కాలిలో తిమ్మిర్లు... విలవిల్లాడే నొప్పి..
హోమియో కౌన్సెలింగ్
నాకు 30 ఏళ్లు. మా పెళ్లయి ఎనిమిదేళ్లయింది. ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగాము. ఎన్నో టెస్ట్‌లు చేయించుకున్నాము. ఏ లోపమూ లేదంటున్నారు. సంతానం కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. హోమియోలో మంచి మందులున్నాయా? - - నీలిమ, ఆదోని
ఆరోగ్యవంతులైన దంపతులు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులూ పాటించకుండా ఏడాదిపాటు దాంపత్య జీవనం సాగించినా పిల్లలు కలగకపోవడాన్ని సంతానలేమి అంటారు. సంతానలేమికి కారణాలు భార్యలో లేదా భర్తలో ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు.
కారణాలు: జీవనశైలి, కాలుష్యం, వాతావరణం, ధూమపానం, మద్యపానం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందుల వాడకం, పురుషుల్లో శుక్రకణాలు తగినంతగా లేకపోవడం, ఉన్నా, వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం, నాణ్యత లేకపోవడం వంటి లోపాలు. మహిళల్లో నెలసరి సమస్యలు, ట్యూబులు బ్లాక్ అవడం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, అండాల విడుదల సరిగా లేకపోవడం లేదా విడుదలైన అండాలలో నాణ్యత లోపించడం వంటివి ప్రధాన కారణాలు.
పరిష్కారం: దంపతులిరువురిలోనూ సంతాన సాఫల్యత గురించిన అవగాహన, పరిజ్ఞానం ఉండాలి. సరైన పౌష్టికాహారం, శారీరక వ్యాయామం ద్వారా శుక్రకణాలు, అండాల నాణ్యత పెరిగే అవకాశాలున్నాయి. పరీక్షలు: స్త్రీలలో అయితే పెల్విక్ స్కాన్, ఫాలిక్యులార్ స్టడీ, హెచ్.ఎస్.పి, ల్యాపరోస్కోపీ, పురుషులలో అయితే వీర్యపరీక్ష, టెస్టిక్యులార్ బయాప్సీ. అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ అండ్ స్క్రోటమ్. ఇరువురిలోనూ థైరాయిడ్ ప్రొఫైల్, హార్మోనల్ పరీక్షలు, సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ.
హోమియో చికిత్స: సంతానలేమికి హోమియోలో అద్భుతమైన ఔషధాలు, చికిత్సా మార్గాలున్నాయి. ముందుగా సంతాన లేమికి
కారణాలు కనుక్కొని, అందుకు అవసరమైన పరీక్షలు చేయించి, వ్యక్తికి సంబంధించిన మానసిక, శారీరక కారణాలు విశ్లేషించి, అందుకు తగిన మందులు ఇస్తారు. స్టార్ హోమియోపతి చికిత్సా విధానం ద్వారా సంతానం కలగడానికి అవరోధంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సంతాన సాఫల్యత కలుగుతుంది.
పల్మొనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 60 ఏళ్లు. గతంలో చాలా రోజులు గనిలో పనిచేశాను. గత ఏడాదిగా నాకు పొడిదగ్గు వస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. డాక్టర్‌ను కలిస్తే పల్మునరీ ఫైబ్రోసిస్ అన్నారు. అంటే ఏమిటో వివరంగా చెప్పండి. నా సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచించండి. - కమలాకర్‌రావు, ఖమ్మం
పల్మునరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధి వచ్చినవారిలో ఊపిరితిత్తుల (లంగ్స్) లోపల ఉండే గాలిగదుల మధ్య భాగాల్లో గాట్లు పడినట్లుగా అయి, తన మునుపటి మృదుత్వాన్ని, సాగేగుణాన్ని కోల్పోయి గట్టిగా మారుతుంది. దాంతో అక్కడ రక్తప్రసరణ, గాలి మార్పిడి సజావుగా సాగదు. అక్కడి కణజాలం పీచులాగా, గాట్లు పడినట్లుగా అయిపోతుంది. చాలా సందర్భాల్లో దీనికి కారణం తెలియదు. ఇలా కారణం తెలియకుండా వచ్చే ఈ ఊపిరితిత్తుల జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. దీన్నే ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) అని కూడా అంటారు.
ఈ వ్యాధికి కారణాలు: పొగతాగే అలవాటు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ పర్యావరణ కాలుష్యాలకు గురికావడం ఇసుక, లోహవ్యర్థాల నుంచి వచ్చే ధూళిని పీలుస్తూ ఉండటం కొన్ని రకాల మందులు తీసుకోవడం కొంతమందిలో వంశపారంపర్యంగా ఇది వస్తుంటుంది. కొందరిలో జీర్ణాశయంలోని యాసిడ్ పైకి తన్నే వ్యాధి (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్-జీఈఆర్డీ) వల్ల కూడా ఇది రావచ్చు. వాళ్లు యాసిడ్ ద్రవపు చుక్కలను తమ శ్వాసలో తీసుకుంటూ ఉండటతో దీర్ఘకాలంలో ఈ వ్యాధికి దారితీయవచ్చు.
లక్షణాలు: ఊపిరి అందకపోవడం (ముఖ్యంగా శారీరక శ్రమ చేసే సమయంలో) పొడిదగ్గు, అలసట కండరాలు, కీళ్ల నొప్పులు బొటనవేలు లేదా వేళ్ల చివరలు గుండ్రంగా అవుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిర్ధారణ: ఛాతీ ఎక్స్-రే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా, అయితే దానివల్ల ఊపిరితిత్తులు ఏ మేరకు దెబ్బతిన్నాయి అని తెలుసుకునేందుకు చేసే పరీక్ష, ఊపిరితిత్తులకు జరిగే రక్తప్రసరణ, దాంతో అందే ఆక్సిజన్ పాళ్లను తెలుసుకునే పరీక్ష ఊపిరితిత్తుల నుంచి కొన్ని కణాలను సేకరించి చేసే బ్రాంకోఆల్వియొలార్ లవాజ్ పరీక్ష ఊపిరితిత్తి నుంచి చిన్న ముక్కను సేకరించి చేసే లంగ్ బయాప్సీ సీటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.
చికిత్స: ఈ వ్యాధి ఉన్నవారిలో ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. మందులను మార్కెట్లోకి అనుమతించేందుకు ఉద్దేశించిన అమెరికా అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ దీనికి రెండు రకాల మందులను సిఫార్సు చేస్తోంది. అవి... నింటాడనిమ్, పైరఫెనిడోన్ మందులు. రోగి శ్వాసతీసుకోలేకపోతున్నప్పుడు ఆక్సిజన్ థెరపీ అందిస్తుంటారు. అయితే రోగి వయసు 65 ఏళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేస్తారు. ఇదిచివరి ప్రయత్నంగా చేసే శస్త్ర చికిత్స.
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
నాకు రోజూ రాత్రివేళల్లో అదీ నిద్రలో కాళ్లు తిమ్మిరెక్కుతారుు. తిమ్మిరెక్కిన సమయంలో కాలు కిందపెట్టనివ్వదు. నొప్పి, బాధతో విలవిల్లాడిపోతాను. దయుచేసి నాకు సరియైన సలహా ఇవ్వగలరు. - సంతోష్‌కుమార్, కర్మన్‌ఘాట్
మీరు శాకాహారులో లేదా మాంసాహారులో తెలియజేయలేదు. శాకాహారుల్లో విటమిన్-బి12 లోపం వల్ల, విటమిన్-డి లోపం వల్ల మీరు చెబుతున్న సమస్య రావచ్చు. మీరు పేర్కొన్న లక్షణాలను బట్టి చూస్తే మీ సమస్య పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చని అనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, క్రానిక్ ఆల్కహాలిజం సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా సాధారణం. మీ సమస్యకు అసలు కారణాన్ని నిర్ధారణ చేయడానికి బ్లడ్‌టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి సమస్యకు తగిన మందులను జనరల్ ఫిజీషియన్ పర్యవేక్షణలో కనీసం రెండు మూడు నెలలైనా వాడాల్సి ఉంటుంది.
నా వయస్సు 40 ఏళ్లు. ఇటీవలే ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల చాలారోజులు ఆసుపత్రిలో ఉండాల్సివచ్చింది. వెంటిలేటర్ కూడా పెట్టారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సురేశ్, జగ్గయ్యపేట
ఇది ప్యాంక్రియాటిక్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే సమస్య. ఆల్కహాల్ మొదలుకొని పిత్తాశయంలో రాళ్లు, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఈ వ్యాధి ఉన్నవారిలో కడుపు నొప్పితో వాంతులు కావడం, ఒక్కోసారి ఇతర అవయవాలు, వ్యవస్థలు పనిచేయకపోవడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి చికిత్స తర్వాత కూడా దీర్ఘకాలికంగా మందులు, క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం. మితాహారం తీసుకుంటూ, మాంసాహారం, నూనె పదార్థాలు బాగా తగ్గించాలి.