అమిత్ ‘షా’
♦ ఆగస్టులో బీజేపీ అధ్యక్షుడి రాక
♦ రాష్ట్రంలో ఐదు రోజుల పర్యటన
♦ పాత మిత్రుల గురి
♦ బలోపేతం లక్ష్యంగా వ్యూహాలు
రాష్ట్రంలో పాదం మోపడం లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు. ఐదురోజుల పర్యటనకు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు మూడో వారంలో ఈ పర్యటనకు తగ్గ కసరత్తుల్ని కమలనాథులు చేపట్టారు.
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళనాట బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలతో కలిసి ఆ ఎన్నికల్ని ఎదుర్కొన్న బీజేపీకి కొంత ఊరటే. వ్యక్తిగత బలాన్ని కల్గిన బీజేపీ నేత పొన్‌రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి, తమ సామాజికవర్గంతో నిండిన ధర్మపురి నుంచి పీఎంకే యువనేత అన్భుమణి గట్టెక్కారు. ఇక, డీఎంకే, కాంగ్రెస్‌ల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
అయితే, ఈ ఎన్నికల కూటమి కొన్నాళ్లుకు పటాపంచలు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతామన్న ధీమాను వ్యక్తంచేసిన నేతలు చివరకు తలా ఓదారి అన్నట్టు బయటకు వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పయనం సాగించక తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణంతో తమిళనాట పాగా వేయడానికి కమలనాథులు తీవ్ర వ్యూహరచనల్లో ఉన్నారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు సెల్వంను అస్త్రంగా చేసుకుని తొలుత పావులు కదిపినా, తదనంతరం పరిణామాలతో కమలనాథులు రూటు మార్చారు. అన్నాడీఎంకే వర్గాలను దారికి తెచ్చుకోవడంలో సఫలీకృతులయ్యారు.
ఇక, డీఎంకేను నిలువరించడం లక్ష్యంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొత్త వ్యూహాల్ని రచించి ఉన్నారు. అన్నాడీఎంకే తమను కాదని కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేని దృష్ట్యా, ఇక, గతంలో తమతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పయనం సాగించిన మిత్రుల్ని దారిలోకి తెచ్చుకుని, రాష్ట్రంలో మెగా కూటమితో ముందుకు సాగాలన్న నిర్ణయానికి అమిత్ షా వచ్చినట్టు సమాచారం. ఇందుకు తగ్గ వ్యూహాల్ని రచించి, వాటిని రాష్ట్రంలో ఆచరణలో పెట్టేందుకు అమిత్ షా సిద్ధం అవుతున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో ఐదు రోజుల పాటు పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు.
ఐదురోజుల రాష్ట్ర పర్యటన
ఇదివరకు రాష్ట్రం మీద అమిత్ షా దృష్టి పెట్టినా, వ్యూహాల అమల్లో మాత్రం జాప్యం తప్పలేదు. మే నెలలోనే ఆయన పర్యటన సాగాల్సి ఉన్నా, అన్నాడీఎంకే పరిణామాలతో కాస్త తగ్గారన్న సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే శ్రేణులు తమ గుప్పెట్లోకి వచ్చినట్టే అన్న ధీమాలో కమలం వర్గాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆగస్టులో ఐదు రోజుల పాటుగా అమిత్ షా పర్యటన సాగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాట బలోపేతం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు అమిత్ షా నిర్ణయించడం, ఆయన పర్యటన ఖరారుతో చకచకా ఏర్పాట్లమీద రాష్ట్ర పార్టీ దృష్టి పెట్టింది. ఆగస్టు మూడో వారంలో అధినేత పర్యటనకు తగ్గ కసరత్తులు జరుగుతున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, కారైక్కుడి కేంద్రంగా ఈ పర్యటనలు సాగబోతున్నాయి. చెన్నైలో రెండు రోజులు, కోయంబత్తూరులో ఓరోజు, కారైక్కుడిలో రెండు రోజులు చొప్పున సాగే ఈ పర్యటనలో రెండు మూడు బహిరంగ సభలకు వేదికను ఎంపిక చేస్తున్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర శ్రేణులతో కారైక్కుడి వేదికగా సమావేశానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఇక, పాత మిత్రుల్ని ఆహ్వానిస్తూ, కలిసివస్తే తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌ను అక్కున చేర్చుకుంటూ అమిత్ షా పర్యటన సాగే అవకాశాలు ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. ఇక, నీట్ వ్యవహారం మీద కూడా అమిత్ షా దృష్టి పెట్టడం గమనార్హం. నీట్ మినహాయింపు విషయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, ఎంపీ ఇలగణేషన్ వద్ద ఆయన వివరాలు సేకరించారు. నీట్ క్రెడిట్ తమ ఖాతాలో పడే రీతిలో యువత, నవతరం ఓటర్లను ఆకర్షించే సరికొత్త ప్రకటనను కేంద్రం ద్వారా చేయించేందుకు కమలం బాస్ నిర్ణయించినట్టు సమాచారం.