Marriage bus
-
పెళ్లి వ్యాను బోల్తా
సాక్షి, గజ్వేల్: టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
చెట్టును ఢీకొన్న బస్సు: 15 మందికి గాయాలు
-
చెట్టును ఢీకొన్న పెళ్లి బస్సు: 15 మందికి గాయాలు
వినుకొండ(గుంటూరు జిల్లా): కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు వెళుతున్న పెళ్లి బృందం బస్సు వినుకొండ మండలం చీకటీగలపాళెం గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వినుకొంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పెళ్ళి బస్సు బోల్తా : ముగ్గురికి తీవ్రగాయాలు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఓ పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. తుని నుంచి కాకినాడ బయలుదేరిన పెళ్లి బృందం బస్సు పిఠాపురంలోని పెందుర్తి జంక్షన్ వద్దకు చేరుకోగానే బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తాపడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా లక్ష్మీ(45) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనలో నాలుగేళ్ళ చిన్నారి చైతన్య సురక్షితంగా బయటపడ్డాడు. -
టీ తాగేందుకు పెళ్లి బస్సు దిగడంతో..
చిలకలగూడ: పెళ్లి బస్సులో మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, అక్కడున్న వారు అప్రమత్తమై వధువు సహా బస్సులో ఉన్న 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలివీ.. సికింద్రాబాద్ సీతాఫల్మండి జోషి కాంపౌండ్‌లోని రీజెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఎ.గీతారావు కుమార్తె వివాహం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు న్యూదక్కన్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. బస్సును డ్రైవర్ ఆంజనేయులు శనివారం ఉదయం 10 గంటలకు పెళ్లివారింటి ప్రాంగణంలోకి తీసుకువచ్చాడు. బస్సును స్టార్ట్ చేసి ఉంచి ఏసీని ఆన్ చేసి బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లాడు. పెళ్లి కుమార్తెతో పాటు సుమారు 20 మంది చిన్నారులు, వృద్ధులు బస్సులో కూర్చున్నారు. ఏసీ బయటకు పోతుందని బస్సు డోర్‌ను వేశారు. ఈ క్రమంలో బస్సు ముందుభాగంలోని ఇంజన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతోపాటు మంటలు వ్యాపించాయి. ఒకరికొకరు కనిపించలేనంత పొగ క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించింది, భయాందోళనలతో బస్సులోని వారంతా గట్టిగా కేకలు వేయసాగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చిలకలగూడ ఏఎస్ఐ జగన్మోహనరావుతోపాటు స్థానికులు, బంధువులు బస్సు అద్ధాలు పగులగొట్టి పెళ్లికుమార్తెతోపాటు లోపలున్న అందరినీ రక్షించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు, తార్నాక అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కొద్దిసేపటి తర్వాత మరో బస్సులో పెళ్లికి తరలివెల్లారు. ఈ ప్రమాదానికి డీజిల్ లీకేజీ కావడమేనని పోలీసులు భావిస్తున్నారు. ఏసీ ఆన్ చేయడంతోపాటు ఎండలు మండిపోతుండడంతో ఇంజన్ వేడెక్కిపోయి ఉంటుందని, డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించిందని తెలిపారు. బస్సు డ్రైవర్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.