వచ్చే 24 గంటల్లో అల్పపీడనం.. విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వానలు కురిసేందుకు మరింత అనుకూల వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి రాయలసీమలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల అవర్తనం బలపడనుంది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా మారనుంది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి అక్కడ అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) మంగళవారం నాటి నివేదికలో తెలిపింది.
ఇలా ఒక రోజు వ్యవధిలో బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలోనూ అల్పపీడనాలు ఏర్పడితే రాష్ట్రంలో మంచి వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నా, కోస్తాంధ్రలో మాత్రం సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ తరుణంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు వర్షాలూ కురవడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.