుల నిర్ణయంపై ఆగ్రహం చెందిన మజూరీ వీవర్లు వారితో గొడవకు దిగారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజుల నుంచి వస్త్ర పరిశ్రమల యజమానులు బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. భివండీ పవర్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో చేపట్టిన ఈ బంద్ కారణంగా పరిశ్రమకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. బంద్ సందర్భంగా యజమానులు, కార్మికులు ఆందోళనలు, రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నా లూ చేశారు.
అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని పలువురు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు కార్మికులంతా సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవడం, నష్టాలు తీవ్రతరం కావడంతో యజమానులు బంద్‌ను మధ్యలోనే విరమించుకున్నారు. సుభాష్‌నగర్, మారు కాంపౌండ్, సరోళి, నయీపాడ, మీట్పాడ, 72-గాలా, చందన్ భాగ్, సోనాలే, నారాయణ్ కాంపౌండ్, బండారి కాంపౌండ్, భారత్ కాంపౌండ్, పద్మనగర్ తదితర ప్రాంతాల్లో 20 శాతం పరిశ్రమలు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో మజూరీ వీవర్లు మాస్ట ర్ వీవర్లతో గొడవకు దిగారు. బంద్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మాస్టర్ వీవర్లు సొంతంగా నూలు తెచ్చుకొని, బట్ట తయారు చేసి, దానిని మార్కెట్లో విక్రయిస్తారు కాబట్టి వారికి గిట్టుబాటవుతుంది. మజూరీ వీవర్లు సొంతంగా చేసుకోరు కాబట్టి వారికి నష్టం వాటిల్లుతుంది. బం ద్‌ను విజయవంతం చేయాలని మజూరీ వీవర్లు గొడవ చేసినా, మాస్టర్ వీవర్లు పట్టించుకోలేదు. పోలీసుల అండతో పరిశ్రమలను ప్రారంభించారు. దీంతో మజూరీ వీవర్లు అయోమయంలో పడిపోయారు. కనీసం మాస్టర్ వీవర్లు మజూరీ వీవర్లకు మీటర్‌పై రేటును పెంచి ఇవ్వాలని కోరారు.