marthand k venkatesh
-
'సర్కారు వారి పాట' పోకిరిని మించి హిట్ అవుతుంది : ఎడిటర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' కు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు... ►దర్శకుడు పరశురాం గారు ఈ కథ చెప్పినపుడు.. ఇంతకుముందు మీరు చేసిన సినిమాలకి 'సర్కారు వారి పాట'కి ఎలాంటి తేడా గమనించారు ? దర్శకుడు పరశురాం గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. నేను చేసిన సినిమాలన్నీటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా వుంటారు. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది. ►పోకిరి తర్వాత మహేష్ బాబు గారి చాలా హిట్స్ వచ్చాయి కదా? మరి పోకిరితోనే పోల్చడానికి కారణం ? పోకిరి నేను ఎడిటర్ గా చేసిన సినిమా. అందుకే పోకిరితో పోల్చాను. పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ట్రాక్ లో తెగ నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ లో వారు ఎక్కడ కలిసిన చిన్న లాఫ్ వుండేది. థియేటర్ లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుంది. ► విజువల్స్ చాలా గ్రాండ్ కనిపించడానికి మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణం కారణమని భావిస్తున్నారా ? అవునండీ. దర్శకుడు పరశురాం గారి సినిమాలు చేశాను. కానీ ఫస్ట్ టైం సర్కారు వారి పాట కోసం మైత్రి మూవీ మేకర్స్ ,జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ లో పని చేశాను. నిర్మాణ విలువలు వండర్ ఫుల్ గా వున్నాయి. వీరు అంతా సినిమాని రిచ్ గా తీయాలనే లక్ష్యంగా వుంటారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడరు. సినిమా పట్ల వారికున్న అంకితభావం అభినందనీయం. ఇది చాలా మంచి అనుభవం. ►దర్శకుడు పరశురాం గారి సినిమాలు క్లాస్ గా వుంటాయి. సర్కార్ వారి పాటలో ఇప్పటివరకూ అంతా మాస్ గానే కనిపిస్తుంది ? ఇందులో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. హీరో, హీరోయిన్ పాత్రలని ఇష్టపడతాం. హీరోయిన్ పాత్ర చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మనకీ వుంటే బావున్ననిపిస్తుంది. హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం. ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం. ఎడిట్ చేస్తున్నపుడు సర్కారు వారి పాటకి అద్భుతంగా కనెక్ట్ అయ్యాం. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. ►ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశారు ? ఇప్పటి వరకూ 450 సినిమాలు చేశాను. మహేష్ గారితో రాజకుమారుడు, టక్కరి దొంగ,పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇప్పుడు సర్కారు వారి పాటకి చేశాను. ►రీలు కంటింగ్ కి, డిజిటల్ కంటిగ్ కి ఎలాంటి తేడా వుంది ? రీలు కంటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ వుండేది. ఎవరు చూడాలన్నా ఎడిటింగ్ రూమ్ లోకి రావాలి. పైగా అది హార్డ్ వర్క్. ఇన్ని సినిమాలు చేయలేం, డిజిటల్ వల్ల ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయగలుగుతున్నాం. రీలు ఎడిటింగ్ లో ఏడాదికి పది సినిమాలు చేయడం గొప్ప. డిజిటల్ వచ్చిన తర్వాత ఏడాది ఇరవై సినిమాలు కూడా చేయొచ్చు. ► రీలు ఎడిటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ ఉండేదని అన్నారు . అంటే డిజిటల్ లో రెస్పెక్ట్ లేదా ? రీలు ఎడిటింగ్ ఒకటే వెర్షన్ వుండేది. డైరెక్టర్, ఎడిటర్ కలసి సినిమాని ఫైనల్ చేసేవారు. నిర్మాతలు కథ విని దానికి ఎవరు హీరో అయితే బావుంటుదని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో వుంది. ► ఇప్పుడు సెట్ లోనే ఎడిట్ చేస్తున్నారు కదా ? సెట్ లో చేసేది పక్కా ఎడిటింగ్ కాదు. ఆ సీన్ వరకే చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ , స్క్రీన్ ప్లే ఎడిటింగ్ రూం నుండే వెళ్తుంది. ► దర్శకుడు పరశురాం తో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ,ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పులు గమనించారు ? " పరశురాం అద్భుతమైన రచయిత. మంచి డైలాగ్స్ రాస్తారు. హీరో, హీరోయిన్స్ పాత్రలు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారి పాత్ర అదిరిపోతుంది. ఈ మధ్యలో కాలంలో ఇలాంటి పాత్రని చుసివుండరు. హీరో క్యారెక్టరైజేషన్ లోనే బోలెడు వినోదం వుంటుంది. చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ►దర్శకుడు పరశురాం ఫస్ట్ టైమ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. కథ ఓకే అయిన తర్వాత మీతో పంచుకున్న విశేషాలు ఏమిటి ? దర్శకుడు పరశురాం నాకు చాలా సన్నిహితంగా వుంటారు. ఈ కథని గీత గోవిందం సినిమా సమయంలోనే నాకు చెప్పారు. అద్భుతంగా ఉందని అప్పుడే చెప్పా. ►సర్కారు వారి పాట చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ? అందరూ చాలా హ్యాపీగా వున్నారు. సర్కారు వారి పాట చాలా పెద్ద సినిమా అవుతుంది. నేను చేసిన సినిమాల్లో పోకిరిని క్రాస్ చేస్తుంది. ►అన్ని సాంకేతిక విభాగాల్లో కొత్త వారి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎడిటింగ్ లో మాత్రం ఓ ముగ్గురు పేర్లే వినిపిస్తాయి. ఇంత లాంగ్ కెరీర్ ఎలా సాధ్యమైయింది? ఎడిటింగ్ లోకి కొత్తతరం రావడం లేదా ? రానివ్వడం లేదా ? తరం అని కాదు, మేము కూడా ఆ తరాన్ని దాటుకునే వచ్చాం కదా. కొందరు యూత్ ఫుల్ ఫిల్మ్స్ అంటారు. అంటే మేము యూత్ కాదా? కోమాలో వున్నామా ? దాన్ని దాటే కదా వచ్చాం. వయసుకి సినిమాకి సంబంధం లేదు. ఆ తరాన్ని దాటునికొని వచ్చాం కాబట్టి కథని ఇంకా బాగా చెప్పగలం. ► ఎక్కువ సార్లు ఎడిట్ చేయడం వల్ల మీ జడ్జ్ మెంట్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందా ? అలా వుండదు. రష్ చూసినపుడు మొదట వచ్చిన ఫీలింగ్ కే కనెక్ట్ అవుతాం. ►ఎడిటర్ రూమ్ లో చాలా చర్చలు జరుగుతుంటాయి. ఎడిటర్ అభిప్రాయాన్ని డైరెక్టర్ అంగీకరిస్తారా? ఖచ్చితంగా. సినిమా కోసమే కదా గొడవలు పడతాం. ఆడిటోరియం లో చూసేది మేము ముందుగానే చెప్తాం. నేను పని చేసే దర్శకులంతా నా అభిప్రాయాన్ని తీసుకుంటారు. ►మీరు బలంగా నమ్మి నిరాశపడిన సినిమా ఏదైనా ఉందా ? శేఖర్ కమ్ముల లీడర్. ఈ సినిమా పొలిటికల్ సినిమాల్లో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మాం. కానీ టీవీలో వచ్చినంత స్పందన రిలీజ్ టైం లో రాలేదు. ► టెక్నాలజీ పెరిగిన తర్వాత లీకేజీలు పెరిగాయి. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకు బాగా నమ్మకం వున్న వాళ్ళనే తీసుకుంటాం. తెలియనివారిని అస్సలు పెట్టుకోము. దీనికి కారణం లికేజీలే. మొదట్లో రీలు వుండేది. ఎడిటింగ్ రూమ్, ల్యాబ్ లో ప్రింట్ అయిన రీలు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రతిదానికి అవుట్ పుట్ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతిదానికి డేట్ తో సహా వాటర్ మార్క్ వేస్తాం. ►ఒక సినిమాకి కూడా పనిచేసే అనుభవం లేని దర్శకులు ఇప్పుడు వస్తున్నారు. ఇలాంటి వారితో పని చేయడం ఎలా వుంటుంది ? ఎడిటర్ గా మాకు చిన్న చిన్న సమస్యలు వుంటాయి. ఫైట్ మాస్టర్ మొత్తం ఫైట్ వుండాలంటారు. టాప్ యాంగిల్ లో కస్టపడి తీసిన షాట్ ఎందుకు పెట్టలేదని కెమరామెన్ అంటారు. సినిమాకి అక్కర్లేదని మేము తీసేసుంటాం. ఇలాంటి చిన్నచిన్న ఆర్గుమెంట్స్ జరుగుతాయి. ఫైనల్ కాల్ మాత్రం దర్శకుడిదే. ► ఎడిటింగ్ కి సంబధించిన విమర్శలని ఎలా తీసుకుంటారు ? విమర్శ మంచిదే. అయితే అది నిర్మాణాత్మకంగా వుండాలి. పది నిమిషాలు తగ్గించుంటే బావుంటుందని చెప్తారు. ఏం తగ్గించాలో చెప్పరు, ఏ సీన్ బాలేదో చెప్పరు. ఇలా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం. మాకూ కొంచెం హెల్ప్ ఫుల్ గా వుంటుంది. ►పెద్ద సినిమాకి చివరి నిమిషం వరకూ ఎడిటింగ్ చేస్తూనే వుంటారు. దానివలన ఒత్తిడిపెరుగుతుందా ? ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. ఓవర్సిస్ కి మూడు రోజులు ముందే వెళ్ళాలి. అంటే నాలుగు రోజులకి ముందే ఇచ్చేయాలి. దర్శకులకు చివరి నిమిషం వరకూ ఏదో చేయాలనే తాపత్రయం వుంటుంది. చూసింది పదిసార్లు జాగ్రత్తగా చూసి చివరి క్షణం వరకూ దానిపై చర్చజరుగుతుంది. ఇది ప్రతి సినిమాకి వుంటుంది. ► పాన్ ఇండియా సినిమాలు విదేశాలకు వెళ్ళినపుడు నిడివి తగ్గిస్తారా ? లేదు. అవార్డ్ లకి వెళ్ళే సినిమాకి మాత్రం పాటలు తీసేస్తాం. ఇండియన్ లాంగ్వేజస్ కి మాత్రం ఒక ఎడిట్ నే వెళుతుంది. ►ఇన్నేళ్ళ కెరీర్ లో మీ ఫేవరేట్ సినిమా ? ఫేవరేట్ అని ఏమీ లేదు. కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బావుండేదనిపిస్తుంది. ►మీతోటి ఎడిటర్స్ మధ్య ఎలాంటి అనుబంధం వుంది? మంచి అనుబంధమే వుంది. వర్క్ గురించి మాట్లాడుకుంటాం. మా కష్టాలు చెప్పుకుంటాం. సినిమా బాగా చేస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం. ►ఒక సినిమాని విజయవంతం చేయడంలో ఎడిటర్ పాత్ర ఎంత వుంటుంది ? ఒక దర్శకుడికి ఎడిటర్ కి రిలేషన్ షిప్ బావుంటే చాలా మంచి సినిమా అవుతుంది. ఎంత ఆర్గుమెంట్స్ జరిగితే రిజల్ట్ అంత మంచిగా వస్తుంది. ►డైరెక్టర్ తన స్వేఛ్చతో ఎడిటర్ ని ఎన్నుకుంటాడా ? హీరో జోక్యం వుంటుందా ? ఒకొక్క సినిమాకి ఒకొక్కలా వుంటుంది. 'సారోచ్చారా' తప్పితే పరశురాం అన్ని సినిమాలకి నేనే చేశా. దర్శకుడి తరపున వెళితే ఎడిటర్ బలంగా ఉంటాడు. ►పాన్ ఇండియా సినిమాలని తెలుగు కాకుండా ఇతర భాషల్లో చూసినపుడు ఏమైనా తేడా ఉంటుందా ? అలా ఏమీ వుండదు. కానీ రిమేక్ కి వచ్చేసరికి కొంచెం తేడా వుంటుంది. మలయాళం దృశ్యం నీట్ గా స్లోగా వుంటుంది. తెలుగులో చేసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టు మన స్టయిల్ లో చేశాం. ►కొత్తగా చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారి గాడ్ ఫాదర్, భోళా శంకర్, సమంత కధానాయికగా యశోద సినిమాలకి చేస్తున్నా. -
ఎడిటర్ థ్రిల్ ఫీలైతే సినిమా దాదాపు హిట్టే!
రెండు టేబుళ్లు ఓ సినిమా భవితవ్యాన్ని తేలుస్తాయంటారు. ఒకటి రైటింగ్ టేబుల్, రెండోది ఎడిటింగ్ టేబుల్. అంత కీలకమైన ఎడిటింగ్ టేబుల్ దగ్గర తన ‘కూర్పరితనం’తో ఎన్నో సినిమాలను విజయతీరాలకు చేర్చిన ఘనత మార్తాండ్ కె. వెంకటేష్‌ది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సీనియర్ టెక్నీషియన్‌తో భేటీ.. ఒక సినిమా జయాపజయాల్లో ‘ఎడిటింగ్’కి ఎంత భాగం ఉంటుందంటారు? ఎడిటింగ్ బాగా చేసిన సినిమా ‘హిట్’ నుంచి ‘సూపర్ హిట్’కి వెళుతుంది. అలాగే, యావరేజ్ సినిమా కూడా హిట్టవుతుంది. కానీ బాగా లేని సినిమాను ఎడిటింగ్‌తో అద్భుతం చేయలేము! ఏ సినిమా అయినా కథ బాగుంటేనే ఆడుతుంది! ఏ సినిమాకైనా తొలి ప్రేక్షకుడు మీరే కదా! మరి.. ఓ సినిమా ఫలితాన్ని అంచనా వేయడానికి మీరు ఎలాంటి కొలమానాలు పెట్టుకుంటారు? మామూలుగా కొంతమంది ఎడిటర్లు కథ వింటారు. కానీ, నేను వినను. ఎందుకంటే, కథ వింటే సినిమా ఏంటో అర్థమవుతుంది. అదే వినలేదనుకోండి.. ఒక్కో సీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు, తర్వాతి సీన్ ఇలా ఉంటుందని ఊహించుకోవడం జరుగుతుంది. నా ఊహకు భిన్నంగా సీన్ ఉన్నప్పుడు సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అవుతాను. ఎడిటర్ థ్రిల్ ఫీలైతే సినిమా దాదాపు హిట్ కిందే లెక్క! ఎడిటింగ్ టైమ్‌లో దర్శక, నిర్మాతలు ‘ఎలా ఉంది’ అని అడుగుతారు కదా... అది ఒక్కోసారి ఇబ్బంది అనిపించదా? నిజంగా అది క్లిష్టమైన పరిస్థితే. అయితే నేను మాత్రం సినిమా బాగున్నా, బాగా లేకపోయినా ఫ్రాంక్‌గా చెప్పేస్తాను. నేను అంతలా ఇన్వాల్వ్ అయ్యి ఫ్రాంక్‌గా ఉంటాను కాబట్టే, చాలామంది నన్ను ఎడిటర్‌గా పెట్టుకుంటారు. జనరల్‌గా ఒక సినిమా ఎడిటింగ్‌కి ఎన్ని రోజులు పడుతుంది? యాక్షన్ సినిమాల ఎడిటింగ్ సులువు. కానీ, ‘కలిసుందాం రా’, ‘బొమ్మరిల్లు’, ‘ఆనంద్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీస్‌ని ఎడిట్ చేయడమే కొంచెం కష్టం. కాలక్రమేణా ఎడిటింగ్ పరంగా వచ్చిన మార్పుల గురించి చెబుతారా? మొదట్లో సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేవాళ్లు. లొకేషన్లో సౌండ్‌ను రికార్డ్ చేసేవారు. పిక్చర్పైనే సౌండ్ ఉంటుంది. దాన్ని ‘మ్యారీడ్ ప్రింట్’ అనేవారు. అది నాన్నగారి టైమ్‌లో ఉండేది. ఆ తర్వాత డబుల్ పాజిటివ్ అని ఉండేది. దానికేంటంటే, సౌండ్ విడిగా రికార్డ్ చేసేవారు. అప్పట్లో ఫిల్మ్ వాడేవారన్న సంగతి తెలిసందే. అందుకే, ఫిల్మ్ కట్ చేసే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచించేవాళ్లం. డబుల్ పాజిటివ్ నుంచి స్టీమ్ బ్యాక్ విధానం వచ్చింది. అది కొద్దిగా స్మూత్‌గా ఉంటుంది. తర్వాత ‘యావిడ్’ వచ్చింది. కంప్యూటర్లో చేసేస్తున్నాం. ఈ విధానం వచ్చాక పని సులువైంది. అంటే.. పని గంటలు కూడా తగ్గుతాయేమో? అప్పట్లో ఫిల్మ్ కటింగ్ అంటే మెదడుకి పని ఎక్కువ ఉండేది... కత్తిరించిన ముక్కలను జాగ్రత్తగా దాచుకోవడం, ఏయే సీన్ ఎక్కడ రావాలో పేపర్ మీద మార్క్ చేసుకోవడం... ఇలా! ఇప్పుడు అలా కాదు. ‘కట్ చేసి చూద్దాం.. బాగా లేకపోతే మళ్లీ చేయొచ్చు’ అనే వెసులుబాటు ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒత్తిడీ తగ్గింది, పని గంటలూ తగ్గాయి. మీ ఇన్వాల్వ్మెంట్లోనూ అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? డిజిటల్ విధానం వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం తగ్గించుకున్నాను. ఇంతకు ముందు దర్శక, నిర్మాతలు, హీరోలతో కలిసి మేం చర్చించేవాళ్లం. ఎడిటింగ్ రూమ్‌లో ఓ డిస్కషన్ జరిగేది. కానీ, ఇప్పుడది పోయింది. నేను ఎడిట్ చేసిన వెర్షన్‌ని డెరైక్టర్, ప్రొడ్యూసర్ కాపీ చేసుకుని, ఎవరికి వాళ్లు కంప్యూటర్లో చూస్తారు. ‘ఈ సీన్స్ తీసేయొచ్చు’ అని పేపర్ మీద రాసి పంపిస్తుంటారు. ఫిల్మ్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎడిటింగ్ రూమ్‌లోనే చేయాలి. కానీ, ఇప్పుడు రూమ్ దాటింది. అసలు ఎడిటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే మంచిదంటారా? కచ్చితంగా మంచిదే... వేస్టేజ్ తగ్గుతుంది. ఎడిటింగ్ అంటే కేవలం కట్ చేయడం, జాయిన్ చేయడమే కాదు, ఒక సరైన స్క్రీన్‌ప్లే క్రియేట్ చెయ్యడం. ఆర్ట్ డెరైక్టర్‌కీ, కెమెరాకీ ఎలా లింకుంటుందో, స్క్రీన్‌ప్లేకి, ఎడిటింగ్‌కి అంతే లింకుంటుంది. ఎడిటింగ్‌లోనే ఫైనల్ స్క్రీన్‌ప్లే వస్తుంది. విడుదలైన తర్వాతా కొన్ని సినిమాలను ట్రిమ్ చేస్తుంటారు కదా...? అవును. అయితే ఒకసారి థియేటర్‌కి వెళ్లి, మళ్లీ ట్రిమ్ అయిన సినిమాలకు అవార్డు ఇవ్వకూడదు. ఒక్కోసారి దర్శకుడి సూచన మేరకు చేసేస్తుంటాం. ఏది ఏమైనా మళ్లీ సినిమా ట్రిమ్ చేయాల్సి వస్తే, అది ఎడిటర్‌కి బ్యాడ్ అని నా ఫీలింగ్. సినిమా సక్సెస్‌కి ఎడిటింగ్ చాలా కీలకం. కానీ, సినిమా హిట్టయితే హీరో, దర్శకుడు, సంగీతదర్శకుడు, మహా అయితే కెమెరామేన్, ఆర్ట్ డెరైక్టర్‌కి క్రెడిట్ ఇస్తారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? కొంచెం బాధగానే ఉంటుంది. సినిమాలో ఎక్కడో ఒకటి, రెండు సీన్స్ చేసిన ఆర్టిస్టులను కూడా వేదిక పైకి పిలుస్తారు. అది నేను తప్పనడంలేదు. కానీ, పూర్తి సినిమాకి పని చేసిన మమ్మల్ని పిలవరు. అందుకే నేను 90 శాతం ఫంక్షన్స్‌కి వెళ్లను. శేఖర్ కమ్ముల లాంటి ఒకరో, ఇద్దరో తప్ప మమ్మల్ని స్టేజి మీదకు ఎవరూ పిలవరు. కళకు భాషతో సంబంధం లేదంటారు. ఎడిటింగ్కూ అది వర్తిస్తుందా? లేదు. భాష కచ్చితంగా తెలిసుండాలి. పాత్రలేం మాట్లాడుతున్నాయో తెలిస్తేనే పర్ఫెక్ట్గా ఎడిట్ చేయొచ్చు. పక్కన ఎవరైనా ఉండి అర్థం చెప్పినా, నా వల్ల కాదు. నేను చెయ్యను. మీకు సొంత ఎడిటింగ్ సూట్ ఉందా? లేదు. కావాలనే పెట్టుకోలేదు. సొంత సూట్ పెట్టుకుంటే ఏడాదిలోనే పెట్టుబడి వచ్చేస్తుంది. కానీ, ఎక్కువ పని గంటలు రాసి, డబ్బులు తీసేసుకుంటున్నానని సందేహించవచ్చు. నాకెందుకా చెడ్డపేరు? మాట్లాడుకున్నదే చాలామంది ఇవ్వరు. ఎడిటింగ్‌కి వచ్చేసరికి డబ్బులైపోతాయ్. ఎడిటర్లో మంచి డెరైక్టరూ ఉంటాడంటారు. డెరైక్షన్ ఎప్పుడు? మొన్నటి వరకు ఆ ఆలోచన లేదు. ఈ మధ్య డెరెక్షన్ చేయమని ఓ వ్యక్తి బాగా ఒత్తిడి చేస్తున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే చేయచ్చు. - గోల్డీ మీ నాన్నగారు కె.ఎ.మార్తాండ్ ఎడిటర్ కాబట్టి, సహజంగానే మీరు కూడా ఈ శాఖలోకి వచ్చారా? మా నాన్నగారి మామయ్య బీఏ సుబ్బారావుగారు పేరొందిన దర్శక, నిర్మాత. అప్పట్లో మా నాన్నగారు కెమెరామేన్ అవ్వాలనుకున్నారట. కానీ, ఎడిటింగ్ నేర్చుకోమని బీఏ సుబ్బారావుగారు చెప్పడంతో నాన్నగారు ఈ శాఖలోకి వచ్చారు. నాకు మాత్రం సినిమా పరిశ్రమ అంటే ఎందుకో భయం ఉండేది. అందుకే బ్యాంక్ జాబ్ చేయాలనుకున్నాను. కానీ, నాన్నగారు మాత్రం ఎడిటింగ్ ఫీల్డ్ అన్నారు. దాంతో ఆయనతో ఆరు నెలలు మాట్లాడలేదు. అయితే నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను ఆయనకు అసిస్టెంట్‌గా వెళ్ళాల్సివచ్చింది. అలా అనుకోకుండా నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. రెండేళ్లు ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశాక, 1994లో సొంతంగా ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. మంచి పేరొచ్చింది. డబ్బూ వస్తోంది. వృత్తిపరంగా హ్యాపీగానే ఉండడంతో ఇలా కంటిన్యూ అయిపోయాను. అయితే నేను ఎడిటర్ అయిన మొదటి సంవత్సరంలోనే నాన్నగారు చనిపోయారు. నా సక్సెస్‌ను ఆయన చూడలేదు. అది మాత్రం నాకెప్పటికీ బాధగా ఉంటుంది.