దీపావళికి ముందే కఠారి హత్యకు ప్లాన్
కార్పొరేషన్ కార్యాలయంలోనే టార్గెట్
రెండు సంఘటనలతో వెనుదిరిగిన వైనం
మూడోసారి ఫలించిన దుండగుల పన్నాగం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను దీపావళికి ముందే హత్య చేయడానికి దుండగులు వ్యూహరచన చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కఠారి దంపతుల హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు దుండగులను విచారించిన అధికారులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
మొదటి సారి... జూలై 9న దుండగులు మేయర్ దంపతులను చంపడానికి కార్పొరేషన్ కార్యాయలంలోకి వచ్చారు. అదే రోజు కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కోదండన్‌ను మేయర్ అనుచరుడు కొట్టడంతో గొడవ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మీడియా అక్కడికి చేరుకుంది. దీంతో హత్యా ప్రణాళికను దుండగులు వాయిదా వేసుకున్నారు.
రెండో సారి.. గత నెల 28న మేయర్ దంపతుల్ని హతమార్చి దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం నింపాలని దుండగులు మరో స్కెచ్ వేశారు. 28న ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్పొరేషన్ ఉద్యోగి మురళి అనే వ్యక్తి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వకుండా కమిషనర్ వేధిస్తున్నారంటూ మృతుడి భార్య ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడంతో చేసేదేమీ లేక దుండగులు వెనుదిరిగారు.
మూడోసారి పని పూర్తి చేశారు
చివరగా ఈ నెల 17న వేసుకున్న మూడో ప్లాన్‌కు ఎలాంటి అడ్డంకులు రాకపోవడంతో దుండగుల పన్నాగం పన్నింది. మేయర్ చాంబర్‌లోకి దుండగులు వెళ్లగానే ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బురఖా ధరించిన చింటూ ముఖానికి ఉన్న ముసుగును తొలగించడంతో అక్కడ ఉన్న అందరూ భయభ్రాంతులకు గురై పారిపోయారు. దుండగులు వచ్చిన పనిని సులువుగా ముగించారు.