95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం | 95 per cent of the Disability .. | Sakshi
Sakshi News home page

95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం

Published Sat, Nov 15 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం

95 శాతం వికలాంగత్వం.. అయినా కనికరించని యంత్రాంగం

* పుట్టుకతో మానసిక వికలాంగుడైన ఆజాద్
* పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తల్లి

లింగపాలెం : తొంభై ఐదు శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ ఇచ్చేందుకు యంత్రాంగం కనికరించడం లేదు. వికలాంగుడైన ఎనిమిదేళ్ల కొడుకును చంకన ఎత్తుకుని అతడి తల్లి అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్నా రేపు.. ఎల్లుండి అంటూ తిప్పుకుంటున్నారే తప్ప పింఛన్ మాత్రం మంజూరు చేయడం లేదు. ఆ తల్లి పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వివరాలు ఇలా ఉన్నాయి. లింగపాలెం మండలంలోని మఠంగూడెంకు చెందిన దేశావత్ జ్యోతి, శ్రీను దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం అజాద్ జన్మిం చాడు. పుట్టుకతోనే అతడు మానసిక వికలాంగుడు.

కాళ్లు, చేతులు పనిచేయవు. మాటలురావు. అన్నం తినలేడు. అన్నీ తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకుంటున్నారు. అజాద్‌కు వికలాంగుల పింఛన్ ఇప్పించాలని కోరుతూ నాలుగేళ్లుగా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేకసార్లు దరఖాస్తులు సైతం అందించినట్టు ఆజాద్ తల్లి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్‌కు 95 శాతం వికలాంగత్వం ఉన్నట్టు వైద్యులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు. తమకు ఇద్దరు కుమారులని, ఆజాద్ పెద్ద కొడుకని చెప్పారు. కూలి పనులకు వెళితే గాని కుటుంబ గడవదని, తాను ఇంట్లోనే ఉండి కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని ఆమె తెలిపింది.

ఆజాద్‌కు పింఛన్ ఇవ్వాలని అధికారులను కోరితే రేషన్‌కార్డులో ఆజాద్ పేరు లేదని చెప్పారని, దీంతో రచ్చబండ కార్యక్రమంలో కార్డులో పేరు చేర్పించామని జ్యోతి చెప్పింది. ఆజాద్ పేరును తెల్ల రేషన్‌కార్డులో చేర్చారని, అది పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగి పింఛన్ ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఏలూరు వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేసినా ఫలితం లేదని చెప్పారు. అధికారులు కనికరించి తమ కుమారుడికి వికలాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement