matham
-
మదురై మఠాధిపతి కన్నుమూత
మదురై: మదురైలో ప్రసిద్ధి చెందిన శైవ మఠం ఆధీనం(మఠాధిపతి) అరుణగిరినాధర్ (77) శుక్రవారం కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిరోజుల క్రితం ఆయనను మదురైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధీనం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 1,500 సంవత్సరాల చరిత్ర ఉన్న శైవ మఠానికి ఆయన 292వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. అరుణగిరినాధర్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామిలు సంతాపం వ్యక్తం చేశారు. శైవ మత సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సీనియర్ పాత్రికేయులుగా పని చేస్తూ ప్రజోపకరమైన పనులలో ఆయన నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మరణం తీరని లోటు అని చెప్పారు. తమిళ ప్రపంచానికి ఆయన మరణం పెద్ద లోటు అంటూ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
వైభవం.. ముంజీ మహోత్సవం
– శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూర్వాశ్రమ పుత్రుడికి యజ్ఞోపవీతం – వేలాది మంది భక్తుల మధ్య సాగిన జంజధారణ మంత్రాలయం: ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పూర్వాశ్రమ పుత్రుడు అప్రమేయ ముంజీ మహోత్సవం వైభవంగా సాగింది. గురువారం పీఠాధిపతి ఆశీస్సులతో వేద పాఠశాల ఆవరణలో అప్రమేయ చేతుల మీదుగా హోమాలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పండిత కేసరి గిరియాచార్ అప్రమేయకు యజ్ఞోపవీతం కానిచ్చారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, అశేష భక్తజన సందోహం మధ్య జంజధారణ గావించారు. పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి పండితకేసరి గిరియాచార్ సమక్షంలో పండిత మహాశయులు అప్రమేయకు జంజం తొడిగించారు. ఉదయం 10.15 గంటలకు శుభ మేషలగ్న, వృషభాంశ గడియలో ముంజీ చేశారు. ముందుగా ప్రత్యేక హోమాలు చేపట్టి పుష్పశోభిత సభపై మంత్రజపాల మధ్య యజ్ఞోపవీతం ముగించారు. అనంతరం అప్రమేయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల పాద పూజ చేసుకున్నారు. టీటీడీ కల్యాణ మండప ఆవరణలో భోజనాలు నిర్వహించారు. వేడుకలో బెంగళూరు ఎమ్మెల్యే అరవింద లింబావలి, విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారాయణస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, మఠం ఈఈ సురేష్ కోనాపూర్, పాఠశాల ప్రిన్సిపాల్ వాదీరాజాచార్ పాల్గొన్నారు. -
ముగిసిన మొహర్రం సంతాప దినాలు
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో మొహర్రం సంతాప దినాలు సోమవారం ముగిశాయి. గత నెల 12వ తేదీన పీర్ల నిమజ్జనంతో ఇవి ప్రారంభమయ్యాయి. ముగింపు సందర్భంగా కొండపేటలోని తల్లిపీర్ల చావిడి వద్ద నుంచి ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ పీర్లకు షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం చురకత్తులు, బ్లేడ్లతో వీపు, ఎదలపై మాతం చేస్తూ ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అలాగే పట్టణంలోని ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు మీర్ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ ఆధ్వర్యంలో దొరకోట వరకు షీయా మతస్తులు మాతం నిర్వహించారు. మాతం చూసేందుకు హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంఐఎం ఆధ్వర్యంలో వారకి మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు.