హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని వసతి గృహ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం విద్యార్థులు భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంజయ్య రోడ్డులోని ఎస్సీ బాలుర కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కర్నూలు రోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ మస్తాన్దర్గా మీదుగా కలెక్టరేట్ వర కూ సాగింది.
ఈ సందర్భంగా మాదిగ విద్యార్థుల ఫెడరేషన్ జిల్లా నాయకుడు జలదంకి నరసింగరావు మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 116, బీసీ వసతి గృహాలు 76, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 32 ఉన్నాయన్నారు. దాదాపు 90 శాతానికిపైగా వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని చెప్పారు. కనీసం మరుగుదొడ్లు, వంటగదులు, తాగునీరు లేక విద్యార్థులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా లేనందున విద్యార్థులకు కనీస ఆహారం కూడా అందడం లేదన్నారు. ప్రతి విద్యార్థి మెస్ చార్జీలను రూ.2,500 పెంచాలన్నారు.
బాలికల వసతి గృహాలకు ప్రహరీలు లేనందున ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాస్మొటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని, వసతి గృహాల్లో రెగ్యులర్ వంట మనుషులను నియమించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తొరటి ఆనంద్ మాదిగ, కొమ్ము సృజన్ మాదిగ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.