మెటల్స్ మెరుపులు : లాభాల్లో మార్కెట్లు
ముంబై : మార్కెట్లో మెటల్ షేర్లు మెరుపులు సృష్టించాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజీలో అల్యూమినియం, కాపర్ ధరలు హైజంప్ చేయడంతో మెటల్ షేర్ల దూసుకుపోయాయి. దీంతో పాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాలు పండించడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 96 పాయింట్ల లాభంలో 34,427 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల లాభంలో 10,565 వద్ద క్లోజయ్యాయి. ఓ వైపు క్రూడ్ ఆయిల్ ధరలు దెబ్బతీస్తున్నా... ... మరోవైపు మెటల్స్, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. మెటల్ రంగ 4.5 శాతం ఎగిసి మార్కెట్లకు జోషిచ్చింది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ సైతం 1.2 శాతం పుంజుకోవడం మార్కెట్లకు అండగా నిలిచింది. అయితే చమురు ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
హిందాల్కో, నాల్కో, టాటా స్టీల్, వేదంత, హిందూస్తాన్ కాపర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 12 శాతం మేర ర్యాలీ జరిపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ 4 శాతం నుంచి 7 శాతం మేర కిందకి పడిపోయాయి. ఇతర కంపెనీల్లో టైటాన్, హెచ్డీఎఫ్సీ 2.5 శాతం మేర లాభపడ్డాయి. యస్ బ్యాంకు, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, ఐటీసీ 3 శాతం వరకు పైకి ఎగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 133 పాయింట్లు పెరిగింది. మరోవైపు నేడు టెక్ దిగ్గజం టీసీఎస్ తన క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో టీసీఎస్ షేర్లు కూడా 0.87 శాతం మేర లాభపడ్డాయి.