అరచెయ్యిలో వైకుంఠం
తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: ఇలా పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్న మహిళలు తెనాలిలోని ప్రతి వార్డులో తారసపడుతుంటారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా పింఛన్లు మంజూరు చేయించాం. సంక్షేమ పథకాలు అర్హులకు అందటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు తెలుసుకోవాలి. ఆ ఫలాలను కచ్చితంగా అనుభవించాలి. ఇటీవల కాలంలో అధికార పక్షం నేతలు, అధికారులు చేస్తున్న ప్రకటన తీరిది.
అర్హులమే నంటూ అధికారులు ధృవీకరించారు. ప్రజా ప్రతినిధులు ఆర్భాటంగా సభలు సమావేశాలు నిర్వహించి మంజూరు పత్రాలను అందించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఫించన్లు రావటల్లేదని ప్రజలు మొత్తుకుంటున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలంటూ మూడు విడతలుగా రచ్చబండ కార్యక్రమం ఆర్బాటంగా నిర్వహించారు. మొదటి విడతలో స్వీకరించిన దరఖాస్తులకు రెండో విడత రచ్చబండలో, రెండో విడత రచ్చబండలో స్వీకరించిన దరఖాస్తులకు మూడో విడత రచ్చబండలో మంజూరు పత్రాలను అందించారు.
ఇవి కాక మెగా గ్రీవెన్స్, జన సందర్శన పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ అర్జీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే వీటిలో అధికశాతం రేషను కార్డు, నివేశన స్థలం, వృద్ధాప్య, వితంతు పింఛన్లకు సంబంధించినవే. అర్హులుగా గుర్తించి మంజూరు పత్రాలు ఇచ్చినా, పింఛన్లు అందటంలేదని ప్రజలు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం మంజూరు పత్రం ఇచ్చిన తరువాత కచ్చితంగా లబ్ధి చేకూరుతుందని, మంజూరు పత్రం ఇచ్చిన తేదీ నుంచి వారికి ప్రతిఫలం అందుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు.