‘పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు’
హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని ‘సాక్షి’తో చెప్పారు.
ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో బుధవారం దుండగుడు ఆడమ్ పూరింటన్ కాల్పులు జరపడంతో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోయాడు. తమ దేశం విడిచి వెళ్లిపోవాలని శ్రీనివాస్, అలోక్ తో ఆడమ్ వాగ్వాదానికి దిగాడని అలోక్ తండ్రి తెలిపారు. బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆడమ్ ను బయటకు పంపించారని, కొంతసేపటి తర్వాత తిరిగొచ్చిన అతడు తుపాకీతో కాల్పులకు దిగినట్టు వెల్లడించారు.
తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడితో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరితోనూ వాదనలు దిగొద్దని అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఆయన సూచించారు.
సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి..
శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట
రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే
కాల్పులను ఖండించిన అమెరికా
అలోక్ కు పరామర్శ