marlavai village
-
ఆదివాసుల హృదయ దీపాలు
తూర్పు గోదావరి జిల్లా కొండ అడవుల్లో డాక్టర్ ఊర్మిల పింగ్లె తీసిన ఇక్కడ కనిపిస్తున్న ఫొటో... హైమండార్ఫ్ దంపతులు కలిసి ఉన్న దాదాపు తుది చిత్రం. పదవీ ఉద్యోగాలు లేకపోయినా మానవ శాస్త్రవేత్తగా తనతో యాభై ఏళ్లుగా వెన్నెముకలా ఉండి అలుపెరగకుండా కలిసి పని చేసిన బెట్టీ సాహచర్యం గురించి లోతుగా తలపోస్తున్నట్టు క్రిస్టోఫ్ హైమండార్ఫ్ కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్‌లో 11 జనవరి 1987 నాడు బెట్టీ అని అందరూ అభిమానంగా పిలిచిన ఎలిజబెత్ హైమండార్ఫ్ గుండెపోటుతో హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. ఆమె మరణం క్రిస్టోఫ్ హైమండార్ఫ్‌ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకే ఆయన కూడా తనువు చాలించారు. భారత్ ఈశాన్య ప్రాంతంలోని కొన్యక్ నాగాలు, ఆపతానీలు, హైదరాబాద్ నిజాం సంస్థానంలోని చెంచులు, కొండ రెడ్లు, రాజ గోండులు, ఇంకా నేపాల్ షేర్పాలు, మధ్య ప్రదేశ్ భిల్లులు.. ఈ జాతుల గురించి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ చేసిన పరిశోధనలు ఇప్పటికీ ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ఆదిలాబాద్ రాజ్ గోండులతో ఆయన 1940ల్లో ఏర్పరచుకొని, జీవన పర్యంతం కొనసాగించిన బాంధవ్యానికి సాటి రాగలిగి నది ఏదీ లేదు. మార్లవాయి గ్రామంలో రాజ్ గోండుల మధ్య వారిలో ఒకరిగా ఒక గుడిసెలో జీవిస్తూ వారి సంప్రదాయాలు, పురాణాలను, వారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సాధికారికంగా నమోదు చేస్తూ, ఆదివాసీ జీవన దృక్పథ సార్వజనీనమైన విలువను గుర్తుండి పోయేలా ఆవిష్కరించగలిగారు. హైదరాబాద్ సంస్థానంలోని ఆదివాసీలను దాదాపు మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తరువాత 1945లో, ఆయన విశ్లేషణల నాణ్యతను చూసిన నిజాం ప్రభుత్వం ఆయనను గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. సంస్థానంలోని ఆదివాసీల అభ్యున్నతికి కీలకమైన నూతన ప్రణాళికల రూపకల్పన, వాటి అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ పదవిలో ఉంటూ కుమ్రం భీం తిరుగుబాటు, వీర మరణం తరువాత పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి, తీవ్రమైన నిరాదరణకు గురవుతున్న ఆదిలాబాద్ జిల్లా గోండుల కోసం తొలి పాఠశాలలు ఏర్పరిచి, భూములు లేని వేలాది ఆదివాసీ కుటుంబాలకు దాదాపు 160 వేల ఎకరాల భూమిని పట్టాలతో సహా అందించి వారి సమగ్ర పునరుజ్జీవనానికి గొప్ప పునాది వేయగలిగారు హైమండార్ఫ్. 1950లో లండన్‌కు వెళ్లి పోయిన తర్వాత కూడా తరచుగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ గోండుల బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉండేవారు హైమండార్ఫ్ దంపతులు. 1960ల తరువాత బయటి నుండి వచ్చిన చొరబాటుదారుల దురాక్రమణకు ఆదివాసీల భూములు గురికావడం, వారి పరిస్థితి మళ్లీ హీనం కావడం హైమండార్ఫ్ దంపతులను ఎంతో బాధించేది. తమను ఎంతో ఆదరించి, అభిమానించిన గోండుల సన్నిధిలో మార్లవాయి లోనే తమ సమాధులు ఉండాలని హైమండార్ఫ్ దంపతులు కోరుకున్నారు. బెట్టి మరణం తర్వాత, ఆమె అస్థికలను మార్లవాయికి తీసుకు వచ్చి, ప్రేమాభిమానాలతో తరలివచ్చిన వేలాది ఆదివాసీల సమక్షంలో మార్లవాయి గ్రామం పక్కనే ఖననం చేశారు. క్రిస్టోఫ్ అవశేషాలను కూడా ఆయన మరణించిన చాలా ఏళ్ళ తర్వాత బెట్టి సమాధి పక్కనే పూడ్చి మరో సమాధి నిర్మింపజేశారు. బెట్టి వర్ధంతినే హైమండార్ఫ్ దంపతుల ఉమ్మడి సంస్మరణ దినంగా ప్రతి ఏడాది మార్లవాయి గ్రామంలో 11 జనవరి నాడు నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్నే ళ్లుగా ఇది పెద్ద కార్యక్రమంగా వికసిస్తూ వస్తున్నది. మార్లవాయి గ్రామ గుసాడి నృత్య కళాకారుడు కనక రాజుకు పద్మశ్రీ గౌరవం దక్కడం దీనికి తోడయ్యింది. తమ జాతి సంస్కృతిని అధ్యయనం చేసి, తమ అభ్యున్నతి కోసం పరితపించిన మానవ శాస్త్రవేత్త దంపతులకు ఆ జాతి నుంచి లభించిన ఇటువంటి ఆరాధనకు సాటిరాగల ఉదాహరణ మరెక్కడా లేదేమో! 1980వ దశకం నుండి చివరిదాకా హైమండార్ఫ్ దంపతులను బాగా ఎరిగిన, క్రిస్టోఫ్‌తో కలిసి రెండు పరిశోధన గ్రంథాలను కూడా రాసిన ఊర్మిళ పింగ్లె, బెట్టి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు: ‘తనను కలిసిన వారందరి పట్లా గొప్ప అనురాగం చూపుతూ... గొప్ప చమత్కారం, హాస్య దృష్టిలతో జీవ చైతన్యం ఉట్టిపడుతూ ఉండేది అమె. ఆదివాసీ సమాజాల పరిస్థితి పట్ల ఎనలేని సానుభూతితో వారి అభ్యున్నతి కోసం అంతటా వాదిస్తూ ఉండేది. తన భర్తకు నిజమైన ఆత్మబంధువుగా నిలిచిన వ్యక్తి!’ (క్లిక్ చేయండి: అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం) - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (జనవరి 11 హైమండార్ఫ్ దంపతుల సంస్మరణ దినం) -
మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నార్నూర్(జైనూర్) : ఎంతో చరిత్ర కలిగిన మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ అన్నారు. ఆదివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సహాయ మంత్రి లక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ హైమన్‌డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద సంప్రదాయబద్ధంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన మానవ పరిణామక్రమ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. హైమన్‌డార్ఫ్ వర్ధంతిని అధికారింగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దంపతులను ఎప్పటికీ మరువలేమని అన్నారు. గ్రామంలో రూ.6కోట్లతో ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు సహాయ మంత్రి కోవ లక్ష్మి తెలిపారు. కొమురం భీమ్ స్వగ్రామమైన జోడేఘాట్‌ను రూ.25 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదారాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆదివాసీల కోసం ఆదివాసీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించిందని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో పెందూర్ భీము, ఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు, ఆర్డీవో ఐలయ్య, ఎంపీడీవో దత్తరాం, తహశీల్దార్ వర్ణ, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, ఎంపీపీ కొడప విమలప్రకాష్, కోఆప్షన్ సభ్యులు సబుఖాన్, ఏజెన్సీ ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి, సర్పంచులు భీంరావ్, బొంత ఆశరెడ్డి, లక్ష్మణ్, ఆదివాసీ సంఘాల నాయకులు లక్కేరావ్, వెడ్మా బొజ్జు, సీతారామ్, అంబాజీ, ఐటీడీఏ మాజీ చైర్మన్ అర్జు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్రావ్, రాయ్‌సెంటర్ జిల్లా మెడి మేస్రం దుర్గు తదితరులు పాల్గొన్నారు.