గిద్దలూరు ఎమ్మార్సీ కార్యాలయం
ప్రకాశం, గిద్దలూరు: ప్రభుత్వం హెచ్‌ఎంలను ఎంఈఓలుగా విధులు నిర్వర్తించరాదని జీఓ ఇచ్చినా రాచర్ల, గిద్దలూరు మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓగా పనిచేస్తున్న సూరా కాశిరంగారెడ్డి సీటు వదలకుండా కూర్చున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎంఈఓలు లేని మండలాల్లో సదరు మండలంలోనే సీనియర్ ప్రధానోపాధ్యాయున్ని ఎంఈఓగా నియమించారు. ఈ క్రమంలో రాచర్ల మండలంలోని అనుములవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న కాశిరంగారెడ్డిని గిద్దలూరు మండలానికి ఇన్‌చార్జి ఎంఈఓగా నియమించారు. ఇది అక్రమమే అయినా స్థానిక ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో రాచర్ల ఎంఈఓగా పనిచేస్తున్న ఎం.కాశీశ్వరరావు నాలుగు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. దీంతో గిద్దలూరు మండలంతో పాటు, రాచర్ల మండలానికీ కాశిరంగారెడ్డిని ఎంఈఓగా నియమించారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని రెండు మండలాల్లోనూ ఎంఈఓగా కొనసాగుతున్నారు.
హెచ్‌ఎంలకు ఎంఈఓ బాధ్యతలు తొలగించినా కొనసాగింపు...
ఎంఈఓలుగా పనిచేస్తున్న హెచ్‌ఎంలను ఆ ఎంఈవో విధుల నుంచి తొలగిస్తూ విద్యాశాఖ జీఓ జారీ చేసింది. అనుములవీడు జెడ్పీ స్కూల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న కాశిరంగారెడ్డి రాచర్ల, గిద్దలూరు మండలాల ఎంఈఓగా తొలగిస్తున్నట్లు అందులో తెలిపారు. రాచర్ల ఎంఈఓగా కంభం మండలంలో రెగ్యులర్ ఎంఈఓగా పనిచేస్తున్న మాధవకృష్ణారావును, గిద్దలూరు మండలానికి బేస్తవారిపేట ఎంఈఓగా పనిచేస్తున్న జింకా వెంకటేశ్వర్లును నియమించారు. ఇలా జిల్లాలోని ఆరు మండలాల్లో హెచ్‌ఎంలు మండల విద్యాశాఖాధికారులుగా పనిచేస్తున్న చోట రెగ్యులర్‌గా పనిచేస్తున్న ఎంఈఓలను నియమించారు. గిద్దలూరు, రాచర్ల మండలాల్లో మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలుగా పనిచేస్తున్న హెచ్‌ఎంలు విధుల నుంచి తప్పుకున్నారు. ఆయా స్థానాల్లో కొత్తగా నియమించబడిన పక్క మండలాల ఎంఈఓలు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల మండలాల్లో ఎంఈఓగా పనిచేస్తున్న హెచ్‌ఎం కాశిరంగారెడ్డి మాత్రం ఎంఈఓ కుర్చీని వదలకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
రెండు మండలాల్లో ప్రత్యేకాధికారిగా...
ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ఇందులో ప్రతి మండల ఎంఈఓను ఒక పంచాయతీకి ప్రత్యేకాధికారిగా కేటాయించారు. కాశిరంగారెడ్డి రెండు మండలాల్లో ఎంఈఓగా చేస్తుండటం వలన రెండు పంచాయతీల్లో ప్రత్యేకాధికారిగా చేస్తున్నారు. వీటితో పాటు హెచ్‌ఎంగానూ పనిచేస్తున్నారు. ఈయన వచ్చినప్పటి నుంచి పాఠశాలల తనిఖీలు తగ్గాయని, ఒక్క ఉద్యోగి ఐదు రకాల విధులు నిర్వర్తించలేక, పనిఒత్తిడితో ఉన్నారు. అయినా స్థానిక నాయకులు ఆయననే ఎంఈఓగా కొనసాగించాలని పట్టుబట్టడంతో ప్రభుత్వ జీఓలు పక్కకు వెళ్లాయని తెలుస్తోంది.
వారం రోజులుగా సెలవుపై వెళ్లినఎంపీడీఓ...
రాచర్ల ఎంపీడీఓ షేక్ మస్తాన్‌వలి గిద్దలూరుకు ఇన్‌చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు మండలాల్లో ఎంఈఓల చేరికపై ఏర్పడిన వివాదంలో చిక్కుకున్నారు. విద్యాశాఖ ఇచ్చిన జీఓను అమలు చేసి కొత్త ఎంఈఓలను విధుల్లోకి తీసుకోలేక, ఉన్న ఎంఈఓను బాధ్యతల నుంచి తప్పుకోమని చెప్పలేక నలుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ముందుగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో రెండు మండలాల్లోనూ కాశిరంగారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ బలం లేని ఇద్దరు ఎంఈఓలు ఇక్కడ విధుల్లో చేరేందుకు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఎంఈఓలు, ఎంపీడీఓలు సైతం బెదిరిపోయే పరిస్థితులు నియోజకవర్గంలో నెలకొన్నాయనేందుకు గిద్దలూరు, రాచర్ల మండలాల ఎంఈఓ, ఎంపీడీఓల వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు. శుక్రవారం విధుల్లో చేరిన ఎంపీడీఓ మస్తాన్‌వలి కొత్త ఎంఈఓలను విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై ఎంపీడీఓ మస్తాన్‌వలిని వివరణ కోరగా ఎంఈఓలను చేర్చుకునే విషయాన్ని కొద్ది రోజులు ఆపాలని తమపై ఒత్తిడి తెచ్చారని, జీఓ రాక ముందే తాను జ్వరంతో బాధపడుతూ సెలవు పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, జడ్పీ హెచ్‌ఎంల మద్య కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతుందని, అది తేలగానే ఇద్దరినీ చేర్చుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment