వరకట్న వేధింపులకు వైద్యురాలు బలి
- అత్తింటివారే హత్య చేశారంటూ తల్లిదండ్రుల ఆరోపణ
- పోలీసుల అదుపులో భర్త, అత్త
హైదరాబాద్: అత్తింటివారి వరకట్న వేధిం పులు భరించలేక ఓ వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగయ్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వరంగల్ జిల్లా శివనగర్‌కు చెం దిన గజ్జెల లింగమూర్తి, కళావతిల రెండో కుమార్తె భవానికి హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల సత్యరాజు, శ్రీవాణి కుమారుడు పృధ్వీరాజుతో 2014, ఫిబ్రవరి 21న వివాహం జరిగింది. వీరు మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఎంబీ బీఎస్ పూర్తి చేయడంతో ఉప్పల్‌లోని ఆదిత్య హాస్పిటల్లో వైద్యులుగా పనిచేసేవారు. నాలు గు నెలల క్రితం వీరికి ఒక బాబు జన్మిం చాడు. దీంతో భవాని హాస్పిటల్ మానేసి ఇంట్లోనే వుండగా, పృధ్వీరాజు మాత్రం మరోచోట ఉ ద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల సత్యరాజు తమ కుమార్తెల వద్ద కుటుంబ అవసరాలు నిమిత్తంగా డబ్బులు తీసుకున్నారు. అవి చెల్లిం చడం కోసం తరుచుగా కోడలిని అదనపు కట్నం కోసం వేధించేవారు. భవాని పీజీ చదువుకోవడానికి భర్త, అత్తమామలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భవాని చెల్లెలు దేవి వివాహం జరిగింది. ఈ వివాహంలో సత్యరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ మర్యాదలు సరిగా జరుగలేదన్న కారణం పై భవాని, పృధ్వీరాజుల మధ్య చిన్న గొడవ జరిగింది.
మేడిపల్లికి వచ్చిన తరువాత మరలా గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన భవాని సోమవారం రాత్రి 9 గం.కు బెడ్రూం లోకి వెళ్లింది. ఎంత సేపటికి తలుపు తీయకపోవడంతో.. గడియ విరగకొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. అత్తింటివారు భవాని ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు.
అయితే తమ కూతురుది ఆత్మహత్యకాదని.. అత్తింటివారే హత్య చేశారంటూ భవాని తల్లిదండ్రులు.. సత్యరాజు, శ్రీవాణి, పృధ్వీరాజుతో పాటు అతని అక్క చెల్లెలు రేవతి, సుచరిత, బావలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పృధ్వీరాజు, శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన...
భవాని మృతికి కారణమైన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని.. భవాని తల్లిదండ్రులు, బంధువులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లింగమూర్తి, కళావతి మాట్లాడుతూ వివాహం సమయంలో రూ.5 లక్షల కట్నం, 10 తులాలు బంగారం, 50 తులాలు వెండి, రూ.2 లక్షలు పెళ్లి ఖర్చులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.