► నిందితుల వేట పూర్తి
► 23 మందిపై సిద్ధమవుతున్న చార్జిషీట్
► వందమందికి పైగా సాక్ష్యులు..?
► ఈ వారంలోనే కోర్టుకు అభియోగ పత్రం
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ల హత్య కేసులో నిందితుల అరెస్టుల పర్వం ముగిసింది. ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న నిందితుడు ఆర్‌వీటీ.బాబును అరెస్టు చూపడం ద్వారా ఇప్పటి వరకు కేసు నమోదైన 23 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హత్య జరిగిన తీరు, ప్రత్యక్ష సా క్ష్యుల వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు తాజాగా హైదరాబాదు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్టులు కూడా తెప్పించున్నారు. దీంతో కేసు దర్యాప్తు పూర్తయినట్లే. నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంపై సిద్ధమవుతున్న పోలీసులు ఈ వారంలోనే దాన్ని న్యాయస్థానానికి అందజేయనున్నారు.
అందరూ దొరికినట్లే...
గతేడాది నవంబరు 23న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అనురాధ, మోహన్‌ల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జంట హత్యల్లో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖరేనని పోలీసు నిర్ధారణకు వచ్చారు. తొలుత అయిదు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 23కు చేరుకుంది. గత వారం వరకు పరారీలో ఉన్న బుల్లెట్ సురేష్, ఆర్‌వీటీ.బాబులను అరెస్టు చూపించడంతో నిందితులంతా దొరికినట్లే అయ్యింది.
ఫలితంగా ఇప్పటికే చార్జ్‌షీట్ తయారు చేస్తున్న పోలీసు అధికారులకు తాజా అరెస్టులు కాస్త ఉపసమనాన్ని ఇచ్చినట్టే. అయితే జంట హత్యల కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వాళ్లు, లొంగిపోయిన వాళ్లల్లో టీడీపీకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాహళహస్తీశ్వర ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు కాసరం రమేష్, బుల్లెట్ సురేష్, మురుగ, ఆర్‌వీటీ.బాబు తదితరులంతా టీడీపీలో ఉంటూ ప్రధాన నిందితుడు చింటూకు సాయం చేసినట్లు, హత్య కుట్రలో పాలు పంచుకున్నట్లు పోలీసులు నేరాభియోగ పత్రాన్ని రూపొందిస్తున్నారు.
వంద మందికి పైగా సాక్ష్యులు...
ఈ జంట హత్యల కేసులో చిత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 130 మందిని పోలీసులు విచారించారు. అయితే తుదకు కేసు మాత్రం 23 మందిపై నమోదు చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులతో పాటు చింటూకు, మోహన్ దంపతులకు మధ్య ఉన్న వైరం, ఇతర ఆర్థిక లావాదేవీల తగాదాలు తెలిసిన దాదాపు వంద మందికి పైగా వ్యక్తుల్ని జంట హత్యల కేసులో సాక్ష్యులుగా చేర్చినట్లు తెలుస్తోంది. మేయర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో కేసు త్వరగా విచారించడానికి ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బాధ్యతలు అప్పగించి, ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి.