Medical Employees Union
-
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆర్టీసీ జేఏసీ మరోసారి కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు చర్చించనున్నారు. సమ్మెపై కోర్టు ప్రస్తావించిన పలు అంశాలపై జేఏసీ సమాలోచనలు చేయనున్నట్టు పేర్కొంది. సమావేశంలో ఈ నెల 19న ప్రకటించిన బంద్ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై జేఏసీ నాయకులు చర్చ జరపనున్నారు. ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహరిస్తామంటూ ప్రకటించాయని జేఏసీ తెలిపింది. తాజాగా ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్ ఉద్యోగుల జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపుతున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి క్రిమినల్ కోర్టు నుంచి బస్‌భవన్ వరకు న్యాయవాదులు బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలతో కలిసి వస్తాయని ప్రకటించడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేలా రేపటి సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. -
వెనక్కు తగ్గం
కొనసాగిన రాజీనామాల పర్వం మొత్తం 4,500 మంది వైద్యుల రాజీనామా మంత్రి యూటీ ఖాదర్‌తో చర్చలు విఫలం నేడు సీఎంతో వైద్యుల సంఘం నేతల భేటీ రోగులకు తప్పని తిప్పలు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాల పరంపర రెండోరోజూ కొనసాగింది. దీంతో ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్‌తో రాష్ట్ర వైద్య ఉద్యోగుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో వైద్యుల సంఘం నేతల భేటీ బుధవారం సాయంత్రానికి వాయిదా పడింది. డిమాం డ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని మూడు వేల మంది వైద్యులు సోమవారం సామూహిక రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 1,500 మంది వైద్యులు మంగళవారం తమ ఉద్యోగాలకు రాజీనా మా చేశారు. దీంతో మొత్తం 4,500 మంది వైద్యులు రాజీనామా చేసినటై్లంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య ధ్రువీకరించారు. రాజీనామాల సంఖ్య విషయమై మంత్రి యూటీ ఖాదర్ కానీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశైలం కానీ నోరు విప్పడం లేదు. ఇదిలా ఉండగా డిమాండ్ల సాధనలో భాగంగా ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ఉదయం మంత్రి యూటీ ఖాదర్‌తో చర్చలు జరిపారు. ఇందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. డిమాండ్లలో కొన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో తాను ఏమీ చేయలేనని మంత్రి చేతులు ఎత్తేశారు. దీంతో వైద్యుల సంఘం నేతలు చేసేదేమీ లేక ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించడానికి సిద్ధపడ్డారు. ఆయన పని ఒత్తిడిలో ఉండడం వల్ల ముందుగా నిర్ణయించినట్లు మంగళవారం ఉదయం 11:30 గంటలకు కాకుండా చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజీనామా చేసిన వారు తిరిగి విధుల్లో ఉంటున్నారని సంఘం నేతలు చెబుతున్నా రాష్ట్రంలో అక్కడక్కడ రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యం అందక బాలిక మృతి ఇక వైద్యులు రాజీనామాలు చేస్తూ విధులకు సరిగా హాజరుకాకపోవడంతో ఓ చిన్నారి మరణించింది. రామనగర జిల్లా గుడేమారనహళ్లి ప్రాంతానికి చెందిన రమ్య(10) తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలో ఉన్న నర్సుల వద్ద మాత్రలు తీసుకొని వెనక్కి వచ్చేశారు. కాగా మంగళవారం ఉదయం జ్వర తీవ్రత పెరిగి రమ్య మృతిచెందింది. తాము పేదవాళ్లం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తమ కూతురిని తీసుకెళ్లలేక పోయామని, ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే తమ చిన్నారి ప్రాణాలతో ఉండేదని తల్లిదండ్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. రాజీనామాలు అంగీకరించలేదు : సీఎం వైద్యుల సామూహిక రాజీనామాలను ఇప్పటి వరకూ అంగీకరించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యులు కూడా పట్టువిడుపులు ప్రదర్శించాలి. వెంటనే ఆసుపత్రులు వెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
టామాకేర్ .. క్యార్ క్యార్
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ఏడాదికాలంగా జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ట్రామాకేర్ ఉద్యోగులు 15 రోజులుగా రోడ్డెక్కారు. అయినా పాలకులు పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసు జారీ చేశారు. అయినా స్పందన లభించక పోవడంతో గత 15 రోజుల క్రితం విధులను బహిష్కరించి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దే టెంటు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. అత్యవసర సేవలకు విఘాతం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఎక్కువ మందికి సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడతారు. సకాలంలో వైద్యం అందిస్తే ఎంతో మంది జీవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి స్వయంగా వైద్యుడైన మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గమనించి రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందించాలనే ధ్యేయంతో జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులలో ట్రామాకేర్ ఏర్పాటుకు 2009లో ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాలమేరకు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో 2010లో ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో మొత్తం 33 మంది సిబ్బందిని నియమించారు. ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో దివంగత నే త అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల నుంచి వేతనాలను మంజూరు చేయించారు. వైఎస్ మరణించినా ఈ నిధులు ఉన్నంత వరకు సిబ్బందికి వేతనాలు సక్రమంగానే అందాయి. 2013 జూలై నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అయిపోవడంతో సిబ్బంది వేతనాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ నెల వరకు జీతాలు విడుదల కాకపోవడంతో ఈ చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి ఆడిట్ జరగని కారణంగానే వేతనాలు నిలిచిపోయాయని వైద్య, విధాన పరిషత్ అధికారులు చెబుతున్నారు. కాని ఆడిట్‌ను జరిపించే పక్రియను మాత్రం చేపట్టడం లేదు. నెరవేరని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హామీలు ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగులు సమ్మె ప్రారంభించినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే ఆడిట్ జరిపించి వేతనాలు ఇప్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు తప్ప పట్టించుకున్న వారు లేరు. 10 రోజుల క్రితం ఆసుపత్రి సూపరింటెండెండ్ కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించడంతో ఈ సమస్య పరిష్కానికి ఉన్నతాధికారులతో మాట్లాడతానని సూపరింటెండెండ్ ఈశ్వర ప్రసాద్ హామీ ఇచ్చారు. గత సోమవారం సమ్మె శిబిరం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కాటమనేని భాస్కర్‌కు వినతి పత్రం అందించారు.ఆయన సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో కె.శంకరరావును ఆదేశించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే, చివరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. హామీలు ఇచ్చారు తప్ప తమకు న్యాయం చేయలేదని ట్రామాకేర్ ఉద్యోగులు ఎం.కిషోర్, రమేష్, రాజేష్, సునీత, కవిత, విజయకుమారి, అనురాధ, దయామణి, స్వప్న, సుధారాణి, శాంతకుమారి, ఉష విజ్ఞప్తి చేస్తున్నారు.