విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది.
ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక..
సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్‌లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది.
ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment