మోర్తాడ్, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడం తో ఎంఈఓ పోస్టుల భర్తీకి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అనేక మండలాల్లో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఇద్దరు, ముగ్గురు ఉండటంతో ఎంఈఓ బాధ్యతల నిర్వహణకు వారు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రధానోపాధ్యాయులు రాజకీయ నాయకులను ఆశ్రయించగా, మరి కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆశ్రయిస్తున్నారు. ముడుపులు ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పదవీ విరమణలతో ఖాళీ అయిన మోర్తాడ్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, మండలాల ఎంఈఓ పోస్టులతో పాటు జిల్లాలో మరో పది మండలాలకు పొరుగు మండలాల ఎంఈవోలు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇవ్వడానికి నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే సీనియర్‌లకు ఎంఈఓ లుగా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేవారు.
అయితే చాలా మంది ఎంఈవోలు పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. ఏ మండలంలో ఎంఈఓ పోస్టు ఖాళీ అయితే ఆ మండలానికి చెందిన సీనియర్ గెజిటెడ్ హెచ్‌ఎంకు ఎంఈఓగా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో గాంధారి మినహా అన్ని మండలాలకు ఇన్‌చార్జి ఎంఈఓ లే కొనసాగారు. అనేక మంది గెజిటెడ్ హెడ్ మాస్టర్లు పదవీ విరమణ చేయడంతో వారు అదనంగా నిర్వహించిన ఎంఈఓ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. ఈ పోస్టులను గతంలో మాదిరిగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో భర్తీ చేయా లా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌లతో భర్తీ చేయాలా అనే విషయంపై విద్యాశాఖలో చర్చ జరిగింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో ఖాళీ అయిన పోస్టుల అదనపు బాధ్యతలను మండలానికి చెందిన సీని యర్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్లకు కాకుండా పొరుగు మండలాల్లో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి అప్పగించారు. దీంతో ఒక వ్యక్తికి తన సొంత పోస్టింగ్‌తో పాటు రెండు అదనపు బాధ్యతలను మోపడం వల్ల ఏ పని సక్రమంగా నిర్వహించే అవకాశం లేక పోయింది.
దీంతో బాధ్యతలు నిర్వహించే అధికారికి తలకు మించిన భారం ఏర్పడటమే కాకుండా ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులకు అవసరమైన పనులు సకాలంలో పూర్తి కాలేదు. అంతేకాక పాఠశాలలపై అజామాయిషి కరువైంది. ఫలితంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెట్టాయి. చివరకు ఎంఈఓలుగా సీనియర్ హెచ్‌ఎంలా లేక సీనియర్ స్కూల్ అసిస్టెంట్‌లా అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి ఎంఈఓ పోస్టులు అత్యంత కీలకం అని భావించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు వారి మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టు అదనపు బాధ్యతలను అప్పగించాలని నిర్ణయిం చారు. ఎన్నికలకు ముందుగానే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో అదనపు బాధ్యతల అప్పగింతకు బ్రేక్ పడింది.
ఎంపిక పారదర్శకంగా సాగాలి
ఎంఈఓ అదనపు బాధ్యతల అప్పగింత పారదర్శకంగా సాగాలి. ఎంఈఓలు లేక ఇప్పటికే విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యింది. సరైన వారిని ఎంఈఓలుగా నియమించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. ఎలాంటి ఆరోపణలు లేని సీనియర్ హెచ్‌ఎంలకే ఎంఈఓగా బాధ్యతలను అప్పగించాలి.
- సత్యానంద్, జిల్లా అధ్యక్షుడు, బహుజన్ టీచర్స్ ఫెడరేషన్
‘ఎంఈఓ’ కోసం పైరవీలు
Published Thu, Aug 8 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement