Mayor kathari Anuradha
-
దీపావళికి ముందే కఠారి హత్యకు ప్లాన్
కార్పొరేషన్ కార్యాలయంలోనే టార్గెట్ రెండు సంఘటనలతో వెనుదిరిగిన వైనం మూడోసారి ఫలించిన దుండగుల పన్నాగం చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను దీపావళికి ముందే హత్య చేయడానికి దుండగులు వ్యూహరచన చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కఠారి దంపతుల హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు దుండగులను విచారించిన అధికారులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొదటి సారి... జూలై 9న దుండగులు మేయర్ దంపతులను చంపడానికి కార్పొరేషన్ కార్యాయలంలోకి వచ్చారు. అదే రోజు కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కోదండన్ను మేయర్ అనుచరుడు కొట్టడంతో గొడవ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మీడియా అక్కడికి చేరుకుంది. దీంతో హత్యా ప్రణాళికను దుండగులు వాయిదా వేసుకున్నారు. రెండో సారి.. గత నెల 28న మేయర్ దంపతుల్ని హతమార్చి దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం నింపాలని దుండగులు మరో స్కెచ్ వేశారు. 28న ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్పొరేషన్ ఉద్యోగి మురళి అనే వ్యక్తి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వకుండా కమిషనర్ వేధిస్తున్నారంటూ మృతుడి భార్య ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడంతో చేసేదేమీ లేక దుండగులు వెనుదిరిగారు. మూడోసారి పని పూర్తి చేశారు చివరగా ఈ నెల 17న వేసుకున్న మూడో ప్లాన్‌కు ఎలాంటి అడ్డంకులు రాకపోవడంతో దుండగుల పన్నాగం పన్నింది. మేయర్ చాంబర్లోకి దుండగులు వెళ్లగానే ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బురఖా ధరించిన చింటూ ముఖానికి ఉన్న ముసుగును తొలగించడంతో అక్కడ ఉన్న అందరూ భయభ్రాంతులకు గురై పారిపోయారు. దుండగులు వచ్చిన పనిని సులువుగా ముగించారు. -
మేయర్ భర్త, బంధువు మధ్య ప్రహరీ వివాదం
చిత్తూరులో ఉద్రిక్తత.. స్వల్ప లాఠీచార్జి చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్, ఆయన మేనల్లుడు చింటూకు మధ్య బుధవారం తగాదా నెలకొంది. నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉన్న చింటూకు సంబంధించిన స్థలంలో ప్రహరి కూల్చేయడంతో ఈ వివాదం నెలకొంది. తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుంటే కఠారి మోహన్ కూల్చేశాడని చింటూ, అందరికీ సంబంధించిన దారిలో ప్రహరీ నిర్మిస్తున్నారని మేయర్ కుమారుడు ప్రవీణ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు ప్రహరీని కూల్చేయడంతో ఆగ్రహించిన చింటూ వర్గీయులు మేయర్ పేరుతో వెలసిన బ్యానర్లను చించేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వల్ప లాఠీచార్జ్ చేశారు. చింటూను స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అధికార బలంతో తన కొడుకుపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కఠారి మోహన్ అక్క, చింటూ తల్లి సక్కూబాయమ్మ మేయర్ వర్గంపై మండిపడ్డారు. ఇరువర్గాలు టీడీపీకి చెందిన వాళ్లే కావడం, రక్త సంబంధీకులు కావడంతో నగరంలో ఈ విషయం చర్చనీయంశంగా మారింది.