నేడు నగరానికి షర్మిల
అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును నిరసిస్తూ.. తొమ్మిది నెలలపాటు పద్నాలుగు జిల్లాల మీదుగా 3,112 కి.మీ. మేర సాగిన పాదయాత్రను ఆదివారం సాయంత్రం ఇచ్ఛాపురంలో ముగించిన జగనన్న సోదరి వైఎస్ షర్మిల.. సోమవారం ఉదయం నగరాని కి చేరుకోనున్నారు. ఆమె ఉదయం పది గంటల కు విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుని తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు.
స్వాగతం పలుకనున్న అభిమానులు
ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కి.మీ.ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌భాగ్, ఓవెసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, సీఈసీ సభ్యులు బి.జనార్దన్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు పుత్తా ప్రతాప్‌రెడ్డిలు తెలిపారు.
ఘనస్వాగతం పలుకుతాం: జనార్దన్ రెడ్డి
ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ముగించుకొని నగరానికి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకురాలు షర్మిల రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అత్తాపూర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో షర్మిలకు సాదర స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. వేలాదిమంది కార్యకర్తలతో అక్కడినుంచి శంషాబాద్, చంద్రాయణగుట్ట, కాంచన్‌బాగ్, ఓవైసీ ఆసుపత్రి మీదుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.