merchent
-
‘వ్యాపారుల సంక్షేమమే లక్ష్యం’
శ్రీకాకుళం అర్బన్: వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని కామర్స్ అధ్యక్షుడు అంధవరపు వరాహ నరసింహం(వరం) అన్నారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తామని తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి పీవీ రమణ మాట్లాడుతూ వ్యాపారుల విశాల ప్రయోజనం కోసం ఏర్పడింనదన్నారు. జిల్లాలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించామని చెప్పారు. ఆ కల ఇప్పటికి నెరవేరిందని అన్నారు. నెల క్రితం 46 సంఘాలతో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందన్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులూ ఉన్నారన్నారు. వ్యక్తుల మధ్య వైరం ఉంటే దాన్ని పక్కనపెట్టి చాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. సంఘ ప్రతినిధి జామి భీమశంకరరావు‡ మాట్లాడుతూ 34ఏళ్ల క్రితం ఏర్పడాల్సిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్నాళ్లకు ఏర్పడడం అభినందనీయమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఒక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. త్వరలోనే మెంబర్షిప్, రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్ల సాంబమూర్తి, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, పేర్ల మహేష్, గుమ్మా నాగరాజు, గుడ్ల మల్లేశ్వరరావు, తంగుడు నాగేవ్వరరావు, పాపారావు, బరాటం చంద్రశేఖర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
రూ.1.50 కోట్లతో చీటీల వ్యాపారి పరారీ!
తుని రూరల్ : రూపాయి రూపాయి కూడబెట్టి కట్టిన పేదల సొమ్ముతో చీటీల వ్యాపారి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తుని మండలం తేట గుంట గ్రామంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.అదే పంచాయతీకి శివారు గ్రామంగా ఉన్న గవరపేటకు చెందిన పొలమరశెట్టి సత్యకృష్ణ ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ చీటీలను ప్రారంభించాడు. కూలిపనులు చేసుకుని జీవించే పేదలు తమ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని కేటాయించి చీటీలు కట్టారు. రెండు నెలల నుంచి చీటీల పాటలు పాడుకున్న పాటదారులకు డబ్బులు ఇవ్వకపోగా 20 రోజుల నుంచి గ్రామంలో సత్యకృష్ణ కనిపించడం లేదు. దీంతో చీటీలు వేసిన వ్యక్తులు ఇంటికి వెళ్లి అడగ్గా మాకు ఎలాంటి విషయం చెప్పకుండా వెళ్లిపోయాడని భార్య, బంధువులు స్పష్టం చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో సత్యకృష్ణ పరారైనట్టు బాధితులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం సత్యకృష్ణ మామ జోసెష్ (జ్యోషిబాబు), బంధువులు, సర్పంచ్ గజ్జి అప్పలరాజు, బాధితులు స్థానిక రామాలయం వద్ద సమావేశమయ్యారు. 15 రోజులు గడువిస్తే సత్యకృష్ణను తీసుకువచ్చి బాధితులందరికీ న్యాయం చేస్తామని బందువులు, మామ జోసెఫ్ హామీ ఇచ్చారు. అందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో బాధితు లు అంగీకరించారు. అప్పటికీ న్యాయం జరగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సత్యకృష్ణ భార్య, మామల నుంచి తమ డబ్బు వసూలు చేస్తామని బాధితులు పేర్కొన్నారు. రూ.1.50 కోట్లతో ఉడాయించాడు సత్యకృష్ణ చీటీలు ప్రారంభించడంతో గవరపేట, తేటగుంటలకు చెందిన 128 మంది చేరారు. రూ.50 వేల నుంచి రూ.లక్షల విలువ చేసే 16 చీటీలను నడుపుతున్నాడు. వీరిలో చీటీలు పాడినవారు 48 మంది ఉన్నారని, బాధితులకు ఒక్కొక్కరికి రూ.45 వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వాల్సి ఉంది. బాధితులు అందించిన సమాచారం మేరకు రూ.1.50 కోట్లతో ఉడాయించినట్టు స్పష్టమవుతోంది. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.