Mayor couple
-
మేయర్ దంపతుల కేసులో దర్యాప్తు పూర్తి
► నిందితుల వేట పూర్తి ► 23 మందిపై సిద్ధమవుతున్న చార్జిషీట్ ► వందమందికి పైగా సాక్ష్యులు..? ► ఈ వారంలోనే కోర్టుకు అభియోగ పత్రం చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో నిందితుల అరెస్టుల పర్వం ముగిసింది. ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న నిందితుడు ఆర్వీటీ.బాబును అరెస్టు చూపడం ద్వారా ఇప్పటి వరకు కేసు నమోదైన 23 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హత్య జరిగిన తీరు, ప్రత్యక్ష సా క్ష్యుల వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు తాజాగా హైదరాబాదు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టులు కూడా తెప్పించున్నారు. దీంతో కేసు దర్యాప్తు పూర్తయినట్లే. నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంపై సిద్ధమవుతున్న పోలీసులు ఈ వారంలోనే దాన్ని న్యాయస్థానానికి అందజేయనున్నారు. అందరూ దొరికినట్లే... గతేడాది నవంబరు 23న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అనురాధ, మోహన్ల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జంట హత్యల్లో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖరేనని పోలీసు నిర్ధారణకు వచ్చారు. తొలుత అయిదు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 23కు చేరుకుంది. గత వారం వరకు పరారీలో ఉన్న బుల్లెట్ సురేష్, ఆర్వీటీ.బాబులను అరెస్టు చూపించడంతో నిందితులంతా దొరికినట్లే అయ్యింది. ఫలితంగా ఇప్పటికే చార్జ్‌షీట్ తయారు చేస్తున్న పోలీసు అధికారులకు తాజా అరెస్టులు కాస్త ఉపసమనాన్ని ఇచ్చినట్టే. అయితే జంట హత్యల కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వాళ్లు, లొంగిపోయిన వాళ్లల్లో టీడీపీకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాహళహస్తీశ్వర ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు కాసరం రమేష్, బుల్లెట్ సురేష్, మురుగ, ఆర్వీటీ.బాబు తదితరులంతా టీడీపీలో ఉంటూ ప్రధాన నిందితుడు చింటూకు సాయం చేసినట్లు, హత్య కుట్రలో పాలు పంచుకున్నట్లు పోలీసులు నేరాభియోగ పత్రాన్ని రూపొందిస్తున్నారు. వంద మందికి పైగా సాక్ష్యులు... ఈ జంట హత్యల కేసులో చిత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 130 మందిని పోలీసులు విచారించారు. అయితే తుదకు కేసు మాత్రం 23 మందిపై నమోదు చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులతో పాటు చింటూకు, మోహన్ దంపతులకు మధ్య ఉన్న వైరం, ఇతర ఆర్థిక లావాదేవీల తగాదాలు తెలిసిన దాదాపు వంద మందికి పైగా వ్యక్తుల్ని జంట హత్యల కేసులో సాక్ష్యులుగా చేర్చినట్లు తెలుస్తోంది. మేయర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో కేసు త్వరగా విచారించడానికి ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బాధ్యతలు అప్పగించి, ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. -
'రేయ్.. శ్రీమంతానికి వచ్చి పోరా'
- చింటూ, మేయర్ అనూరాధ మధ్య చివరి సంభాషణ చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో జరిగిన మేయర్ దంపతుల హత్యకేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న దుండగులతో పాటు మేయర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మేనల్లుడు చింటూతో మనస్పర్థలు ఉన్నా.. మేయర్ అనూరాధ అతనికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. మేయర్ దంపతుల కోడలు హేమలత (కఠారి ప్రవీణ్ భార్య)కు నవంబరు ఒకటో తేదీన ఇరువారంలోని ఓ మండపంలో శ్రీమంతం నిర్వహించారు. ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ముందురోజు మేయర్ అనూరాధ స్వయంగా చింటూకు ఫోన్ చేశారు. ‘‘రేయ్.. పాప (హేమలత)కు శ్రీమంతం చేస్తా ఉండాము. తప్పకుండా వచ్చి పోరా..’’ అని ఫోన్లో చెప్పారు. దీనికి చింటూ సమాధానం ఇస్తూ. ‘‘నేను వచ్చేది మళ్లీ, ముందు నీ మొగుడ్ని జాగ్రత్తగా చూసుకో’’ అని ఫోన్ పెట్టేశాడు. అయిన వాడు, అందులోనూ అసంతృప్తితో ఉన్నాడు. మనల్ని ఏం చేస్తాడులే.. అనుకుని మేయర్ దంపతులు ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. ఘోరం జరిగిపోయింది. అనుచరులకు చింటూ భారీ నజరానాలు.. తననే నమ్ముకున్న అనుచరులకు చింటూ భారీ నజరానాలు ఇచ్చాడా..? చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు ఆరు నెలల క్రితమే రూ.50 లక్షలను చింటూ తన అనుచరులకు పంపిణీ చేసినట్లు సమాచారం. మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్‌లను విచారించగా వాళ్లు చెప్పిన సమాధానాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. పేద కుటుంబానికి చెందిన తనకు చింటూ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశాడని జయప్రకాష్, రాళ్లు కొట్టి పనిచేసే తనకు రూ.13 లక్షలు ఇచ్చాడని మంజునాథ్, కఠారి మోహన్ తనను ఛీ కొడితే చింటూ చేరదీసి తనకు రూ.18 లక్షలు ఇచ్చినట్లు వెంకటాచలం పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
మేయర్ దంపతుల హత్యకేసులో ముగ్గురు అరెస్టు
- ప్రాథమికంగా 11 మందిపై కేసుల నమోదు - ప్రధాన నిందితుడు చింటూ కోసం గాలింపులు చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ గొడవలు, ఆర్థిక కారణాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా మోహన్ మేనల్లుడు చింటూ (38) అలియాస్ చంద్రశేఖర్ పరారీలో ఉండగా ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కఠారి మోహన్‌కు ఆయన మేనల్లుడు చింటూకు ఏడాది క్రితం నుంచి మనస్పర్దలు ఉన్నాయి. వీరిద్దరికీ చెందిన క్వారీలో సైతం గొడవలు ఉన్నాయి. దీంతో పాటు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చింటూకు సంబంధించిన సివిల్, ఇతర టెండర్లు, బిల్లులు ఇవ్వడంలేదని మేయర్, మోహన్‌లపై పగ పెంచుకున్నాడు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా అణచివేస్తున్నారని భావించిన చింటూ తన మామ, అక్కలపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న జీఎస్.వెంకటాచలపతి(51)ది కర్నాకటలోని కోలార్. గతంలో కేఎస్ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసిన ఇతను 2007లో అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే.బాబుపై జరిగిన హత్యాయత్నాల కేసులో నిందితుడిగా ఉండటంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన ఇతను తనకు ఆర్థిక సాయం చేయమని కఠారి మోహన్‌ను అడిగాడు. అయితే మోహన్ తనను కొట్టి, తిట్టి అవమానించి తరిమేశాడని చెబుతూ వెంకటాచలం చింటూ వద్ద చేరాడు. దీంతో ఆరు నెలల క్రితం నుంచి చింటూ కఠారి దంపతులను హత్య చేయడానికి పథకం వేశాడు. పలుమార్లు ఈ పథకాలు ఫలించకపోగా ఈ నెల 17వ తేదీన చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చింటూ, వెంకటాచలంలు బురఖాలు ధరించి మేయర్‌ను ఆమె భర్తను అతి దారుణంగా హత్య చేసి చంపేశారు. చింటూ.. మేయర్ కఠారి అనురాధ నుదిటిపై తుపాకీతో కాల్చగా, మోహన్‌ను కత్తులతో వేటాడి నరికి చంపారు. హత్య జరిగిన తరువాత వెంకటాచలపతి, చింటూ వద్ద పనిచేసే గంగవరంకు చెందిన టీ.మంజునాథ్ (27), గంగనపల్లెకు చెందిన జయప్రకాష్ (23) అనే వ్యక్తులు తమకు రక్షణ కావాలని పోలీసులను కోరగా వారు రక్షణ కల్పించారు. మిగిలిన దుండగులు పారిపోయారు. చింటూతో పాటు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు నియమించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా కేసు విచారణ చేపట్టిన చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు 34 మంది సాక్ష్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ ముగ్గురు నేరం చేసినట్లు నిర్దారించుకోవడంతో మంగళవారం వీళ్లను అరెస్టు చేశారు. 11 మందిపై కేసులు నమోదు... జంట హత్యల కేసులో ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, హరిదాస్, మొగిలి, శశిధర్లు ఉన్నారు. నిందితులపై భారతీయ శిక్ష్మాసృతి 302, 307, 120 (బీ), 301 (ఆర్డబ్ల్యూ), 511 ఆర్డబ్ల్యూ 34, సెక్షన్ 25 (1) (బీ, 27 మారణాయుధాల నిరోధక చట్టం -1959) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దుండగుల ఉపయోగించిన కత్తులు, తుపాకీలు, వాహనాలను, బురఖాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.