పోలింగ్ రోజున కుట్రకు టీడీపీ స్కెచ్
విజయవాడ సిటీ: పోలింగ్ మరో 24 గంటల్లో ప్రారంభమవుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వేధింపులు అధికమయ్యాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు యాక్టివ్గా లేకుండా ఉండేందుకు తమ కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేయడానికి చంద్రబాబు చేసే కుట్రలో కొంత మంది అధికారులు భాగస్వాములవుతున్నారని మండిపడ్డారు. అటువంటి పన్నాగాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ పద్మారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు, వారి పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వంగి, వంగి దండాలు పెడుతున్నారని, చివరికి బోర్లా పడుకునే పరిస్థితికి వచ్చాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా కేసీఆర్కు, మోదీకి వంగి వంగి దండాలు పెట్టిన చంద్రబాబును ఇప్పుడు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు.
పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నేడు, రేపు బయటకు వస్తే ఊరుకోబోమంటూ పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ, ఆల్మట్టి ఎత్తు పెండచం ద్వారా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన దేవగౌడను తీసుకొచ్చి చంద్రబాబు వంగి దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు. బాబు తిరిగి సీఎం అయితే రాష్ట్రం ఎడారిగా మారిపోతుందన్నారు.