- ప్రాథమికంగా 11 మందిపై కేసుల నమోదు
- ప్రధాన నిందితుడు చింటూ కోసం గాలింపులు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ గొడవలు, ఆర్థిక కారణాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా మోహన్ మేనల్లుడు చింటూ (38) అలియాస్ చంద్రశేఖర్ పరారీలో ఉండగా ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కఠారి మోహన్‌కు ఆయన మేనల్లుడు చింటూకు ఏడాది క్రితం నుంచి మనస్పర్దలు ఉన్నాయి. వీరిద్దరికీ చెందిన క్వారీలో సైతం గొడవలు ఉన్నాయి. దీంతో పాటు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చింటూకు సంబంధించిన సివిల్, ఇతర టెండర్లు, బిల్లులు ఇవ్వడంలేదని మేయర్, మోహన్‌లపై పగ పెంచుకున్నాడు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా అణచివేస్తున్నారని భావించిన చింటూ తన మామ, అక్కలపై మరింత కక్ష పెంచుకున్నాడు.
ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న జీఎస్.వెంకటాచలపతి(51)ది కర్నాకటలోని కోలార్. గతంలో కేఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసిన ఇతను 2007లో అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే.బాబుపై జరిగిన హత్యాయత్నాల కేసులో నిందితుడిగా ఉండటంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన ఇతను తనకు ఆర్థిక సాయం చేయమని కఠారి మోహన్‌ను అడిగాడు. అయితే మోహన్ తనను కొట్టి, తిట్టి అవమానించి తరిమేశాడని చెబుతూ వెంకటాచలం చింటూ వద్ద చేరాడు. దీంతో ఆరు నెలల క్రితం నుంచి చింటూ కఠారి దంపతులను హత్య చేయడానికి పథకం వేశాడు. పలుమార్లు ఈ పథకాలు ఫలించకపోగా ఈ నెల 17వ తేదీన చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో చింటూ, వెంకటాచలంలు బురఖాలు ధరించి మేయర్‌ను ఆమె భర్తను అతి దారుణంగా హత్య చేసి చంపేశారు. చింటూ.. మేయర్ కఠారి అనురాధ నుదిటిపై తుపాకీతో కాల్చగా, మోహన్‌ను కత్తులతో వేటాడి నరికి చంపారు.
హత్య జరిగిన తరువాత వెంకటాచలపతి, చింటూ వద్ద పనిచేసే గంగవరంకు చెందిన టీ.మంజునాథ్ (27), గంగనపల్లెకు చెందిన జయప్రకాష్ (23) అనే వ్యక్తులు తమకు రక్షణ కావాలని పోలీసులను కోరగా వారు రక్షణ కల్పించారు. మిగిలిన దుండగులు పారిపోయారు. చింటూతో పాటు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు నియమించినట్లు ఎస్పీ తెలిపారు. కాగా కేసు విచారణ చేపట్టిన చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు 34 మంది సాక్ష్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ ముగ్గురు నేరం చేసినట్లు నిర్దారించుకోవడంతో మంగళవారం వీళ్లను అరెస్టు చేశారు.
11 మందిపై కేసులు నమోదు...
జంట హత్యల కేసులో ప్రాథమికంగా 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు చింటూ, వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగ, యోగ, పరంధామ, హరిదాస్, మొగిలి, శశిధర్‌లు ఉన్నారు. నిందితులపై భారతీయ శిక్ష్మాసృతి 302, 307, 120 (బీ), 301 (ఆర్‌డబ్ల్యూ), 511 ఆర్‌డబ్ల్యూ 34, సెక్షన్ 25 (1) (బీ, 27 మారణాయుధాల నిరోధక చట్టం -1959) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దుండగుల ఉపయోగించిన కత్తులు, తుపాకీలు, వాహనాలను, బురఖాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేయర్ దంపతుల హత్యకేసులో ముగ్గురు అరెస్టు
Published Tue, Nov 24 2015 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement