పొగతాగే 146 ఏళ్ల ఎంబా కన్నుమూత
ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన శతాధిక వృద్ధుడిగా భావిస్తున్న ఇండోనేసియాలోని జావా నగరానికి చెందిన సమర్పాన్ సోడిమెజో అలియాస్ ఎంబా ఘోటో సోమవారం మరణించారు. ఆయన వయస్సు 146 ఏళ్లు. ఆయన నలుగురు భార్యలు, పది మంది పిల్లలు ఎప్పుడో మరణించారు. ఆయన వయస్సును నిపుణులు అధికారికంగా ధ్రువీకరించకపోయినా గుర్తింపు కార్డుపై ఆయన పుట్టిన తేదీ డిసెంబర్ 30, 1870 అని రాసి ఉంది. స్థానికులు కూడా ఆయనకు అంత వయస్సు ఉంటుందనే చెబుతున్నారు.
ఎంబా ఘోటో పుట్టిన తేదీ నిజమే అయితే ఆయన గురించి ఎన్నో విశేషాలు చెప్పవచ్చు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలు చూడడమే కాకుండా డచ్ ఈస్ట్ ఇండీస్‌పై జపాన్ దురాక్రమణను కూడా చూసే ఉంటారు. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకొచ్చిన వ్లాదిమీర్ ఇల్లిచ్ లెనిన్ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. సూయజ్ కెనాల్ ప్రారంభమైన ఏడాదికే ఆయన పుట్టారన్నమాట. అంతేకాదు ఘోటో చావుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఆయన మరణించారు. ఇంత ఎక్కువ కాలం ఆయన బతకడానికి కారణం ఏమిటని గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని మీడియా ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చైన్ స్మోకింగ్ వల్ల ఎక్కువ కాలం బతికినట్లు ఆయన చెప్పారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు ఆయన నలుగురు మనవళ్లు హాజరయ్యారు. వారి కథనం ప్రకారం ఘోటో ముప్పూటలా అంబలి తాగుతారు.
ఇప్పటి వరకు అధికారిక రికార్డుల ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వయస్సు వరకు బతికినది ఫ్రెంచ్ మహిళ జియన్నే కాల్మెట్. ఆమె 122వ ఏట మరణించారు. ఇప్పటి వరకు అధికారకంగా ఆమె వయస్సును దాటి ఎవరూ బతికి లేరు. ప్రపంచంలో ఏ మనిషి కూడా 125 ఏళ్లకు మించి బతికే ప్రసక్తే లేదని న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే ఘోటో తరహాలోనే నైజీరియాకు చెందిన ఓలో ఫిన్తూయీ 171 ఏళ్లు, ఇథియోపియాకు చెందిన ధాకబో ఎబ్బా 163 ఏళ్లు బతికినట్లు చెబుతారు.