తుని రూరల్ : రూపాయి రూపాయి కూడబెట్టి కట్టిన పేదల సొమ్ముతో చీటీల వ్యాపారి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తుని మండలం తేట గుంట గ్రామంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.అదే పంచాయతీకి శివారు గ్రామంగా ఉన్న గవరపేటకు చెందిన పొలమరశెట్టి సత్యకృష్ణ ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ చీటీలను ప్రారంభించాడు. కూలిపనులు చేసుకుని జీవించే పేదలు తమ కష్టార్జితంలో కొంత మొత్తాన్ని కేటాయించి చీటీలు కట్టారు. రెండు నెలల నుంచి చీటీల పాటలు పాడుకున్న పాటదారులకు డబ్బులు ఇవ్వకపోగా 20 రోజుల నుంచి గ్రామంలో సత్యకృష్ణ కనిపించడం లేదు. దీంతో చీటీలు వేసిన వ్యక్తులు ఇంటికి వెళ్లి అడగ్గా మాకు ఎలాంటి విషయం చెప్పకుండా వెళ్లిపోయాడని భార్య, బంధువులు స్పష్టం చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో సత్యకృష్ణ పరారైనట్టు బాధితులు చెబుతున్నారు.
గురువారం సాయంత్రం సత్యకృష్ణ మామ జోసెష్ (జ్యోషిబాబు), బంధువులు, సర్పంచ్ గజ్జి అప్పలరాజు, బాధితులు స్థానిక రామాలయం వద్ద సమావేశమయ్యారు. 15 రోజులు గడువిస్తే సత్యకృష్ణను తీసుకువచ్చి బాధితులందరికీ న్యాయం చేస్తామని బందువులు, మామ జోసెఫ్ హామీ ఇచ్చారు. అందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో బాధితు లు అంగీకరించారు. అప్పటికీ న్యాయం జరగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సత్యకృష్ణ భార్య, మామల నుంచి తమ డబ్బు వసూలు చేస్తామని బాధితులు పేర్కొన్నారు.
రూ.1.50 కోట్లతో ఉడాయించాడు
సత్యకృష్ణ చీటీలు ప్రారంభించడంతో గవరపేట, తేటగుంటలకు చెందిన 128 మంది చేరారు. రూ.50 వేల నుంచి రూ.లక్షల విలువ చేసే 16 చీటీలను నడుపుతున్నాడు. వీరిలో చీటీలు పాడినవారు 48 మంది ఉన్నారని, బాధితులకు ఒక్కొక్కరికి రూ.45 వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వాల్సి ఉంది. బాధితులు అందించిన సమాచారం మేరకు రూ.1.50 కోట్లతో ఉడాయించినట్టు స్పష్టమవుతోంది. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
రూ.1.50 కోట్లతో చీటీల వ్యాపారి పరారీ!
Published Sat, Nov 7 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement
Advertisement