Mental Handicapped
-
కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది
పెద్దపల్లి: దివ్యాంగుడైన కుమారుడికి పద్నాలుగేళ్లు సపర్యలు చేసింది. వయసు, శరీరం పెరుగుతున్నా అతడి మానసిక స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఇటీవల కొంతకాలంగా విపరీత ప్రవర్తన మరింత పెరిగిపోవడంతో విసిగిపోయింది. కొడుకు బతికుండగానే బావిలోకి తోసి చంపేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రదీప్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని మొఘల్‌పురకు చెందిన శేఖర్, శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు యశ్వంత్ (14) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. శేఖర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగి. శ్యామల ఇంట్లోనే ఉంటూ యశ్వంత్ బాగోగులు చూసుకుంటోంది. యశ్వంత్ వయసు, శరీరం పెరుగుతున్నా మానసిక స్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. అతని ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో అనేక ఆస్పత్రులు తిరిగారు. ప్రస్తుతం నెలకు రూ.7 వేల విలువైన మందులు వాడుతున్నారు. మందులు వాడినప్పుడు మాత్రమే యశ్వంత్ బాగుంటున్నాడు. మందులు లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు వస్తోంది. శేఖర్‌కు తగిన స్థోమత లేకపోవడంతో డబ్బులు ఉన్నపుడే మందులు తెచ్చి వాడేవారు. మందులు వేయని సమయంలో యశ్వంత్‌కు మల, మూత్ర విసర్జన కూడా తెలియడం లేదు. పైగా విపరీత ప్రవర్తన పెరిగిపోవడంతో శ్యామల కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి.. యశ్వంత్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, విపరీత మానసిక ప్రవర్తనతో కాలనీవాసులు కూడా ఇబ్బందిపడుతున్నారని శ్యామల సోమవారం భర్తకు చెప్పింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పి శేఖర్ ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు. యశ్వంత్‌ను తీసుకుని బయల్దేరిన శ్యామల, పట్టణ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అందులోకి తోసేసింది. దీంతో నీటిలో మునిగిపోయిన యశ్వంత్ మృతి చెందాడు. సాయంత్రం ఒంటరిగా ఇంటికొచ్చిన శ్యామలను.. భర్త, కుటుంబసభ్యులు యశ్వంత్ గురించి ఆరా తీయగా బావిలోకి తోసి చంపేశానని తెలిపింది. దీంతో వారు బావి వద్దకు వెళ్లి చూసి అప్పటికే చీకటి పడడంతో మిన్నకుండిపోయారు. మంగళవారం ఉదయం యశ్వంత్ మృతదేహం బావిలో తేలడంతో శేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బావిలో తోసేశానని చెప్పింది స్థానికుల సహాయంతో పోలీసులు యశ్వంత్ మృతదేహాన్ని బయటకు తీయించారు. శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి తానే బావిలో తోసేశానని శ్యామల అంగీకరించిందని సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
అమ్మా..ఎందుకిలా
ఓ తల్లి మానసిక రోగంతో బాధపడుతోంది..కూలీనాలి చేసుకునే భర్త ఆమెను ఆస్పత్రులకు తిప్పుతున్నా నయం కాలేదు. ఆదివారం తిరుపతి రుయాకు తీసుకురావాలని భావించాడు. అంతలోనే ఆమె మానసిక కల్లోలానికి లోనైంది. జీవితాన్నే అంతం చేసుకుంది... ముక్కు పచ్చలారని ఇద్దరు పసిబిడ్డలను తీసుకుని వ్యవసాయ చెరువులో దూకింది.. ముగ్గురూ విగతజీవులై తేలారు.. ఈ హృదయ విదారక ఘటన చౌడేపల్లి మండలం చెడుగుట్లపల్లెలో శనివారం చోటుచేసుకుంది. చౌడేపల్లె : ఆ తల్లికి ఏం కష్టమో ... ఏమో కానీ రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను నీటిపాలుచేసి... ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. పేద కూలీ ఇంట పెనువిషాదం నింపిన ఈ సంఘటన చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ చెడుగుట్లపల్లె వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పి. వసంతకుమారి(27) బిడ్డలు అఖిల్(4), హర్షిత(2)ను గ్రామానికి సమీపంలోని జంగంవానికుంట వద్ద గల ఫాంపాండ్ గుంతలో పడేసి ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను కలచివేసింది. ఆ గ్రామం శోకసముద్రమైంది. చెడుగుట్లపల్లెకు చెందిన ఓబులప్ప పెద్ద కుమార్తె పి. వసంతకుమారి, నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన గంగాధర ఐదేళ్ల క్రితం పెళ్లాడారు. గంగాధర తల్లిదండ్రులు మృతిచెందడంతో అత్తగారింట్లోనే ఉంటూ కూలిపనులు చేసి జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా వసంతకుమారి మతిస్థిమితం లేకుండా బాధపడుతోంది. వైద్యసేవలందిస్తే కుదుటపడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడూ బిడ్డలను ప్రేమగా చూసుకునే ఆమె, వారితో కలిసి బలవన్మరణానికి పాల్ప డటమేంటని గ్రామస్తులు, బంధువులు భోరున విలపిస్తున్నారు. బిడ్డలు, భార్య మృతదేహాల వద్ద గంగాధర, అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరుకావడం చూపరులను కలచివేసింది. అఖిల్, హర్షిత మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. -
95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం
* పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఆజాద్ * పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తల్లి లింగపాలెం : తొంభై ఐదు శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ ఇచ్చేందుకు యంత్రాంగం కనికరించడం లేదు. వికలాంగుడైన ఎనిమిదేళ్ల కొడుకును చంకన ఎత్తుకుని అతడి తల్లి అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా రేపు.. ఎల్లుండి అంటూ తిప్పుకుంటున్నారే తప్ప పింఛన్ మాత్రం మంజూరు చేయడం లేదు. ఆ తల్లి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలంలోని మఠంగూడెంకు చెందిన దేశావత్ జ్యోతి, శ్రీను దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం అజాద్ జన్మిం చాడు. పుట్టుకతోనే అతడు మానసిక వికలాంగుడు. కాళ్లు, చేతులు పనిచేయవు. మాటలురావు. అన్నం తినలేడు. అన్నీ తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకుంటున్నారు. అజాద్‌కు వికలాంగుల పింఛన్ ఇప్పించాలని కోరుతూ నాలుగేళ్లుగా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేకసార్లు దరఖాస్తులు సైతం అందించినట్టు ఆజాద్ తల్లి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్‌కు 95 శాతం వికలాంగత్వం ఉన్నట్టు వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు. తమకు ఇద్దరు కుమారులని, ఆజాద్ పెద్ద కొడుకని చెప్పారు. కూలి పనులకు వెళితే గాని కుటుంబ గడవదని, తాను ఇంట్లోనే ఉండి కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని ఆమె తెలిపింది. ఆజాద్‌కు పింఛన్ ఇవ్వాలని అధికారులను కోరితే రేషన్‌కార్డులో ఆజాద్ పేరు లేదని చెప్పారని, దీంతో రచ్చబండ కార్యక్రమంలో కార్డులో పేరు చేర్పించామని జ్యోతి చెప్పింది. ఆజాద్ పేరును తెల్ల రేషన్‌కార్డులో చేర్చారని, అది పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి పింఛన్ ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఏలూరు వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసినా ఫలితం లేదని చెప్పారు. అధికారులు కనికరించి తమ కుమారుడికి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.