ఎన్టీఆర్ జలసిరికి నిబంధనల కొర్రీ
దరఖాస్తునకు రోజుకో
నిబంధన అమలు
జాబ్‌కార్డు, సన్నకారు సర్టిఫికెట్ల కోసం నిరీక్షణ
ఉపాధి, మీసేవ కార్యాలయాల వద్ద పడిగాపులు
ఈ నెల 25తో ముగియనున్న దరఖాస్తు గడువు
తెరుచుకోని జలసిరి ఆన్లైన్ ఆందోళనలో రైతులు
రాపూరు/సైదాపురం: బంజరు భూములకు సాగునీటిని అందించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత ఎన్టీఆర్ జలసిరి పథకం లక్ష్యం నెరవేరేలా లేదు. జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రోజుకో నిబంధన అమలు చేస్తుండడంతో రైతులు తలలుపట్టుకుంటున్నారు. దర ఖాస్తునకు సన్న,చిన్నకారు రైతుగా గుర్తింపు సర్టిఫికెట్, ఉపాధి జాబ్‌కార్డు తప్పనిసరి చేయడంతో వాటి కోసం రైతులు ఉపాధి, మీసేవ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అన్ని సర్టిఫికెట్లు తీసుకున్నా దరఖాస్తు చేసుకునేందుకు జలసిరి సైట్ తెరుచుకోకపోతుండంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
పథకం లక్ష్యం ఇదీ..
ఎస్సీ,ఎస్టీలతో పాటు సన్న, చిన్నకారు రైతులకు చెందిన బంజరు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వం బోర్లతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకు సంబంధించి యూనిట్‌కు రూ.1.27,000 కేటాయించింది. 300 మీటర్ల లోతు వరకు బోర్ వేసుకునేందుకు అడుగుకు రూ.80 వంతున రూ.24వేలు, కేసింగ్‌పైపు 20 మీటర్లు అడుగుకు రూ.400 వంతున రూ.8వేలు, పిట్టింగ్కు రూ.5వేలు, మోటారుకు రూ.40వేలు, విద్యుత్ కనెక్షన్‌కు రూ.50 వేలు వంతున విడుదల చేసింది. ఈ పథకం కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు తమ వాటాగా 5శాతం అంటే రూ.4,500, ఇతర రైతులు 20 శాతం అంటే రూ.18వేలు చెల్లించాల్సి ఉంటుంది. 5 ఎకరాలలోపు భూములున్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు మాత్రమే పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు పాసుపుస్తకం, 1బీ, ఆదార్‌కార్డు, జాబ్‌కార్డు, సన్న, చిన్నకారు సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపర్చాలి.
అన్నదాతలకు దరఖాస్తు కష్టాలు
ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సన్న, చిన్నకారు రైతు సర్టిఫికెట్ కోసం రైతులు మీసేవలో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం పాసుపుస్తకం జెరాక్స్, 1బీ, రేషన్‌కార్డు, ఆదార్‌కార్డు, దరఖాస్తు ఫారంతో పాటు 45 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. అక్కడి నుంచి సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు వెళ్తుంది. వీఆర్వో చేతులు తడిపితే తప్ప తహశీల్దార్ నుంచి సన్న,చిన్నకారు సర్టిఫికెట్ అందడం లేదని రైతులు తెలిపారు. లేకపోతే పనులు మానుకుని రెండు, మూడు రోజుల పాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందేనని చెబుతున్నారు. అలాగే ఉపాధి జాబ్ కార్డు కోసం ఉపాధి కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెరుచుకోని జలసిరి సైట్
ప్రభుత్వం తొలుత ఎన్టీఆర్ జలసిరి దరఖాస్తుల సేకరణ బాధ్యతలను ఎంపీడీఓ, ఏపీఓలకు అప్పగించింది. ఈ మేరకు రైతులు ఎంపీడీఓ, ఏపీఓలకు దరఖాస్తులు అందజేశారు. అనంతరం ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రైతులను పిలిచి ఆ విధంగా చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10తోనే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మళ్లీ 25వతేదీ వరకు గడువు పెంచారు. మీసేవలో దరఖాస్తు చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాకపోతుండడంతో రైతులు మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
మీసేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం
ఎన్టీఆర్ జలసిరి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రం చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. జలసిరి సైట్ ఓపెన్ కావడం లేదని మీసేవ సిబ్బంది చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలే తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి సైట్ ఓపెన్ అయ్యేలా చూడాలి. -గోపిదేశి రామయ్య (తురిమెర్ల, సైదాపురం మండలం)
సర్టిఫికెట్ల కోసం తిరగ డానికే సరిపోతోంది
ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు సన్న,చిన్నకారు సర్టిఫికెట్ కావాలన్నారు. మూడు రోజులుగా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. జాబ్‌కార్డు కోసం ఇంకెన్ని రోజులు తిరగాల్సి వస్తుందో. ప్రభుత్వం స్పందించి దరఖాస్తు గడువును పెంచాలి. -నాగా ప్రకాష్‌రెడ్డి(రాపూరు)