సెప్టెంబర్లో చెన్నై టూ సింగపూర్
తమిళసినిమా: చెన్నై టూ సింగపూర్ చిత్రం సెప్టెంబర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో విశేషం ఏమిటంటే సంగీతదర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రం కోసం సంగీత బాణీలను ప్రయాణంలో చెన్నై నుంచి సింగపూర్ వరకూ పయనిస్తూ కట్టారు. అదేవిధంగా ఈ చిత్రం నిర్మాణంలో ఒక భాగం అయ్యారు కూడా. కాగా కంబ్యాక్ పతాకంపై కే.అనంతన్ నిర్మించిన ఈ చిత్రానికి షబ్బీర్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
అబ్బాస్ అక్బర్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఇందులో గోకుల్ఆనంద్, అంజుకురియన్, రాజేశ్బాలచంద్రన్, శివకేవ్, కవితైకుందర్ ఎంసీ.జెస్సీ, సుమిత్ర ముఖ్య పాత్రలను పోషించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చెన్నై టూ సింగపూర్ చిత్ర వివరాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అబ్బాస్ అక్బర్ తెలుపుతూ చిత్రాన్ని 30 శాతం సింగపూర్లో చిత్రీకరించామని, మొత్తం చిత్రాన్ని 65 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు.
అయితే ముందుగానే అన్ని శాఖల్లోనూ రిహార్సల్ చేసుకుని షూటింగ్కు వెళ్లామని చెప్పారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఆధ్యంతం నవ్వుకుని ఆ తరువాత తమ సమస్యలన్నీ మరచిపోతారని అన్నారు. సంగీతదర్శకుడు జిబ్రాన్ మాట్లాడుతూ చిత్రం సంతృప్తిగా వచ్చినా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయం ఉండేదన్నారు. అయితే రెండు రోజుల కిందట కొందరు విద్యార్థులకు సినీ ప్రముఖులకు చూపించామని, వారి స్పందన చూసి చిత్ర విజయంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.