కఠారి దంపతులను చంపింది చింటూనే
- మేయర్‌ను పిస్తోలుతో నుదుటిపై కాల్చాడు
- మోహన్‌ను కాల్చే ప్రయత్నంలో గురి తప్పిన పిస్తోలు
- ఆపై కత్తులతో దాడికి దిగిన చింటూ అనుచరులు
- పోలీసుల ధ్రువీకరణ
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను హత్య చేసింది మోహన్ మేనల్లుడు చింటూనేనని పోలీసులు తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి పోలీసులు హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరులకు తెలిపారు. వారు అందించిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఆయన అనుచరులు జయప్రకాష్‌రెడ్డి, వెంకటాచలపతి, మంజు, వెంకటేష్‌లు మేయర్ దంపతులను హత్య చేసేందుకు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. వీరిలో చింటూ, వెంకటాచలపతి బురఖాలు ధరించి మేయర్ రూమ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
మేయర్ చాంబర్ ద్వారం వద్ద వీరిని కఠారి అనుచరులు ఆపారు. దీంతో ఒక్కసారిగా బురఖా తొలగించిన చింటూ పిస్తోలు చూపించి బెదిరించాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే చాంబర్‌లోకి దూరిన చింటూ ఒక్కసారిగా మేయర్ అనురాధ వద్దకు వెళ్లి నుదుటికి గురి పెట్టి పిస్తోలును పేల్చాడు. ఆమె నేలకొరిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇంతలో చింటూ అనుచరులు జయప్రకాష్‌రెడ్డి, మంజులు కఠారి మోహన్‌పై కత్తులతో దాడికి దిగారు. వారిని తప్పించుకునే ప్రయత్నంలో మోహన్ పరుగు పెట్టాడు. ఆ తరువాత చింటూ పిస్తోలుతో మోహన్‌ను కాల్చాడు.
అది గురి తప్పి బుల్లెట్ ఎదురుగా ఉన్న తలుపుకు తగిలి పడిపోయింది. మరో మారు కాల్చే ప్రయత్నం చేయగా పిస్తోలు స్ప్రింగ్ లాక్ అయ్యింది. ఈ సమయంలో తప్పించుకునే ప్రయత్నంలో మోహన్ రూమ్‌లోని కార్పెట్ జారి కిందపడ్డాడు. వెంటనే జయప్రకాషరెడ్డి, మంజులు మోహన్‌ను కత్తులతో విచక్షణారహితంగా నరికారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలోనే మోహన్ అనుచరులు సతీష్, మరొక కార్పొరేటర్ సోదరుడు సురేష్ గాయపడ్డారు. అప్పటికే కఠారి దంపతులు చనిపోయారని భావించిన చింటూ అనుచరులతో అక్కడే బాత్‌రూమ్‌లోకి వెళ్లి కత్తిపడేసి చేతులు కడుక్కొని బయటకు వచ్చారు. ఇంతలో అక్కడున్న మోహన్ అనుచరులు కార్యాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో చింటూ, ఆయన అనుచరులు కార్పొరేషన్ వెనుక వైపునకు దూకి వాహనాల్లో పరారయ్యారు. గేట్లు దూకి పరారయ్యే ప్రయత్నంలో వెంట తెచ్చుకున్న బురఖాలు, పిస్తోలు, ఎయిర్ పిస్టల్ కింద పడిపోయాయి.
తొలుత చింటూతో సహా ఐదుగురు పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వెంకటాచలపతి, జయప్రకాష్‌రెడ్డి, మంజును పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని, తాను ఇంటికి వెళ్లి స్టేషన్‌కే వస్తానని చింటూ నమ్మ బలికాడు. ఆ తరువాత వెంకటాచలపతి, మంజు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, జయప్రకాష్‌రెడ్డి పట్టుబడ్డాడు. తరువాత చింటూ, డ్రైవర్ వెంకటేష్ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.
ప్రథమ నిందితుడు చింటూనే
కఠారి దంపతులను చంపింది చింటూనేనని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక బంగ్లాలో ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ హత్యలో చింటూనే ప్రథమ నిందితుడన్నారు. ఆయనతోపాటు జయప్రకాష్‌రెడ్డి, మంజు, వెంకటాచలపతి, వెంకటేష్ పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. మేయర్ అనురాధను చింటూ స్వయంగా పిస్తోలుతో కాల్చాడన్నారు. మోహన్‌పై చింటూ అనుచరులు కత్తులతో దాడి చేశారన్నారు. అనంతరం అక్కడి నుంచి వెంట తెచ్చుకున్న బ్లాక్ సిఫ్ట్ కారులో పరారయ్యారన్నారు. కారు చిత్తూరుకు చెందిన ఓ లాయర్ సోదరుడు యోగాదని పేర్కొన్నారు. అతన్ని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చింటూ దొరకలేదని, తమ అదుపులో ఉన్నారన్న మాట నిజంకాదని ఎస్పీ చెప్పారు. శుక్రవారం కొన్ని కీలక ఆధారాలు దొరికాయన్నారు.
-శ్రీనివాస్, చిత్తూరు ఎస్పీ