MEO post
-
మళ్లీ ‘పదోన్నతుల’ ఆశలు
ఆదిలాబాద్‌టౌన్: ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుస్టే ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో పదోన్నతుల ఆశలు రేకెత్తుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా పదోన్నతులు లేక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న టీచర్లకు సుప్రీంకోర్టు తాజా స్టే ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. ఏకీకృత సర్వీస్ రూల్స్ నిబంధనలపై రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు చెల్లవని 2018 ఆగస్టులో హైకోర్టు తీర్పుఇచ్చింది. తాజాగా సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీలతో విద్యాశాఖ అస్తవ్యస్తం.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు ఉండగా, కొత్త జిల్లాల వారీగా పరిశీలిస్తే..నిర్మల్‌లో 19, ఆదిలాబాద్, మంచిర్యాలల్లో 18 మండలాల చొప్పున ఉండగా, ఆసిఫాబాద్‌లో 15 మండలాలు ఉన్నాయి. దాదాపు 4 వేల వరకు ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు ఉండగా, 4 లక్షల 80 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్ ఎంఈవో ఒక్కరే ఉండగా, డైట్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ప్రభావం పదోతరగతి ఫలితాలపై ఏటా పడుతోంది. ఉమ్మడి జిల్లా ఫలితాలపరంగా చూస్తే రాష్ట్రంలో చివరిస్థానంలో ఉన్నాం. కౌటాల ఎంఈవో మాత్రమే రెగ్యులర్ కాగా మిగతా అందరూ ఇన్చార్జి అధికారులే. ప్రధానోపాధ్యాయులు ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు పోస్టుల్లో దేనికి న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా కొత్తగా ఏర్పడిన మండలాలకు కూడా ఎంఈవోలను నియమించలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మంచిర్యాల, ఆదిలాబాద్ డిప్యూటీ ఈవో, జెడ్పీ డిప్యూటీ ఈవోలు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఉండగా, ప్రస్తుతం ఒకరు ఆదిలాబాద్ డీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు చేపడితే ఎంఈవో పోస్టులు, జూనియర్ లెక్చరర్ పోస్టులు, డైట్ లెక్చరర్ పోస్టులు భర్తీ కానున్నాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాబోధన జరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నట్లు తెలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూపు.. ఏకీకృత సర్వీస్ రూల్స్ నిబంధన అమలుకాకపోవడంతో రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించక నష్టపోతున్నారు. లోకల్ బాడీ ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ప్రభుత్వ యజమాన్యంలో పని చేస్తున్న (డీఈవో పరిధిలో) ఉపాధ్యాయులు మాత్రం యాజమాన్యాల వారీగానే పదోన్నతులు చేపట్టాలని కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో మళ్లీ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా మరోసారి ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అయితే సుప్రీంలో కేసు విచారణ చేపట్టే వరకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తే ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు మేలు జరుగుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఖాళీల భర్తీతో విద్యావ్యవస్థ పటిష్టం కానుంది. కాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ఏకీకృత సర్వీస్‌రూల్స్ వివాదం పంచాయతీరాజ్, జడ్పీ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ ఉండాలనేది పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇది అమలుకాకపోవడంతో ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు లభించడంలేదు. 1998 నుంచి ఇప్పటివరకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఎంఈవో, జేఎల్, డైట్ లెక్చరర్ పోస్టుల పదోన్నతులకు తామే అర్హులమని కోర్టును ఆశ్రయించారు. అయితే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు తాము కూడా ఉపాధ్యాయులమేనని, పట్టణ ప్రాంతంలో విధులు నిర్వహించకూడదా అనేది వారి వాదన. అదేవిధంగా ఎంఈవో, జేఎల్ డిప్యూటీ ఈవో, డైట్లెక్చర్ పోస్టులకు తాము అర్హులమేనని కోర్టులో పిల్ దాఖలు చేస్తున్నారు. కోర్టుల్లో ఉండడంతో పదోన్నతులు నిలిచిపోతున్నాయి. -
ఆ సీటు నేనొదల..!
ప్రకాశం, గిద్దలూరు: ప్రభుత్వం హెచ్ఎంలను ఎంఈఓలుగా విధులు నిర్వర్తించరాదని జీఓ ఇచ్చినా రాచర్ల, గిద్దలూరు మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓగా పనిచేస్తున్న సూరా కాశిరంగారెడ్డి సీటు వదలకుండా కూర్చున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎంఈఓలు లేని మండలాల్లో సదరు మండలంలోనే సీనియర్ ప్రధానోపాధ్యాయున్ని ఎంఈఓగా నియమించారు. ఈ క్రమంలో రాచర్ల మండలంలోని అనుములవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న కాశిరంగారెడ్డిని గిద్దలూరు మండలానికి ఇన్చార్జి ఎంఈఓగా నియమించారు. ఇది అక్రమమే అయినా స్థానిక ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో రాచర్ల ఎంఈఓగా పనిచేస్తున్న ఎం.కాశీశ్వరరావు నాలుగు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. దీంతో గిద్దలూరు మండలంతో పాటు, రాచర్ల మండలానికీ కాశిరంగారెడ్డిని ఎంఈఓగా నియమించారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని రెండు మండలాల్లోనూ ఎంఈఓగా కొనసాగుతున్నారు. హెచ్ఎంలకు ఎంఈఓ బాధ్యతలు తొలగించినా కొనసాగింపు... ఎంఈఓలుగా పనిచేస్తున్న హెచ్ఎంలను ఆ ఎంఈవో విధుల నుంచి తొలగిస్తూ విద్యాశాఖ జీఓ జారీ చేసింది. అనుములవీడు జెడ్పీ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న కాశిరంగారెడ్డి రాచర్ల, గిద్దలూరు మండలాల ఎంఈఓగా తొలగిస్తున్నట్లు అందులో తెలిపారు. రాచర్ల ఎంఈఓగా కంభం మండలంలో రెగ్యులర్ ఎంఈఓగా పనిచేస్తున్న మాధవకృష్ణారావును, గిద్దలూరు మండలానికి బేస్తవారిపేట ఎంఈఓగా పనిచేస్తున్న జింకా వెంకటేశ్వర్లును నియమించారు. ఇలా జిల్లాలోని ఆరు మండలాల్లో హెచ్ఎంలు మండల విద్యాశాఖాధికారులుగా పనిచేస్తున్న చోట రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఎంఈఓలను నియమించారు. గిద్దలూరు, రాచర్ల మండలాల్లో మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలుగా పనిచేస్తున్న హెచ్ఎంలు విధుల నుంచి తప్పుకున్నారు. ఆయా స్థానాల్లో కొత్తగా నియమించబడిన పక్క మండలాల ఎంఈఓలు ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల మండలాల్లో ఎంఈఓగా పనిచేస్తున్న హెచ్ఎం కాశిరంగారెడ్డి మాత్రం ఎంఈఓ కుర్చీని వదలకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. రెండు మండలాల్లో ప్రత్యేకాధికారిగా... ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఇందులో ప్రతి మండల ఎంఈఓను ఒక పంచాయతీకి ప్రత్యేకాధికారిగా కేటాయించారు. కాశిరంగారెడ్డి రెండు మండలాల్లో ఎంఈఓగా చేస్తుండటం వలన రెండు పంచాయతీల్లో ప్రత్యేకాధికారిగా చేస్తున్నారు. వీటితో పాటు హెచ్‌ఎంగానూ పనిచేస్తున్నారు. ఈయన వచ్చినప్పటి నుంచి పాఠశాలల తనిఖీలు తగ్గాయని, ఒక్క ఉద్యోగి ఐదు రకాల విధులు నిర్వర్తించలేక, పనిఒత్తిడితో ఉన్నారు. అయినా స్థానిక నాయకులు ఆయననే ఎంఈఓగా కొనసాగించాలని పట్టుబట్టడంతో ప్రభుత్వ జీఓలు పక్కకు వెళ్లాయని తెలుస్తోంది. వారం రోజులుగా సెలవుపై వెళ్లినఎంపీడీఓ... రాచర్ల ఎంపీడీఓ షేక్ మస్తాన్‌వలి గిద్దలూరుకు ఇన్చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు మండలాల్లో ఎంఈఓల చేరికపై ఏర్పడిన వివాదంలో చిక్కుకున్నారు. విద్యాశాఖ ఇచ్చిన జీఓను అమలు చేసి కొత్త ఎంఈఓలను విధుల్లోకి తీసుకోలేక, ఉన్న ఎంఈఓను బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్పలేక నలుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ముందుగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో రెండు మండలాల్లోనూ కాశిరంగారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ బలం లేని ఇద్దరు ఎంఈఓలు ఇక్కడ విధుల్లో చేరేందుకు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఎంఈఓలు, ఎంపీడీఓలు సైతం బెదిరిపోయే పరిస్థితులు నియోజకవర్గంలో నెలకొన్నాయనేందుకు గిద్దలూరు, రాచర్ల మండలాల ఎంఈఓ, ఎంపీడీఓల వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు. శుక్రవారం విధుల్లో చేరిన ఎంపీడీఓ మస్తాన్‌వలి కొత్త ఎంఈఓలను విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై ఎంపీడీఓ మస్తాన్‌వలిని వివరణ కోరగా ఎంఈఓలను చేర్చుకునే విషయాన్ని కొద్ది రోజులు ఆపాలని తమపై ఒత్తిడి తెచ్చారని, జీఓ రాక ముందే తాను జ్వరంతో బాధపడుతూ సెలవు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, జడ్పీ హెచ్ఎంల మద్య కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతుందని, అది తేలగానే ఇద్దరినీ చేర్చుకుంటామన్నారు. -
‘ఎంఈఓ’ కోసం పైరవీలు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడం తో ఎంఈఓ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అనేక మండలాల్లో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇద్దరు, ముగ్గురు ఉండటంతో ఎంఈఓ బాధ్యతల నిర్వహణకు వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రధానోపాధ్యాయులు రాజకీయ నాయకులను ఆశ్రయించగా, మరి కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆశ్రయిస్తున్నారు. ముడుపులు ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పదవీ విరమణలతో ఖాళీ అయిన మోర్తాడ్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, మండలాల ఎంఈఓ పోస్టులతో పాటు జిల్లాలో మరో పది మండలాలకు పొరుగు మండలాల ఎంఈవోలు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే సీనియర్లకు ఎంఈఓ లుగా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేవారు. అయితే చాలా మంది ఎంఈవోలు పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. ఏ మండలంలో ఎంఈఓ పోస్టు ఖాళీ అయితే ఆ మండలానికి చెందిన సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంకు ఎంఈఓగా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో గాంధారి మినహా అన్ని మండలాలకు ఇన్చార్జి ఎంఈఓ లే కొనసాగారు. అనేక మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు పదవీ విరమణ చేయడంతో వారు అదనంగా నిర్వహించిన ఎంఈఓ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. ఈ పోస్టులను గతంలో మాదిరిగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయా లా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలా అనే విషయంపై విద్యాశాఖలో చర్చ జరిగింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఖాళీ అయిన పోస్టుల అదనపు బాధ్యతలను మండలానికి చెందిన సీని యర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లకు కాకుండా పొరుగు మండలాల్లో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి అప్పగించారు. దీంతో ఒక వ్యక్తికి తన సొంత పోస్టింగ్‌తో పాటు రెండు అదనపు బాధ్యతలను మోపడం వల్ల ఏ పని సక్రమంగా నిర్వహించే అవకాశం లేక పోయింది. దీంతో బాధ్యతలు నిర్వహించే అధికారికి తలకు మించిన భారం ఏర్పడటమే కాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులకు అవసరమైన పనులు సకాలంలో పూర్తి కాలేదు. అంతేకాక పాఠశాలలపై అజామాయిషి కరువైంది. ఫలితంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. చివరకు ఎంఈఓలుగా సీనియర్ హెచ్ఎంలా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌లా అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి ఎంఈఓ పోస్టులు అత్యంత కీలకం అని భావించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు వారి మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టు అదనపు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయిం చారు. ఎన్నికలకు ముందుగానే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో అదనపు బాధ్యతల అప్పగింతకు బ్రేక్ పడింది. ఎంపిక పారదర్శకంగా సాగాలి ఎంఈఓ అదనపు బాధ్యతల అప్పగింత పారదర్శకంగా సాగాలి. ఎంఈఓలు లేక ఇప్పటికే విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యింది. సరైన వారిని ఎంఈఓలుగా నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఎలాంటి ఆరోపణలు లేని సీనియర్ హెచ్‌ఎంలకే ఎంఈఓగా బాధ్యతలను అప్పగించాలి. - సత్యానంద్, జిల్లా అధ్యక్షుడు, బహుజన్ టీచర్స్ ఫెడరేషన్