మట్టి మనిషి
‘మనిషికి సంతోషం ఎక్కడుందంటావా? కష్టపడి పని చెయ్యడంలో ఉంది. చెమటోడ్చి భూమి దున్నటంలో ఉంది. రెక్కల కష్టం అక్కరకు రావటంలో ఉంది. మన కష్టార్జితం మన చేతుల్లోకొచ్చినప్పుడు ఉండే ఆనందం లాంటిది ఈ భూమ్మీదే మరొకటి లేదురా బాబూ’ అంటాడు మనవడు రవితో సాంబయ్య. ఈ నవలలోని అసలైన మట్టి మనిషి ఆయన. అప్పటికి సాంబయ్య జీవితం ఒక పూర్తి చక్రం తిరిగివుంటుంది.సాంబయ్య తండ్రి వెంకయ్య కట్టుబట్టలతో బతుకుతెరువు కోసం వస్తాడు. మోతుబరి వీరభద్రయ్య దగ్గర పాలేరుగా పనిచేస్తాడు. జీతగానిగా జీవితం లేదని తెలుసుకుని రెండెకరాల పొలం కౌలు చేస్తాడు. సాంబయ్య చేతికి అందివచ్చే నాటికి ఐదెకరాల భూమి, ఇల్లు సంపాదించివుంటాడు వెంకయ్య.
భూమిదాహం తప్ప మరొకటి ఎరుగని, మట్టి వాసనే తప్ప సంసారంలో సరసం తెలియని సాంబయ్య తనకు కొడుకు వెంకటపతి పుట్టేనాటికి దాన్ని రెట్టింపు చేస్తాడు. పిసినారితనంతో భార్యను పోగొట్టుకుంటాడు. అయినా పెళ్లి చేసుకోడు. వెంకటపతికి నూనూగు మీసాలు వచ్చేనాటికి ఎనబై ఎకరాల మాగాణికీ, కొత్తగా కట్టిన డాబాకీ, గొడ్గూ గోదకూ యజమాని అవుతాడు సాంబయ్య. అదంతా ఆయన రెక్కల కష్టం వల్ల, చెమట చిందించటం వల్ల జరిగిన అద్భుతం.తండ్రి పాలేరుగా ఉన్న ఇంటివాళ్లతోనే కొడుక్కు సంబంధం కలుపుకోవడం ద్వారా తన గౌరవాన్ని పెంచుకోవాలనుకున్న సాంబయ్య నిర్ణయం ఈ నవలను మరో దారి పట్టిస్తుంది. అప్పటికి ఆర్థికంగా దిగజారివున్న వీరభద్రయ్య కొడుకు బలరామయ్యతో వియ్యమందుతాడు. తండ్రి నుంచి అహంకారం, అభిజాత్యం వారసత్వంగా అబ్బిన వరూధిని కొత్త కోడలుగా వచ్చీ రావడంతోనే కాపురాన్ని పట్నానికి మారుస్తుంది. వేలకు వేలను మంచినీళ్లలా ఖర్చు చేయిస్తుంది.
కీలుబొమ్మైన వెంకటపతిని తాగుడుకు బానిసను చేస్తుంది. తండ్రికి తెలియకుండా కొడుకు ధాన్యం తోలుకెళ్లేంత దూరం సంబం«ధం విచ్ఛిన్నమయ్యాక, అన్నివిధాలా భ్రష్టురాలై వరూధిని ఆత్మహత్య చేసుకుంటుంది. వెంకటపతి తన కొడుకు రవిని తండ్రి దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఊరి పొలిమేరలో వదిలి పారిపోతాడు. మనవడు తాతను చేరేప్పటికి సాంబయ్య పాకలోని కుక్కిమంచంలో ఉంటాడు. ఆయన దగ్గర మిగిలింది ముప్పాతికెకరం బంజరు భూమి. మనవడి కోసమైనా బతకాలన్న సంకల్పంతో సాంబయ్య మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కూరగాయల సాగు మొదలెడతాడు. ఆ భూమీ ఊరిలోని కుతంత్రం వల్ల పోవడంతో తుదిశ్వాస విడుస్తాడు. ‘వస్తాన్రా వస్తా, తెస్తా నీ కోసం తుపాకి’ అని రవి అనడం ముగింపు.నాలుగు తరాల జీవితాన్ని చిత్రించిన ఈ నవల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను ప్రతిఫలిస్తుంది. బస్తీ వ్యామోహం ఎలా ఉండేదో చిత్రిస్తుంది. చుక్క చెమట చిందించకుండా అన్ని విధాలుగా ఎదిగిపోయే దళారీ కనకయ్యలను ఎత్తిచూపుతుంది. రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవికి ఎనలేని పేరు తెచ్చిన ఈ నవల 1972లో ప్రచురితమైంది.