సీవీసీ, సీఐసీ బాస్‌ల ఎంపిక కోసం కసరత్తు
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) చీఫ్ పదవుల భర్తీపై ఇటీవలి లోక్ సభ సమావేశాల్లో దుమారం రేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సమావేశం కానుంది. సీఐసీ, సీవీసీ బాస్‌ల నియామకాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణజైట్లీ, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జన ఖర్గే హాజరు కానున్నారు.సెంట్రల్ ఇనఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్ల ఎంపిక కూడా ఈ సమావేశంలోనే జరగనుందని తెలిపాయి. సీవీసీ, సీఐసీలోని కొంతమంది అధికారుల పదవీ కాలం ముగియనుండటం, మరికొన్ని కమిషనర్ల పదవులు ఖాళీల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.
కాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) లోక్‌పాల్‌ను నాశనం చేయటానికి పథకం ప్రకారం కుట్రచేస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. పారదర్శక పాలన అని డబ్బాలు కొట్టుకునే మోదీ సర్కార్ అత్యంత కీలకమైన కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్, సీఐసీ, లోక్‌పాల్ పదవులను నెలల తరబడి ఖాళీగా ఉంచటంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అయితే కోర్టు వివాదాల కారణంగానే ఆయా పదవుల భర్తీలో ఆలస్యం జరుగుతోందని సోనియా విమర్శలను కేంద్రం తిప్పికొట్టింది. పారదర్శకతతో బహిరంగంగా సీఐసీ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించామని, సెర్చ్ కమిటీ రూపొందించిన తుది జాబితా పరిశీలన జరుగుతోందిని కేంద్ర సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుందని సమాచారం.