ఏడాదికోసారి... మా అబ్బాయిని జైలుకి పంపిస్తా!
మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకుడు జాకీ చాన్ వారసుడు జేసీ చాన్ తండ్రిలానే ఈ కళలో భేష్ అనిపించుకున్నారు. తండ్రిలా రిస్కీ యాక్షన్ చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకెళుతూ, మంచి పేరు తెచ్చుకున్న జేసీ చాన్ ఆ మధ్య మాదకద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ నేరానికి గాను జేసీ ఆరు నెలల జైలు జీవితం గడిపాక, ఇటీవలే విడుదలయ్యారు. ఈ ఆరు నెలల శిక్ష జేసీలో చాలా మార్పు తీసుకువచ్చిందట. తనయుడిలో వచ్చిన మార్పు గురించి జాకీ చాన్ చెబుతూ -
‘‘జైలుకు ముందు... ఆ తర్వాత జేసీ జీవితంలో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు తను అన్ని విషయాల్లోనూ నిర్లక్ష్యంగా ఉండేవాడు. వేసుకునే దుస్తుల నుంచి వాడుకునే వస్తువుల వరకూ అన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ విసిరేసేవాడు. బూట్లు కూడా అంతే. కానీ, ఇప్పుడు అలా కాదు. బయటి నుంచి ఇంటికి రాగానే పాదరక్షలను చక్కగా, వాటికి కేటాయించిన ర్యాక్లో పెట్టేస్తున్నాడు. అల్మారాలో బట్టలు సరిగ్గా సర్దుకుంటున్నాడు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. వంటగదిలోకెళ్లి వాళ్ల అమ్మకి సహాయం చేస్తున్నాడు. ఒక రోజు గిన్నెలు కూడా కడిగాడు. అందుకే మా అబ్బాయిని ఏడాదికోసారి జైలుకి పంపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా’’ అని సరదాగా అన్నారు.