లాక్డౌన్..కరోనా గాన్!
న్యూఢిల్లీ : ప్రగతిశీల భావాలతో దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌తో మనం కరోనా మహమ్మారి నుంచి బయటపడే అవకాశాలున్నాయా? ఏప్రిల్ 30 నాటికి దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గనుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ మరో 18 రోజులు లాక్‌డౌన్‌ను పాటించడమే ఉత్తమమా? అంటే అవుననే అంటున్నాయి మిషిగాన్ యూనివర్సిటీ అధ్యయన ఫలితాలు. దేశంలో ప్రస్తుతం అమలవుతోన్న లాక్డౌన్ మంచి ఫలితాలనిస్తోందని, జనసముద్రమైన భారతదేశాన్ని ఇదే సురక్షిత తీరాలకు చేరుస్తుందని చెబుతున్నాయి. మిషిగాన్ యూనివర్సిటీకి చెందిన స్కాలర్లు, డేటా సైంటిస్టులు కలిసి ప్రొఫెసర్ బ్రమ్హర్ ముఖర్జీ నేతృత్వంలో భారత్‌లో లాక్డౌన్ అమలుపై నిషితంగా అధ్యయనం జరిపారు. కరోనా అనుమానితులు, పాజిటివ్ వచ్చిన వారు, కోలుకున్న వారిపై వీరు జరిపిన అధ్యయనంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరు మంచి ఫలితాలనిస్తుందని తేలింది. లాక్డౌన్ ఫలితంగా ఏప్రిల్ 30 నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుందని ఆ అధ్యయనం తేల్చింది. వచ్చే వారానికే ఈ తగ్గుదల కనిపిస్తుందని, మరో 20 రోజుల్లో ఇది తేటతెల్లమవుతుందని వెల్లడించింది. ఏప్రిల్ 14తో ముగియనున్న 21 రోజుల లాక్డౌన్లో భాగంగా ప్రజలు భౌతిక దూరాన్ని బాగా పాటించారని, సరిహద్దులను మూసివేయడం మంచి ఫలితాలను ఇచ్చిం దని మిషిగాన్ అధ్యయనంలో తేలింది.
‘భారతదేశంలో లాక్డౌన్ బాగా అమలయింది. దీని ఫలితంగానే వైరస్ సంక్రమణ దశకు రాలేదు. వచ్చే వారం కల్లా ఫలితాలు చాలా బాగుంటా య ని ఆశిస్తున్నాం’అని అధ్యయన బృందం సభ్యు డు, జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ దెబాశిష్‌రాయ్ వెల్లడించడం దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న తీరుకు అద్దం పడుతోంది. జూన్ 1 తర్వాత భారత్‌లో ఆంక్షలు అవసరం లేకపోవచ్చని, ప్రజలు అన్ని విధాలుగా స్వేచ్ఛగా ఉండే అవకాశం రావచ్చని ఈ అధ్యయన బృందంలో సభ్యుడైన మిషిగాన్ యూనివర్సిటీ సాల్వేటర్ మాక్స్వెల్ అభిప్రాయపడ్డారు. రోజువారీగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెబ్‌నాయిర్‌లో ఉంచారు. దీని ప్రకారం 21 రోజుల లాక్‌డౌన్‌ను 28 రోజుల పాటు పొడిగించడం వల్ల ఉపయోగం లేదని, దాన్ని 42 రోజులకు పొడిగిస్తేనే ఫలితం ఉంటుందని తేలింది.
సంక్రమణ దశలోకి వెళుతున్నామా?
దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ దశకు చేరుకుందని, దాని నుంచి బయటపడే స్థితి ఇప్పట్లో లేదనే కోణంలో వెలువడిన మరో అధ్యయనం గుబులు పుట్టిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షణలో నిర్వహించే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) ప్రచురించిన ఓ అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర అనారోగ్య లక్షణాలున్న (ఎస్ఏఆర్ఐ) 5,911 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 104 (1.8 శాతం) మందికి పాజిటివ్ అని తేలినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. ఇందులో 40 మంది గతంలో ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసినట్టు లేదని, వీరు దేశంలోని 15 రాష్ట్రాలు, 36 జిల్లాలకు చెందిన వారని వెల్లడించింది. మరో ఇద్దరు గతంలో విదేశీ ప్రయాణాలు చేసిన వారిని కలిసిన వారని తెలిపింది. ఈ 5,911 మందిలో 965 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి 15–29 మధ్య వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో 102 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. దీన్ని బట్టి కరోనా వైరస్ దేశంలో సంక్రమణ దశకు చేరుకుందనే అనుమానాలను ఆ జర్నల్ ప్రచురించిన వ్యాసంలో వెల్లడించింది.
లాక్డౌన్ లేకపోతే..
కాగా, ఈ అధ్యయనాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. దేశంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నందునే పరిస్థితి అదుపులో ఉంద ని వెల్లడించింది. లాక్డౌన్ అమల్లో లేకపోతే ఏప్రిల్ 15 నాటికే దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1.2 లక్షలు దాటేదని తెలిపింది. దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగానే ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పదుల వేలకు చేరలేదని పేర్కొంది.