మాస్, క్లాస్, ఫ్యామిలీస్ ఇష్టపడుతున్న సరైనోడు
మాస్... ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం బోయపాటి సినిమాలు. ‘భద్ర’ నుంచి ‘సరైనోడు’ వరకు బోయపాటి అంటే కేరాఫ్ మాస్ మసాలా సినిమాలే. కుటుంబ సమేతంగా చూడదగ్గ మాస్ ఎంటర్టైనర్స్ని అందించిన బోయపాటి ఇప్పుడు ‘సరైనోడు’ని అదే పంథాలో స్టైల్ జోడించి, తీశారు. బన్నీతో బోయపాటి సినిమా కమిటైన తర్వాత చాలా మందికి వచ్చిన అనుమానం.. ఎవరి దారిలోకి ఎవరొస్తారు అని. కానీ విచిత్రంగా... ఇద్దరూ ఒకే దారిలో పయనించారు. అల్లు అర్జున్ తనలోని టన్నులు టన్నుల ఎనర్జీనంతా ధారపోశారు.
బోయపాటి తనలోని మాస్‌కి డోస్ పెంచడంతో పాటు స్టైల్‌ని కూడా జోడించి, మంచి స్టైలిష్ మాస్ మూవీ అందించారు. అల్లు అర్జున్ పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో... పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో కథను భుజాలమీద తీసుకెళ్లారు. మాస్, క్లాస్ తేడా లేకుండా ప్రేక్షకులు సరైనోడికి నీరాజనాలు అందిస్తున్నారనడానికి హౌస్‌ఫుల్ కలెక్షన్సే నిదర్శనం. పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా కితాబులు అందుకుంటోందని చిత్రబృందం అంటోంది.
‘సరైనోడు’లో హీరోకు సిస్టమ్‌తో పని ఉండదు. తప్పు జరిగితే ఎంత పెద్ద వాళ్లనైనా వచ్చి కొట్టేసి వెళ్లిపోవడమే. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ పాత్రను అల్లు అర్జున్ అద్భుతంగా చేశారు. తనను తాను కొత్తగా చూపించుకోవాలని తపించే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ప్రతీ సినిమాకు తనలోని వైవిధ్యాన్ని చూపిస్తూ... కెరీర్లో వరుసగా యాభై కోట్ల మార్కును చేరుకుంటున్నారు.
బన్నీలోని పవర్ఫుల్ యాంగిల్‌ను బాగా వాడుకున్నారు బోయపాటి. డైలాగ్ డిక్షన్‌లోనూ మార్పు తీసుకొచ్చారు. తనకు కావాల్సిన దాన్ని కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే పలికించుకున్నారు బోయపాటి. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఫైట్ అయితే బోయపాటికి యాక్షన్ ఎపిసోడ్స్‌పై ఉన్న ప్రేమను చూపిస్తుంది. మాస్ సామ్రాజ్యాన్ని బోయపాటి ఏలేస్తున్నారనడానికి ‘సరైనోడు’ సరైన రుజువు. మాస్లో పీక్స్‌ని టచ్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే సెంటిమెంట్, యువతను గిలిగింతలు పెట్టే లవ్‌స్టోరీతో ఫుల్ మీల్స్‌లాంటి సినిమాని అందించారు బోయపాటి.
దిట్టమైన కండలు పెంచి, ఫిజిక్ వైజ్‌గా కూడా అదుర్స్ అనిపించుకున్నారు బన్నీ. అలాగే ఫైట్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ప్రతీ సీన్లోనూ మాస్‌ని ఎట్రాక్ట్ చేసే విధంగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. రిథమిక్ స్టెప్పులతో డ్యాన్సులేసి ఊపు తీసుకొచ్చారు.
ఆది పినిశెట్టి.. ఈ బ్యాడ్ బాయ్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ‘సరైనోడు’ సినిమాలో తన నటనతో ఆది అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. హీరోగా రాణిస్తున్న ఆది విలన్‌గా నటించింది తొలిసారే అయినా భేష్ అనిపించుకున్నారు. నువ్వా? నేనా? అన్నట్లుగా హీరో, విలన్ పాత్రలను డిజైన్ చేయడంలో బోయపాటి సఫలీకృతులయ్యారు.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే కేథరీన్ మోడ్రన్ ఎమ్మెల్యేగా మెప్పించింది. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో రకుల్ అలరించింది. అల్లు అర్జున్‌కి బాబాయ్‌గా శ్రీకాంత్ నటన బాగుంది. మిగిలిన పాత్రల్లో బన్నీకి తండ్రిగా నటించిన జయప్రకాష్ మంచి క్యారెక్టర్లో కనిపించారు. బ్రహ్మానందం, విద్యుల్లేఖా రామన్, పృథ్వీ కామెడీ పండించే పనిలో సక్సెస్ అయ్యారు. హిలేరియస్ కామెడీ పంచ్‌లతో నవ్వించారు.
‘సరైనోడు’ చిత్రానికి ప్రధానమైన, కీలకమైన కోర్టు సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందించారు బోయపాటి. హైలీ ఎమోషనల్ సీన్‌తో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశారు. పబ్‌లో స్కేటింగ్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసి యాక్షన్‌లో సరికొత్త కోణాన్ని చూపించారు. ఏ చిత్రానికైనా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయేలా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు బోయపాటి. ‘సరైనోడు’లోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ రూపొందించారు. యాక్షన్ పార్ట్‌కి తమన్ రీ-రికార్డింగ్ అదిరిపోయింది. ఈ చిత్ర విజయంలో డైలాగ్స్ మరో ప్రధాన భూమిక పోషించాయి.
హీరో, విలన్ మధ్య బ్యాక్ గ్రౌండ్ గురించి, బ్రాండ్ గురించి రత్నం రాసిన డైలాగ్స్‌కి క్లాప్స్ పడుతున్నాయి. అలాగే హీరో రాసిన లవ్ లెటర్‌ను తండ్రి చదివే సందర్భంలో కామెడీ పండింది. ఆ తర్వాత విలన్ బ్యాచ్‌తో పెళ్లి చూపుల సీన్ కూడా హిలేరియస్‌గా పండింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఉంది. నిర్మాత అల్లు అరవింద్ ఖర్చుకు వెనకాడకుండా లావిష్‌గా నిర్మించిన వైనం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మాస్, క్లాస్ తేడా లేకుండా అందర్నీ మెప్పించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఈ సమ్మర్‌కి అందించారు. ఇప్పటికే హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. క్లాస్, మాస్, ఫ్యామిలీస్ ఆదరణతో మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళ్తోంది. సమ్మర్ సీజన్‌కి మాస్, క్లాస్, ఫ్యామిలీస్‌కి ‘సరైనోడు’ వచ్చాడు.