మేయర్ హత్య జరిగిన తీరు ఇలా..
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్‌లపై దాడికి దుండగులు పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. కార్పొరేషన్‌లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా ఆమెకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనే పేరుతో నలుగురు వ్యక్తులు మేయర్ ఛాంబర్‌లోకి వచ్చారు. నలుగురూ బురఖాలు ధరించి వచ్చారు. ఒక్కసారిగా లోపలకు వస్తూనే మేయర్‌పై కాల్పులు జరిపారు, మోహన్‌పై కత్తులతో దాడి చేశారు. దాంతో మేయర్ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడితో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉండేవాళ్లు భయపడి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు తప్ప వచ్చిన వాళ్లెవరూ చూసే సాహసం కూడా చేయలేకపోయారు. దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకుని చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. మేయర్ ఏ సమయానికి కార్పొరేషన్‌కు వస్తారో అన్నీ ముందుగానే చూసుకుని వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి నలుగురు వ్యక్తులు గ్రూపుగా వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరు దుండగుల లొంగుబాటు
మేయర్ అనురాధ హత్యకేసులో ఇద్దరు దుండగులు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన తర్వాత.. తామే కాల్పులు జరిపామంటూ ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. కానీ వాళ్ల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్, క్రైమ్ బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ ఆధారాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు.