Kathari Mohan
-
చింటూ శ్రీలంక వెళ్లాడా..?
మేయర్ దంపతుల హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆచూకి తెలుసుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఈనెల 17న మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణ హ్యతకు గురైన రోజు నుంచి అజ్ఞాతంలో ఉన్న చింటూ.. దేశ సరిహద్దులు దాటి పోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టీ.. చింటూ శ్రీలంకకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై. నెల్లూరు, పాండిచ్చేరి మార్గాల్లో ఏదో ఒక చోటి నుంచి చింటూ సరిహద్దులు దాటి ఉంటాడని భావిస్తున్నారు. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన చింటూ.. కొంత కాలం ఓడల్లో పనిచేశాడు. అతడికి ప్రపంచ వ్యప్తంగా 20 దేశాల్లో పట్టు ఉంది. ఓడల్లో పనిచేసే చాలా మందితో మంచి సంబంధాలు ఉన్నాయి. చింటూ పాస్ పోర్టు పోలీసులు సీజ్ చేసిన నేపధ్యంలో తనకున్న పరిచయాలతో దేశం దాటి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు చింటూ ఎక్కడ ఉన్న పట్టుకుని తీరతామని పోలీసులు స్పష్టం చేశారు. దారుణ హత్యా కాండకు పాల్పడ్డ వ్యక్తిని ఎట్టిపరిస్ధితుల్లో వదిలేది లేదంటున్నారు. చింటూ ఆచూకీ పట్టుకోవడం కోసం ఒక పోలీసుల బృందం శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. -
దీపావళికి ముందే కఠారి హత్యకు ప్లాన్
కార్పొరేషన్ కార్యాలయంలోనే టార్గెట్ రెండు సంఘటనలతో వెనుదిరిగిన వైనం మూడోసారి ఫలించిన దుండగుల పన్నాగం చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను దీపావళికి ముందే హత్య చేయడానికి దుండగులు వ్యూహరచన చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కఠారి దంపతుల హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు దుండగులను విచారించిన అధికారులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మొదటి సారి... జూలై 9న దుండగులు మేయర్ దంపతులను చంపడానికి కార్పొరేషన్ కార్యాయలంలోకి వచ్చారు. అదే రోజు కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న కోదండన్ను మేయర్ అనుచరుడు కొట్టడంతో గొడవ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మీడియా అక్కడికి చేరుకుంది. దీంతో హత్యా ప్రణాళికను దుండగులు వాయిదా వేసుకున్నారు. రెండో సారి.. గత నెల 28న మేయర్ దంపతుల్ని హతమార్చి దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం నింపాలని దుండగులు మరో స్కెచ్ వేశారు. 28న ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్పొరేషన్ ఉద్యోగి మురళి అనే వ్యక్తి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వకుండా కమిషనర్ వేధిస్తున్నారంటూ మృతుడి భార్య ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకోవడంతో చేసేదేమీ లేక దుండగులు వెనుదిరిగారు. మూడోసారి పని పూర్తి చేశారు చివరగా ఈ నెల 17న వేసుకున్న మూడో ప్లాన్‌కు ఎలాంటి అడ్డంకులు రాకపోవడంతో దుండగుల పన్నాగం పన్నింది. మేయర్ చాంబర్లోకి దుండగులు వెళ్లగానే ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బురఖా ధరించిన చింటూ ముఖానికి ఉన్న ముసుగును తొలగించడంతో అక్కడ ఉన్న అందరూ భయభ్రాంతులకు గురై పారిపోయారు. దుండగులు వచ్చిన పనిని సులువుగా ముగించారు. -
కఠారి దంపతులను చంపింది చింటూనే
-
కఠారి దంపతులను చంపింది చింటూనే
మేయర్‌ను పిస్తోలుతో నుదుటిపై కాల్చాడు మోహన్‌ను కాల్చే ప్రయత్నంలో గురి తప్పిన పిస్తోలు ఆపై కత్తులతో దాడికి దిగిన చింటూ అనుచరులు పోలీసుల ధ్రువీకరణ చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను హత్య చేసింది మోహన్ మేనల్లుడు చింటూనేనని పోలీసులు తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి పోలీసులు హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరులకు తెలిపారు. వారు అందించిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఆయన అనుచరులు జయప్రకాష్‌రెడ్డి, వెంకటాచలపతి, మంజు, వెంకటేష్‌లు మేయర్ దంపతులను హత్య చేసేందుకు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. వీరిలో చింటూ, వెంకటాచలపతి బురఖాలు ధరించి మేయర్ రూమ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. మేయర్ చాంబర్ ద్వారం వద్ద వీరిని కఠారి అనుచరులు ఆపారు. దీంతో ఒక్కసారిగా బురఖా తొలగించిన చింటూ పిస్తోలు చూపించి బెదిరించాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే చాంబర్లోకి దూరిన చింటూ ఒక్కసారిగా మేయర్ అనురాధ వద్దకు వెళ్లి నుదుటికి గురి పెట్టి పిస్తోలును పేల్చాడు. ఆమె నేలకొరిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇంతలో చింటూ అనుచరులు జయప్రకాష్‌రెడ్డి, మంజులు కఠారి మోహన్‌పై కత్తులతో దాడికి దిగారు. వారిని తప్పించుకునే ప్రయత్నంలో మోహన్ పరుగు పెట్టాడు. ఆ తరువాత చింటూ పిస్తోలుతో మోహన్‌ను కాల్చాడు. అది గురి తప్పి బుల్లెట్ ఎదురుగా ఉన్న తలుపుకు తగిలి పడిపోయింది. మరో మారు కాల్చే ప్రయత్నం చేయగా పిస్తోలు స్ప్రింగ్ లాక్ అయ్యింది. ఈ సమయంలో తప్పించుకునే ప్రయత్నంలో మోహన్ రూమ్‌లోని కార్పెట్ జారి కిందపడ్డాడు. వెంటనే జయప్రకాషరెడ్డి, మంజులు మోహన్‌ను కత్తులతో విచక్షణారహితంగా నరికారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలోనే మోహన్ అనుచరులు సతీష్, మరొక కార్పొరేటర్ సోదరుడు సురేష్ గాయపడ్డారు. అప్పటికే కఠారి దంపతులు చనిపోయారని భావించిన చింటూ అనుచరులతో అక్కడే బాత్రూమ్లోకి వెళ్లి కత్తిపడేసి చేతులు కడుక్కొని బయటకు వచ్చారు. ఇంతలో అక్కడున్న మోహన్ అనుచరులు కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో చింటూ, ఆయన అనుచరులు కార్పొరేషన్ వెనుక వైపునకు దూకి వాహనాల్లో పరారయ్యారు. గేట్లు దూకి పరారయ్యే ప్రయత్నంలో వెంట తెచ్చుకున్న బురఖాలు, పిస్తోలు, ఎయిర్ పిస్టల్ కింద పడిపోయాయి. తొలుత చింటూతో సహా ఐదుగురు పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజును పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని, తాను ఇంటికి వెళ్లి స్టేషన్‌కే వస్తానని చింటూ నమ్మ బలికాడు. ఆ తరువాత వెంకటాచలపతి, మంజు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, జయప్రకాష్‌రెడ్డి పట్టుబడ్డాడు. తరువాత చింటూ, డ్రైవర్ వెంకటేష్ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. ప్రథమ నిందితుడు చింటూనే కఠారి దంపతులను చంపింది చింటూనేనని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక బంగ్లాలో ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ హత్యలో చింటూనే ప్రథమ నిందితుడన్నారు. ఆయనతోపాటు జయప్రకాష్‌రెడ్డి, మంజు, వెంకటాచలపతి, వెంకటేష్ పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. మేయర్ అనురాధను చింటూ స్వయంగా పిస్తోలుతో కాల్చాడన్నారు. మోహన్‌పై చింటూ అనుచరులు కత్తులతో దాడి చేశారన్నారు. అనంతరం అక్కడి నుంచి వెంట తెచ్చుకున్న బ్లాక్ సిఫ్ట్ కారులో పరారయ్యారన్నారు. కారు చిత్తూరుకు చెందిన ఓ లాయర్ సోదరుడు యోగాదని పేర్కొన్నారు. అతన్ని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చింటూ దొరకలేదని, తమ అదుపులో ఉన్నారన్న మాట నిజంకాదని ఎస్పీ చెప్పారు. శుక్రవారం కొన్ని కీలక ఆధారాలు దొరికాయన్నారు. -శ్రీనివాస్, చిత్తూరు ఎస్పీ -
చిత్తూరు బంద్ ప్రశాంతం
చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు నడవటం లేదు. దుకాణాలు, సినిమా హాళ్లు, విద్యా, వాణిజ్య సంస్థలు మూత బడ్డాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మేయర్ కఠారి అనూరాధ, మోహన్ దంపతుల భౌతికకాయాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 2.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు చేరుకుంటారు. అనంతరం మేయర్ దంపతుల అంత్యక్రియలు జరుగనున్నాయి. -
మేయర్ పోస్టుమార్టం పూర్తి
-
మేయర్ దంపతుల పోస్టుమార్టం పూర్తి
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణహత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వేలూరు ప్రభుత్వాసుపత్రిలో మేయర్ భర్త కఠారి మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. బుధవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వీరి మృతదేహాలకు కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. చిత్తూరు మేయర్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన పలువురు నేతలు అనురాధ మృతదేహానికి నివాళులర్పించారు. కాసేపట్లో చిత్తూరుకు కఠారి మోహన్ మృతదేహాన్ని తరలించనున్నారు. -
మేయర్ దంపతుల దారుణ హత్య
-
మేయర్ హత్య జరిగిన తీరు ఇలా..
-
మేయర్ హత్య జరిగిన తీరు ఇలా..
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్‌లపై దాడికి దుండగులు పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. కార్పొరేషన్లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా ఆమెకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనే పేరుతో నలుగురు వ్యక్తులు మేయర్ ఛాంబర్లోకి వచ్చారు. నలుగురూ బురఖాలు ధరించి వచ్చారు. ఒక్కసారిగా లోపలకు వస్తూనే మేయర్‌పై కాల్పులు జరిపారు, మోహన్‌పై కత్తులతో దాడి చేశారు. దాంతో మేయర్ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడితో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉండేవాళ్లు భయపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు తప్ప వచ్చిన వాళ్లెవరూ చూసే సాహసం కూడా చేయలేకపోయారు. దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకుని చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. మేయర్ ఏ సమయానికి కార్పొరేషన్‌కు వస్తారో అన్నీ ముందుగానే చూసుకుని వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి నలుగురు వ్యక్తులు గ్రూపుగా వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు దుండగుల లొంగుబాటు మేయర్ అనురాధ హత్యకేసులో ఇద్దరు దుండగులు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తర్వాత.. తామే కాల్పులు జరిపామంటూ ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. కానీ వాళ్ల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్, క్రైమ్ బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ ఆధారాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. -
పోలీసుల్ని బెదిరించిన కేసులో
చింటూ అరెస్టు నిరసనగా రోడ్డుపై టీడీపీ నేతల బైఠాయింపు చిత్తూరు (అర్బన్): చిత్తూరు టీడీపీ నాయకుడు కఠారి మోహన్ బావమరిది చింటూ అనే చంద్రశేఖర్‌ను స్థానిక వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను బెదిరించారంటూ నాటకీయ పరిణామాల మధ్య చింటూను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. చింటూ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై 2007లో జరిగిన రెండు హత్యాయత్నాల కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్నాడు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు కథనం మేరకు.. సీకే బాబుపై జరిగిన కాల్పుల ఘటన కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న చింటూ న్యాయస్థానం ఆవరణలోకి వస్తుండగా అతని ముందు వెళుతున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణ జరుగుతున్న వ్యక్తుల వాహనాలు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీకాంత్‌కు, చింటూకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదే రోజు రాత్రి ఎస్ఐ లక్ష్మీకాంత్ వన్‌టౌన్ పోలీసులకు చింటూపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడని, అంతు చూస్తామని బెదిరించాడని పేర్కొన్నారు. వన్‌టౌన్ ఏఎస్ఐ గుణశేఖర్ చింటూపై ఐపీసీ 353, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. శుక్రవారం న్యాయస్థానం ఎదుట హాజరై వస్తున్న చింటూను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్‌కు తరలించారు.ఎలాంటి తప్పు చేయకుండా చింటూను ఎలా అరెస్టు చేస్తారంటూ చిత్తూరు టీడీపీ నాయకులు చిత్తూరు నగరంలో నిరసనలు వ్యక్తం చేశారు. మేయర్ కఠారి అనురాధ, దేశం నాయకులు కఠారి మోహన్, పలువురు కార్పొరేటర్లు గాంధీ విగ్రహం ఎదుట, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం చింటూకు చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు.