Meyar
-
సీతారామ స్వామి దేవస్థానంలో రామనవమి వేడుకలు
-
రూపాయికే అంత్యక్రియలు
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక్క రూపాయికే అంత్యక్రియలు–ఆఖిరిసఫర్ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి రానుంది. నగరంలో నివసించే నిరుపేదలకు వరంగా మారే ఈ పథకాన్ని నగర మేయర్ రవీందర్‌సింగ్ రూపొందించారు. మున్సిపాలిటీ అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నిరుపేదలకు ఇబ్బందికరంగా మారిన అంతిమ సంస్కారాలను చేయాలనే తలంపుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని కులాలు, మతాల వారికి అంతిమయాత్ర నుంచి మొదలుకొని అంత్యక్రియల వరకు అయ్యే ఖర్చులను నగరపాలక సంస్థనే భరించనుంది. పథకం అమలుకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం రూ.48 లక్షలు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షించనున్నారు. ఒక్క రూపాయి బల్దియాకు చెల్లిస్తే చాలు కార్మికులను వారి ఇంటికి పంపించి పాడె కట్టించడంతోపాటు నలుగురు డప్పు వాయించే వారిని పంపిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కోరితే ఉచితంగానే బాడీ ఫ్రీజర్‌ను అందిస్తారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు పంపించేం దుకు వాహనాన్ని సమకూరుస్తారు. అంత్యక్రియల సందర్భంగా ఎవరి సంప్రదాయాల ప్రకారం వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తారు. శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేసే వారికి కట్టెలు, కిరోసిన్, టైర్లు, ఇతర వసతులు కల్పిస్తారు. మృతదేహాన్ని ఖననం చేసే సంప్రదాయం ఉంటే ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడికక్కడే డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. నిరుపేదలకు అండగా... రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు గడిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు వారికి తలకుమించిన భారమే. అలాంటి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో స్థానికులు చందాలు వేసుకొని అంతిమ సంస్కారాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతిమయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా మారనుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు అంత్యక్రియలు భారం కాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ పథకంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నిరుపేదలకు అండగా చేపట్టిన పథకం అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సైతం యోచిస్తోంది. సామాజిక దైవకార్యంలా భావించాలి.. – మేయర్, కమిషనర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతిమాయాత్ర–ఆఖిరిసఫర్ కార్యక్రమాన్ని సామాజిక దైవకార్యంగా భావించి, ఈ కార్యక్రమ అమలుకు అధికారులంతా సిద్ధం కావాలని నగర మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ట్యాంకు ఆవరణలో పథకం అమలుపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. పథకానికి నగర మేయర్ రవీందర్‌సింగ్ రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న పథకం అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ.. పథకం అమలుకు రూ.49 లక్షలు కేటాయించామని, ఒక్క అంత్యక్రియ కార్యక్రమానికి సుమారు రూ.6వేలు నగరపాలక సంస్థ ద్వారా ఖర్చు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డీఈ స్థాయి వ్యక్తిని ప్రత్యేక అధికారిగా నియమించి, స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల వారీగా కమిటీ అధికారులు ఆఖిరి సఫర్ కార్యక్రమం విధుల నిర్వహిస్తారన్నారు. యుద్ధప్రాతిపదికన పథకం అమలుకు నగరపాలక సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ భద్రయ్య, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, అదనపు కమిషనర్ రాజేంద్రకుమార్, డీఈలు రామన్, యాదగిరి, మసూద్, ఏఈలు వెంకట్‌కుమార్, చైతన్య, నిఖిత, వాణి, సానిటరీ సూపర్వైజర్ వేణుగోపాల్, ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు. -
ఆ వికృత చేష్టలు భరించలేనివి
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ వికృత చేష్టలు అంతాఇంతా కాదని శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు వాపోయారు. ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత విద్యార్థినులు మాట్లాడారు. సంజయ్ కళాశాలకు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండేవాడని, కళాశాలలో ప్రత్యేక గదికి తీసుకెళ్లి తమతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్నారు. వారం కిత్రం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురై కిందపడిపోగా ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి వస్తే సంజయ్ పంపించలేదన్నారు. తామే చూసుకుంటామని తల్లిదండ్రులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి తన ఇంటికి తీసుకెళ్లి గదిలో బంధించాడని తెలిపారు. తమతో డార్లింగ్ అంటూ సంభోదించేవాడని, చాలా మందితో ఇదే విధంగా ప్రవర్తించటంతో వారు కళాశాలకు రావటం మానేశారని చెప్పారు. భయపడి సర్టిఫికెట్లు కూడ తీసుకెళ్లలేదన్నారు. ఇదిలా ఉండగా సంజయ్‌పై నిర్భయతో పాటు మరో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ లేక పోవటంతో పోలీసులు వెనుదిరిగారు. తాను విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఇది ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ కుట్రగా ఉదయం మీడియా సమావేశంలో పేర్కొన్న సంజయ్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయన కోసం గాలింపు ప్రారంభించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ సంఘాల నాయకులు, బాధిత విద్యార్థినులు పోలీస్ కమిషనర్ కార్తికేయను కలిసి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు గురువారం హైదరాబాద్‌లో ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీపీ కార్తికేయకు పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సిద్ధలక్ష్మీ, సతీష్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభద్ర, ఉపాధ్యక్షులు సుమ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, పీవైఎల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు వరదయ్య, బాలయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బి గంగారెడ్డి, బాధిత విద్యార్థినులతో కలిసి సీపీ కార్తికేయకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 13 మంది విద్యార్థినులలో 11 మందిపై సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థినులు డిసెంబర్లో అడ్మిషన్లు తీసుకున్నారని, అడ్మిషన్ తీసుకున్న రెండు నెలల తర్వాత కళాశాల లీజ్ నిర్వాహకుడిని సంజయ్ తొలగించాడని తెలిపారు. అనంతరం కళాశాలకు రావటం మొదలుపెట్టి విద్యార్థినుల పట్ల వికృత చేష్టలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. సంజయ్‌పై చర్యలు తీసుకుని, కళాశాలను సీజ్ చేయాలని, విద్యార్థినులు విద్యా నష్టపోకుండా వారిని మరో కళాశాలలో చేర్పించాలన్నారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు పోలీస్‌శాఖ పరంగా భద్రత కల్పించాలని కోరాగా సీపీ భరోసానిచ్చారని తెలిపారు. సంజయ్‌పై నాల్గోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్భయ చట్టం 354 354(ఎ), నిర్బంధం 342, బెదిరింపుల కింద 506, అభ్యంతకరంగా చేతులతో తాకటం 509 సెక్షన్లు నమోదు చేశారు. -
కొండా సురేఖ వర్సస్ నన్నపునేని..
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ నగరంలోని ఇక్బాల్ మినార్ కూల్చివేత వ్యవహారంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి, ఆధిపత్య పోరు బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరగా భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన, తొలి ప్రభుత్వం ఏర్పాటు వరకు టీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటు ఈ జిల్లా నుంచే మొదలైంది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల మధ్యే వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. కొండా వర్సస్ నన్నపునేని.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్ మధ్య గత రెండేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కొంతకాలం వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా, గత ఆరు నెలలుగా ఇవి పరస్పర ఆరోపణలు, దూషణల వరకు వెళ్లాయి. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, రంజాన్ ఇఫ్తార్ విందులు వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచాయి. ఇరువర్గాలకు చెందిన అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ దశను దాటి ఏకంగా ఎదుటి వర్గంపై బాహటంగా విమర్శలు చేసే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. వరంగల్ పోచమ్మమైదాన్‌లో ఇక్బాల్ మినార్ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో బైఠాయించారు. మరుసటి రోజు వరంగల్‌లోని ఓ గార్డెన్లో ముస్లిం నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మేయర్ నరేందర్ నువ్వో బచ్చా’ అంటూ నేరుగా ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. శనివారం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ నరేందర్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2014లో తాను త్యాగం చేస్తే నే సురేఖకు టికెట్ వచ్చిందని, సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు నష్టం చేకూర్చితే నరసింహా అవతారం ఎత్తుతానని స్వరం పెంచారు. ఇదిలా ఉండగా మరోవైపు కొండా కుటుంబం నుంచి తమకు ప్రాణ హానీ ఉందని, తమకు రక్షణ కల్పిం చాలంటూ ఈ నెల 20న 15 డివిజన్ కార్పొరేటర్ శారదజోషి నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొండా, నన్నపునేని మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరినా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇదే తీరు.. మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తు త ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మధ్య గత మూడేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కవిత పార్టీకి వచ్చిన కొత్తలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ శంకర్‌నాయక్ ఘాటైన వ్యా ఖ్యలు చేశారు. దీనిపై పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను వివరణ అడిగారు. అయినా అక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. పార్టీపరంగా ఇరువర్గాలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో విచిత్రంగా త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనాచారి ఉండగా గండ్ర సత్యనారాయణరావు టిక్కెట్ హామీతో పార్టీ చేరినట్లు ప్రచారం జరిగింది. వారిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందో అనే ఊగిసలాట కొనసాగుతుండగానే భూపాలపల్లి టికెట్ కొండా సుస్మిత పటేల్‌కే అంటూ కొండా దంపతులు ప్రకటించడం సంచలనంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తొలుత కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు చెందిన అనుచరుల మధ్య కొంతకాలం వర్గపోరు నడిచింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగిన తర్వాత తెరపైకి రాజాçరపు ప్రతాప్ వచ్చారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకు పోటీగా రాజారపు ప్రతాప్ కార్యక్రమాలు చేపట్టడంపై రాజయ్య వర్గం ఫైర్ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా గ్రూపు రాజకీయాలు, వర్గపోరు బహిర్గతమవుతున్నా పార్టీపరంగా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఈ వర్గపోరు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. -
అవిశ్వాసమే !
సాక్షి, పెద్దపల్లి: రామగుండం మేయర్‌పై అవిశ్వాసం కొనసాగనుంది. మేయర్‌ను మార్చాలని ప్రజలు బలంగా కోరుతున్నారని పదేపదే చెబుతూ వస్తున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నాటకీయ పరిణామాల అనంతరం అవిశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ముందునుంచి మేయర్‌ను దించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే తన అస్త్రశస్త్రాలు ఉపయోగించడంతో అధిష్టానం కూడా దిగివచ్చింది. కాగా సోమారపు రాజకీయ సన్యాసంతో కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన అవిశ్వాస రాజకీయం, ఎమ్మెల్యే ప్రకటనతో మళ్లీ ఊపందుకుంది. కలిసొచ్చిన రాజకీయ సన్యాసం మేయర్ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాసానికి మళ్లీ కదలికవచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల 39 మంది కార్పొరేటర్లు కలెక్టర్ శ్రీదేవసేనకు నోటీసు ఇచ్చారు. దీంతో అవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి రాష్ట్రంలోని ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి ఆపేయాలనడం తెలిసిందే. అవిశ్వాసంపై అధిష్టానం అనుసరించిన వైఖరితో మనస్థాపం చెందిన సోమారపు అనూహ్యంగా తన రాజకీయ సన్యాసం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చారు. ఆర్టీసీ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం ప్రకటన ప్రకంపనాలు సృష్టిం చింది. దీంతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, టి.హరీష్‌రావులు సోమారపుతో మంతనాలు జరపడంతో ఆయన తన రాజకీయ సన్యాస ప్రకటనను విరమించుకున్నారు. అదే సమయంలో రామగుం డం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొ న్ని ‘అధికారాలు’ పొందినట్లు సమాచారం. అం దులో ప్రధానమైనది మేయర్‌పై అవిశ్వాసం. అవిశ్వాసం వ్యవహారాన్ని ‘చూడాల్సిన’ బాధ్యతను పూర్తిగా ఎమ్మెల్యేపైనే పార్టీ భారం పెట్టింది. దీంతో అవిశ్వాసం వ్యవహారం మళ్లీ పట్టాలెక్కిం ది. మేయర్‌తో రాజీనామా చేయిస్తామని అధిషా ్టనం చెప్పినా, అవిశ్వాసం పెట్టనీయండని వారించినట్లు ఎమ్మెల్యే ప్రకటించడం ప్రస్తావనార్హం. ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం మళ్లీ తెరపైకి రావడంతో సందడి నెలకొంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, మరో ఇద్దరు కూడా మద్దతు పలికారు. ఇటీవలి పరిణామంలో ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే గ్రూప్‌ను వీడి మేయర్ పక్షాన చేరినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అవిశ్వాసానికి అనుకూలంగా ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. దీనితో అవిశ్వాసం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారిం ది. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉంటే, పార్టీ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
జాతీయ సదస్సుకు మేయర్ పాపాలాల్
ఖమ్మం వైరారోడ్ : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండో-సాన్ 2016 (స్వచ్ఛభారత్) జాతీయస్థాయి సదస్సులో పాల్గొనేందుకు ఖమ్మం మేయర్ పాపాలాల్ గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో రాష్ట్రస్థాయిలో ఎంపికైన 12 పట్టణాల్లో (అమృత్ పథకం కింద) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి నగదు ప్రోత్సాహకాను అందజేస్తారు. అలాగే జాతీయస్థాయిలో స్వచ్ఛభారత్ కింద చేపట్టే వివిధ కార్యక్రమాలు, రానున్న రోజుల్లో అనుసరించే విధివిధానాలపై ఉన్నతస్థాయి చర్చ జరుగుతుందని మేయర్ పాపాలాల్ తెలిపారు.