హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 71 శాతం జంప్‌చేసి రూ. 2,331 కోట్లను తాకింది. అల్యూమినియం, కాపర్ విభాగాలు పటిష్ట పనితీరు చూపడం లాభాలకు దోహదం చేసింది.
గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,362 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 53,151 కోట్ల నుంచి 52,808 కోట్లకు బలహీనపడింది. కఠిన మార్కెట్ పరిస్థితుల్లోనూ వృద్ధి బాటలో సాగినట్లు కంపెనీ ఎండీ సతీష్ పాయ్ తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ బిజినెస్‌లు ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మెరుగైన ప్రొడక్ట్ మిక్స్, తగ్గిన ముడివ్యయాలు సహకరించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల విస్తరణపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ ఏడాది రూ. 4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది(2024–25) పెట్టుబడులను రూ. 5,500 కోట్లకు పెంచనున్నట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు బీఎస్ఈలో 12.5 శాతం పతనమై రూ. 510 వద్ద ముగిసింది.