Married minor girl
-
ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక
ధన్‌బాద్: చిన్నప్పటి స్నేహం కాస్త ప్రేమ అయ్యింది. చివరకు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో ఏమీ వింత ఉంది అనుకుంటున్నారా. పెళ్లి చేసుకుంది యువతి యువకుడు కాదు. ఇద్దరు అమ్మాయిలే. పైగా వారిద్దరికి 18 ఏళ్లు కూడా నిండలేదు. ప్రస్తుతం వీరి ప్రేమపెళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ప్రాంతంలో సుగాయ్‌దిహ్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని వారి ఇళ్లల్లో చెప్పగా షాక్‌కు గురయ్యారు. వారి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించి అది తప్పని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అందులో ఒకమ్మాయి అబ్బాయిగా వేషం మార్చింది. షర్ట్, ప్యాంట్ వేసుకుని పురుషుడిలా కనిపించింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని స్నేహితులను సంప్రదించారు. వారికి సహకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోగా తిరస్కరించారు. దీంతో వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఇద్దరు వారి ఇళకు వెళ్లిపోయారు. అయితే తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రం చూసిన ఆమె తల్లి ప్రశ్నించింది. తాళి ఎవరు కట్టారని గద్దించి అడగడంతో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే సరాయిధేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. 18 ఏళ్లు నిండకపోవడంతో వారిని తల్లిదండ్రుల వద్ద ఉండమని చెప్పగా ఆ అమ్మాయిలు నిరాకరించారు. తామిద్దరం కలిసి ఉంటామని చెప్పారు. అయితే వివాహ వయసు దాటాక మీ ఇష్టమని తాత్కాలికంగా చెప్పి పంపారు. వారి మనసుల మాదిరి వారిద్దరి పేర్లు కూడా ఒకటే. వారి ఇద్దరి పేర్లు పూజ కావడం గమనార్హం. -
16 ఏళ్లకే అత్తింటి ఆరళ్లు
బాల్యంలో ఆటపాటలు పేదరికం విసిరేసిన కష్టాల కార్ఖానాలో కలిసిపోయాయి. చదువులమ్మ గుడిలో పుస్తకాలు పట్టాల్సిన చేతులు.. మెడలో పసుపుతాడు బిగించిన దాంపత్యపు బంధాలలో చిక్కుకున్నాయి.. భర్తే సర్వస్వమంటూ చెప్పిన వేదమంత్రాలు చెవుల్లో మార్మోగుతుండగానే.. కట్టుకున్నోడి లీలలు కథలు కథలుగా వినిపించాయి. సంసారపు చదరంగంలో మొదటి పావు కదిలేలోపే అత్తింట ఆరళ్లు నూతన దాంపత్య మాధుర్యాన్ని ఎగతాళి చేశాయి. ఇంటికి వచ్చిన అడబిడ్డను మహాలక్షి్మగా భావించాల్సిన వారికి.. అదనపు కట్నకానుకలే లక్ష్మీదేవిగా కనిపించాయి. ఇలా నిత్యం మానసిక, శారీరక హింసలు మైనార్టీ కూడా తీరని నవ వధువును పుట్టింటికి తరిమేశాయి. ఇక భరించలేని తెనాలికి చెందిన ఆ ఆడబిడ్డ కన్నీళ్లు తోడుగా బుధవారం పోలీసులను ఆశ్రయించింది. సాక్షి, తెనాలి: కుటుంబ పరిస్థితుల నేపథ్యం అభం శుభం తెలియని చిన్నారికి వివాహం చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. పేద కుటుంబం కావడంతో ఉన్నతంతలోనే వివాహం జరిపించారు. అయితే ఆ బాలికకు పెళ్లి ఆనందం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తింటి వారు పెడుతున్న హింసలను తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన 16 ఏళ్ల సాహితిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆటోడ్రైవర్ గుంజి గణేష్‌కు ఏడు నెలల క్రితం సాహితిని ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. వివాహమైన కొద్ది రోజులకే బాలికకు వేధింపులు మొదలయ్యయాయి. రోజూ భర్త మద్యం తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్నాడు. ఇదే సమయంలో అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఓ కేసుకు సంబంధించి కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో భర్తను, సదరు మహిళను బైండోవర్ చేశారని తెలుసుకుని నివ్వెరపోయింది. దీనిపై ప్రశి్నస్తే వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. మరో వైపు రూ. రెండు లక్షలు అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా హింసించారు. దీంతో ఆ బాలిక పుట్టింటికి వచ్చేసింది. బుధవారం భర్త గణేష్ అత్త విజయలక్ష్మి, మరిది సుధీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బత్తుల శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను ఏమార్చి.. మరో రైలు ఎక్కేసింది
ధన్‌బాద్: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు తల్లిదండ్రులు ఆమె అభీష్టానికి భిన్నంగా 24 ఏళ్లు పెద్దవాడైన, గుజరాత్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత అత్తవారింటి నుంచి తొలిసారి పుట్టింటికి వచ్చిన ఆ అమ్మాయి భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి ఆమెను భర్తతో పంపారు. కాగా గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ధన్‌బాద్ రైల్వే స్టేషన్లో ఆమె భర్తను ఏమార్చి మరో రైలు ఎక్కేసింది. ఆ రైలు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చేరింది. రాయ్‌పూర్ రైల్వే పోలీసులు ఆమెను రాయ్‌పూర్ జిల్లా శిశు సంక్షేమ సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు అప్పగించారు. అక్కడే ఆ అమ్మాయి నెల రోజులు ఆశ్రయం పొందింది. అధికారులు ఆమెకు పునరావాసం కల్పించి, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ధన్‌బాద్ జిల్లా శిశు సంక్షేమ సంఘం అధికారులను సంప్రందించి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. మైనర్ బాలికకు పెళ్లి చేయడం చట్టవిరుద్ధమని, ఆమెను బలవంతంగా భర్తకు అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరించారు. తాను చదువుకుంటానని, భర్తతో వెళ్లనని ఆ అమ్మాయి అధికారుల ఎదుట చెప్పింది. సీడబ్ల్యూసీ అధికారులు మైనర్ బాలిక భర్త షాకర్ ఖాన్‌కు సమన్లు పంపారు.